January 7, 2020

చింతామణి-హెచ్.ఎమ్.వి క్యాసెట్టు మొదటిభాగం

"చింతామణి" తెలుగు నాట బహు ప్రసిద్ధి  చెందిన నాటకం. 
20వ శతాబ్దంలో మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది.
ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం.ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ద ప్రతిష్టుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపించి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయం కాదది. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘిక చైతన్యం ఈనాడు చదివితే రచయిత గొప్పదనం, నాటకం విశిష్టత తేటతెల్లమవుతుంది. 

ప్రధాన పాత్రలు:-
చింతామణి
బిల్వమంగళుడు
సుబ్బిశెట్టి
భవానీ శంకరం
శ్రీహరి
చిత్ర

నాటక కథ:


చింతామణి ఒక వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి,చెల్లి చిత్ర. భవానీ శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె ప్రధాన విటులు.ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవానీ శంకరం ద్వారా చింతామణి...అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు అయిన బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చినదనుకున్న ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది చింతామణి. బిల్వమంగళునిలో పరివర్తన వస్తుంది. ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది.బిల్వమంగళుడు కూడా సోమదేవ మహర్షి పిలుపువల్ల ప్రభావితుడై ఆశ్రమ స్వీకారం చేసి అనంతర కాలంలో లీలాశుక యోగీంద్రుడుగా మారి శ్రీ కృష్ణ కర్ణామృతం అనే సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు. 

చింతామణి నాటకం డైలాగులు హెచ్.ఎమ్.వి వాళ్ళు రెండు క్యాసెట్ల రూపంలో తెచ్చారు. అది కాళ్ళకూరి నారాయణరావు గారు తొలుత వ్రాసిన నాటకాన్ని చాలా మార్చి ఇంకా లోతుగా జనబాహుళ్యం లోకి వెళ్ళగలిగేలా చేశారు. ఇందులోని డైలాగులు మొత్తం గుంటూరు, ప్రకాశం జిల్లాల మాండలికంలో జరుగుతుంది. ఈ కథ సర్వకాలాలందును, సర్వ వ్యవస్థలలోనూ నిబిడీకృతమయిన ఒక వ్యసనం గూర్చిన ప్రస్తావన. కథావిషయం, వాక్యప్రసంగం దాదాపు కాలాతీతం. అందుకే ఈ నాటకం చిరస్థాయిగా నిలిచింది. 

గాత్రధారులు: వి.వి.స్వామి, చీరాల సుబ్బయ్య, లతా లక్ష్మి ముఖ్యులు. 


చింతామణి:-
"కృష్ణా... ఆ..ఆ..ఆ..
రార మా ఇంటికి... కృష్ణయ్యా
రార మా ఇంటికి... కృష్ణయ్యా
రావోయి మా ఇంటికి... కృష్ణయ్యా
రావోయి మా ఇంటికి.."
శ్రీహరి:-
"నీ పాటేగాని నా మాట నాటుకుండందేమే నీకు?
ఆ భవానీశంకరం గాడ్ని ఈడ్చి బయటపడేయమని ఎన్నిసార్లు చెప్పానూ!....
వాడు మనకొంపలో వద్దే...వాడు మనకొంపలో వుంటే పొట్లకాయకు బొచ్చుపురుగు పట్టినట్లే అని ఎన్నిసార్లు చెప్పానూ!?...."

చింతామణి:-
"అమ్మా... !
వగలనూ...వలపులూ వర్షించి
తొలినాడే తిరుగని పిచ్చి యెత్తించినానూ..
వచ్చిన నెలలోనే మచ్చిక మీఱ
లాలించి మాన్యమ్ములమ్మించినాను
బన్నసరాలకై (బన్నసరము=నానావిధములయిన మణులు గ్రుచ్చిన హారము),
పట్టుపుట్టమ్ములకై ఇల్లు విక్రయము చేయించినాను
దిన వెచ్చముల కని, తినుబండముల కని
పెండ్లాము నగలు మార్పించినాను
అన్ని వగలు చూపి, ఇన్ని రీతులు మాపి
ఎట్టులింతలోనే ఏగుమందు?
ఆతడుస్సురన్నా...
ఆతడుస్సురన్నా....
ఆతని కడగొన్న ద్రవ్యమెట్లు
మనకు దక్కునమ్మా?
ఆ...."

శ్రీహరి:- 
"ఆ భవానీశంకరం గాడేడీ?"

చిత్ర:-  
"ఎవరినో అప్పడిగినారటే...."

శ్రీహరి:-  
"అప్పా...
ఈడి తెలివీ ఈడు నాశనమైపోతే....
ఆ పంగనామాలు పెట్టుకుని మన కొంపకొచ్చే ఆయన ఎంత తెలివికల్లోడే...
ఆంజనేయులు గుడి కట్టిస్తానని.... 
ఆరువేలు వసూలు చేసి.... ఏడెకరాల మాగాణి కొన్నాడు.
తెలివంటే అదమ్మా...
అమ్మమ్మా!... అసలువిషయం మర్చిపోయానే తల్లీ!
సుబ్బిశెట్టి గారు ఈలేస్తూ మన ఇంటికొచ్చాడమ్మా!"

చింతామణి:-   
"మొన్న మేజువాణిలో రవంత రంగు చేసానే..."

శ్రీహరి:- 
"రుచి తగిలిందన్నమాట..అందుట్లో నీ చేయి సామాన్యమమ్మా!
నీ చేయితగిలితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టేగా"

సుబ్బిశెట్టి:-
"లచ్చప్పా..ఊపిరాడ్డంలా... వదిలేయ్ పోతా..."

శ్రీహరి:- 
"వస్తున్నా బాబూ...!
అమ్మా!... నువ్ "ఊ" అనవే తల్లీ....
దయచేయండి బాబూ! దయచేయండి."

సుబ్బిశెట్టి:-  
"ఇంకేమొచ్చేది? ఇంజన్ సల్ల బడింది."

శ్రీహరి:- 
"వణుకుతున్నారేం... భయపడ్డారా?.."

సుబ్బిశెట్టి:-
"భయమెందుకు లచ్చప్పా" "ధైర్ణమే సాహసం... ఉబ్బసమే దగ్గన్నారు."

శ్రీహరి:- 
"అబ్బాయి పండితుడే..."

సుబ్బిశెట్టి:-
"ఆ..ఎక్కాలు కూడా వచ్చు..
లచ్చప్పా..మాట"... "అమ్మాయికి ఆపరేషన్ చేయించావా?"

శ్రీహరి:- 
"లేదునాయనా... నే చేయించుకున్నా.."

సుబ్బిశెట్టి:- 
"నీకవసరమేలే..."

శ్రీహరి:- 
"కోక పెట్టారయ్యా"

సుబ్బిశెట్టి:- 
"ఇప్పుడు రొక్కం ఇత్తన్నారంటగా..."

శ్రీహరి:- 
"ఎక్కడా...!?"

సుబ్బిశెట్టి:- 
"మళ్ళీ చేయించుకుంటావా ఏంది?
సరేలే..అమ్మాయేదీ?"

శ్రీహరి:- 
"బట్టలు కట్టుకుంటుంది."

సుబ్బిశెట్టి:- 
"ఎధవ బట్టలు తర్వాత కట్టుకోవచ్చు. ఎట్టుంటే అట్టొచ్చేయమను.."

శ్రీహరి:-   
"అయ్యో! నువ్ మగాడివి కదూ....!"

సుబ్బిశెట్టి:-   
"అవును! హడావిడిలో మర్చిపోయా..."

శ్రీహరి:- 
"అమ్మాయి మిమ్మల్ని మేజువాణి కచేరీలో చూసింది...మంచాన పడింది."

సుబ్బిశెట్టి:- 
"ఇంకానయం... బావిలో పడాల్సింది.."

శ్రీహరి:- 
"లోనికి రమ్మనవే...!"

చింతామణి:-
"రంగనాయకిని విడిచి వత్తురా ఏమి?"

శ్రీహరి:- 
"ఆయనకేం ఖర్మ... ఆ ఇంటికి పోవటానికి?
రూపమునకా మన్మధుడు..."  

సుబ్బిశెట్టి:- 
"ఆ...చర్మం మందంలే లచ్చప్పా..అక్కడొచ్చింది అందం."

శ్రీహరి:- 
"ఆ నడక చూడవే అంతా అత్తరమ్మే సత్తారు సాయిబ్బు నడకే తల్లీ..."

సుబ్బిశెట్టి:- 
"నయం... లుంగీలమ్మే లంగడా సాయిబ్బు నడకన్లా..."

శ్రీహరి:- 
"రంగుచూడమ్మా! ఇస్పేట్ ఆసు...."

సుబ్బిశెట్టి:- 
"ఇస్పేట్ ఆసు కాదు లచ్చప్పా.. రెడీ క్యాషు"

శ్రీహరి:- 
"బాబూ... జేబులో ఏమన్నా సిగ్గుమాలిందుందా?"

సుబ్బిశెట్టి:- 
"చుట్టముక్కేగా... ఛీ..ఫ్యాషన్ గాదు. సిగరెట్టు కాల్చు... ఇదిగో పది పైసలు."

శ్రీహరి:- 
"వద్దు నాయనా అలవాటు లేదు..."
"బాబూ! నాయనా... నాయనా..."

సుబ్బిశెట్టి:- 
"అయ్యో! మీదబడి ఏడుస్తావేందీ? మొఖాన తుప్పర పడతంది..."
"వామ్మో ఇది నోరా... పంచాయితీ బోర్డు పంపా?"

శ్రీహరి:- 
"పదహారు సంవత్సరాలు పెంచా అమ్మాయిని... చింతామణమ్మాయిని
మొగోడి మొహం తెలియకుండా..మీ చేతుల్లో పెడుతున్నా....
మన్మధ మొలక నాయనా..."  

సుబ్బిశెట్టి:- 
"అమ్మాయి మన్మధమొలకే...అమ్మ మార్కాపురం పలక..."

శ్రీహరి:- 
"ఆ..... అబ్బాయి మోటుబాయి గిలక..."

సుబ్బిశెట్టి:- 
"థూ.థూ..దిష్టి.."

చింతామణి:-   
"అలాచూస్తారేం... రండీ..."

సుబ్బిశెట్టి:- 
"లాగబాక ...చేతికి చెయ్ తగిలేసరికి
ఐసై.. అట్టై రొట్టై మట్టై పోయా."

చింతామణి:-   
"పాడుదునా... గీతం
గమదనిస దనిమదని...
పాడుదునా... గీతం."

సుబ్బిశెట్టి:- 
"ఆటొద్దు ఆటొద్దు అట్టాగే పట్టుకో భలేఉంది."

చింతామణి:-   
"అయ్యెయ్యో... నా చాటుకొస్తారే.... భయపడకండి."

సుబ్బిశెట్టి:- 
"అరెరె... ఏందా చప్పుడు? నాకు భయం లేదులే
ఎటు పోవాలో చూసుకుంటున్నా."

చింతామణి:-   
"మా చిత్ర లోపల ఏమో కదుపుచున్నది."

సుబ్బిశెట్టి:- 
"చిత్రా...! కలబడితే పదిమందిని కొట్టగలిగినోడిని కాబట్టి సరిపోయింది.
ఇంకెవరన్నా అదురోడయితే వాడి గతేం కావాలా?
చిత్రనొక్కసారి బయటికి పిలవండి."

చింతామణి:-   
"చిత్రా...!"

చిత్ర:-   
"ఓయ్...!"

సుబ్బిశెట్టి:-     
"అబ్బో పిల్ల కూతకొచ్చిందే...
చిత్రా...కమానో..!
అయ్యో!.. మీదబడతావేందీ?
వామ్మో! ఏం తగులుడు తగిలిందిరో
చెడిపోయిన ఆర్టీసీ బస్సుని షెడ్ లోకి నెట్టినట్టేనే..."

చిత్ర:- 
"బావగారూ!.. ఒక రూపాయ్ ఇవ్వండి."  

సుబ్బిశెట్టి:-   
"అమ్మకి రూపాయ్ ఇచ్చా..."

చిత్ర:- 
"నాకూ రూపాయ్ ఇవ్వండి."

సుబ్బిశెట్టి:- 
అరెరె... అంత అనుభవంగల అమ్మకి రూపాయ్.... నీకూ రూపాయేనా?

చిత్ర:- 
"అయితే అయిదివ్వండి."

సుబ్బిశెట్టి:- 
"అర్ధురూపాయ్ తీసుకోరాదూ...
అసలు డబ్బులెందుకే నీకూ?"

చిత్ర:- 
"కాఫీ తాగుతాను."

సుబ్బిశెట్టి:- 
"కాఫీకి డబ్బులెందుకే...? కాకాహోటల్ చూసి ఖాతా పెట్టు."

చిత్ర:- 
"ఆడపిల్లకి అప్పెవరిస్తారు?"

సుబ్బిశెట్టి:- 
"భలేదానివే.... అయ్యో! నీకింకా యాపారంలో పట్టు దొరకలేదన్నమాట.
ఇదిగో....ఇదిగో."

చిత్ర:-  
"వస్తా... బావగారూ"

సుబ్బిశెట్టి:- 
"పోవోయ్."

చిత్ర:- 
"ఓయ్..ఏంటి? ముద్దుగా... చిట్టీ, చిన్నీ అనలేరూ?"

సుబ్బిశెట్టి:- 
"నయ్యం ఇజ్జూ... ఇస్కూ అనొద్దూ..."

చిత్ర:- 
"టాటా.... ఛీరియో....బైబై "

సుబ్బిశెట్టి:- 
"ఏందీ...! నన్ను తాటతీసి, చీరదీసి బాయిలో ఏసుద్దా?"

చింతామణి:-  
"ఇంగ్లీషులో చెప్పిందిలే... రండీ."

సుబ్బిశెట్టి:- 
"రండి...ఒరే ఒరే ఎంత మర్యాద?
ఏవండీ... ఆ ఎధవ ముండ రంగనాయకి నన్నిట్ట ఎప్పుడూ పిలవలేదండీ..."

చింతామణి:-  
"పెంపుడుముండ...
మర్యాద దానికేమి తెలియును?
హద్దుచెడి, కని...పొట్టకై అమ్ముకొనెడి సాలె, ఉప్పర, యానాది, చాకి, పాకి
ఇండ్ర జేండ్ర పిల్లలంగొనీ ఇందువదన, చంద్రవదనలం గావింతు సానులిపుడు
ఆ....."

సుబ్బిశెట్టి:-   
"అబ్బో.. అంతా డ్యామేజీ సరుకేనే....అయితే ఎంత గిట్టుబాటవ్వుద్దండీ....?"

చింతామణి:-  
"గిట్టకేమి?...
మెరకవీధిని పెద్ద మేడగట్టిన చిట్టి సంతలో కొన్నట్టి
చాకి ముండా... మీసందు చివరిలో మిద్దెలో నివసించు
వనజాక్షి కూతురు వాడ ముండా...
బండిమీదను గాని బయటికే రాని ఆ నగరాజతనయ..."

సుబ్బిశెట్టి:-   
"వామ్మో! వారి సంగతే మనకొద్దు..."

చింతామణి:-  
"ఏం?"

సుబ్బిశెట్టి:-   
"గళ్ళ లుంగీ, బుట్ట క్రాఫు, బొడ్లో కత్తి వాడు దాని తమ్ముడేనంటగా..."

చింతామణి:-  
"అయితే ఏం?"

సుబ్బిశెట్టి:- 
"మొన్నరాత్రి వాళ్ళ బజారెళ్ళాలెండి..వేరే పనుండి
నన్నుచూసి ఆ ఎధవ మీసం మెలేశాడు
నేనూ మెలేశా
ఏమోయ్ శెట్టీ అన్నాడు
షటప్ యువర్ మౌత్ అన్నా
అంతే... దెబ్బకొడితే ముందుకుపడితే ముగ్గురు లేవదీశారు."

చింతామణి:-  
"అబ్బా! అంతదెబ్బ కొట్టారా మీరు?"

సుబ్బిశెట్టి:- 
"కొట్టిందెవవరో గుర్తులేదండీ... లేవదీసింది నన్నే..."

చింతామణి:-  
"పుడమి దైవికముగ పడి మొలచినట్టి మొక్క పెనువృక్షమగునట్లు మూడుపాళ్ళు పై కులంబులనుండి సంప్రాప్తమయినవారే పెద్ద సానులగుచున్నవారు నేడూ...:

సుబ్బిశెట్టి:- 
"డోంట్ బీ అఫ్రైడ్.... మీ యాపారానికేమండీ!....చిత్ర ఎక్కొచ్చింది...సీనియర్ హ్యాండు అమ్ముంది లైన్లో మీరున్నారు.... ఊళ్ళో యాపారస్తులున్నారు."

చింతామణి:- 
"చాల్లేండి..." (నవ్వుచూ)

సుబ్బిశెట్టి:- 
"ఆ నవ్వే నా కొంప తీసింది
మొన్న మేజువాణి కచ్చేరిలో చూశాను
అంతే...ఎర్రి సూపు చూడ్టం... గుడ్డలు చించుకుంటం.
నిద్దట్లో లేచి "సింతామణీ వచ్చావా" అని పక్కన పడుకున్న మా మామని వాటేసుకున్నా.
వంద దెబ్బ కొట్టాడు చెప్పుతో
ఎవురితోటయినా చెబుతావా?..."

చింతామణి:-  
"సరేలెండి.... తాంబూలం వేసుకుంటారా?"

సుబ్బిశెట్టి:- 
"ఒక్క రవ్వ కొరికి పెడతావా?"

చింతామణి:-  
"ఛీ! నా ఎంగిలి తింటారా?"

సుబ్బిశెట్టి:-   
"అయ్యో!
కాఫీ హోటల్ కప్పుకీ... మీ నోటికీ తేడా ఏముంది?
అంతా సోషలిజమే.."

చింతామణి:-  
"అలా కుర్చీలో కూర్చుంటే... మీరెంత అందంగా ఉన్నారండీ..."

సుబ్బిశెట్టి:- 
"నా అందం ఇప్పుడేం చూసా?
నాకారో సంవత్సరం వయసొచ్చే దాకా అన్నీ మంచంలోనే...
"చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరున్"

చింతామణి:-  
"కమ్మగా పాడతారే..."

సుబ్బిశెట్టి:-    
"ఆ....
ఒకసారి హనుమంతుడి వేషం వేసి
కాలే తోకతో ఎగురుతుంటే అడ్డంగట్టిన దుప్పటికాలి,
పక్కున్న ఇల్లు ముట్టుకుని, ఊరికి చుట్టుకుంది
"శెట్టిగారు ఏరిరా" అని జనం ఎగబడ్డారు
నన్నింట్లో పెట్టి తాళం ఏశారు.... దిష్టి దెబ్బని..."

చింతామణి:-  
"అబ్బా...!
రాగము తీయబూనుట, సరాగము లాడుట
మేనిసొమ్ము లేలాగుననైన సానికనులన్ బడజేయుట
డాబులూరకే వాగుట...ఆ
చప్పుడౌ కరణి పైకము తట్టుటా...భోగి పోలికన్
త్యాగివలె నటించుట, విటావళి చేష్టలు క్రొత్తచోటులన్
ఆ....
ఏవండీ.... గాజురాళ్ళ ఉంగరములు ధరించితిరేమి?"

సుబ్బిశెట్టి:- 
"గాజురాళ్ళా! ఎవడా అన్న ఎధవ?
పిలువ్... చాటుకు పోయి కలబడతాను.
ఇవి రవ్వల ఉంగరాలు...కావాలంటే తీసుకుని చూడండీ."

చింతామణి:-  
"ఇప్పుదండముగానే ఉన్నవి."

సుబ్బిశెట్టి (స్వగతంలో):-  
"బాగానే ఉంటాయ్... లోకుల సొమ్ము."

చింతామణి:- 
"ఇవి నాకిచ్చినట్లు తెలిసిన... మీ రంగనాయకి ...
మిమ్ములను బతకనివ్వదేమో...!"

సుబ్బిశెట్టి:-    
"వామ్మో.... కొంపముంచింది."

చింతామణి:- 
"నీమీద మనసింక నిలుపంగ లేరా...
నిలుపంగ లేరా రావోయి రాజా....
అందాల రోజా రావోయి రాజా...
అందాల రోజా..."

"నవ్వండీ..."

సుబ్బిశెట్టి:- 
"నవ్వుతానే ఉన్నాన్లేండీ."

చింతామణి:- 
"నవ్వండంటే...."

సుబ్బిశెట్టి:- 
"ఆ..ఆ..ఆ.."

చింతామణి:- 
"అలా కాదు...."

సుబ్బిశెట్టి:- 
"ఆ..."

చింతామణి:-
"కిలకిలా నవ్వాలి."

సుబ్బిశెట్టి:- 
"నయం కిందపడి గిజగిజా తన్నుకోమన్లా..."

శ్రీహరి:- 
"అమ్మా! ఏం చేస్తున్నారే లోపలా?..."

సుబ్బిశెట్టి:- 
"అమ్మతోడు!.. మేం ఏం జేయటంలా
గజం దూరంలో ఉన్నాం."

శ్రీహరి:- 
"ఆ... బందరోళ్ళు భజనకొచ్చారు."

సుబ్బిశెట్టి:- 
"నయ్యం... కోవూరోళ్ళు కోలాటానికి రాలా?"

చింతామణి:- 
"ఏమండీ... నాకు లోన పనుంది."

సుబ్బిశెట్టి:- 
"ఆ.. అందుకు నన్ను వాకిట్లో ఉండమంటారా? వచ్చే పోయే వాళ్ళ లిస్టు రాసుకోమంటారా?"

చింతామణి:- 
"మా అమ్మతో మాట్లాడుతూ ఉండండి."

సుబ్బిశెట్టి:- 
"ఏవండీ... నేనిక్కడికొచ్చింది అమ్మ కోసమేనా?"

శ్రీహరి:- 
"అమ్మా! ఈ శెట్టిగారేమన్నా చేపాడా? ఒట్టి అరుపులేనా?"

చింతామణి:- 
"ఇవిగోనమ్మా....వాచీలు, ఉంగరాలు."

శ్రీహరి:- 
"ఉంగరాలా...మా అమ్మే ఇవమ్మా నా గుణాలు.
మనింటికొచ్చినోడికీ తిరపతి పోయొచ్చినోడికీ తేడా ఉండగూడదమ్మా.
పెద్దిశెట్టిగారు రవ్వల గాజులు తెచ్చారంటా..
నీవు లోపలికి బోమ్మా...
ఈయన సంగతి నేఁ చూస్తాను.
అల్లుడుగారూ...! ఏందా మొకం నిండా?"

సుబ్బిశెట్టి:-   
"అట్టడగ్గోడదు...లవ్ లో అనేకం జేసుకుంటాం.
అమ్మాయ్ స్నో పూసింది."

శ్రీహరి:- 
"స్నో...
మొకం బాగుంది నాయనా....
మిరపతోటలో పెడతారే పిడత..."

సుబ్బిశెట్టి:- 
"సరేలే... అమ్మాయేదీ?"

శ్రీహరి:- 
"అమ్మాయితో పనెందుకు?"

సుబ్బిశెట్టి:- 
"ఆడుకుందామనీ..."

శ్రీహరి:- 
"ఆ..
చిన్నది దానికేం తెలుసు నాయనా.
ఉండ విద్యంతా నా దగ్గరుంది...
ఏ గువ్వకూ గానీ... తూరుపు తెలవారే
పోరా ఈ వేళకు."

సుబ్బిశెట్టి:- 
"రూపాయ్ తీసుకుని "పోరా" అని పాట పాడతారేందీ?"

చిత్ర:-  
"బావగారు... బావగారు... మీ నాన్నగారొచ్చారు."

సుబ్బిశెట్టి:- 
"ఏడిశాడు ఎధవ."

చిత్ర:- 
"అమ్మో... మీ నాన్న."

సుబ్బిశెట్టి:- 
"వామ్మో! మా అయ్యకి ఇక్కడ కూడా ఉందా ఖాతా?"

శ్రీహరి:- 
"రాండీ... అబ్బాయ్ గూడా లోపలే ఉండారు."

సుబ్బిశెట్టి:- 
"లచ్చప్ప లచ్చప్ప నీకు దణ్ణం పెడతా
మా అయ్యకి చెప్పబాక... ఖారాకిళ్ళీ, కట్ట బీడీలు తెచ్చిత్తా..."

చిత్ర:- 
"బావగారూ... ఈకోటు నాకు చాలా బావుంటుందండీ."

సుబ్బిశెట్టి:- 
"బాగుంటదామ్మా...! తుండుగుడ్డియ్."

చిత్ర:- 
"ఎందుకు?"

సుబ్బిశెట్టి:-    
"గోచీ పెట్టుకుని, పంచె కూడా ఊడదీసిచ్చిపోతా.."

చిత్ర:- 
"తొందరగా వెళ్ళండి."

సుబ్బిశెట్టి:- 
"వామ్మో! వాచీ ఉంగరాలిచ్చా...."

శ్రీహరి:- 
"అరె... ఎళ్ళవయ్యా.."

సుబ్బిశెట్టి:-    
"ఇచ్చా... వాచీ....అమ్మకి రూపాయ్ ఇచ్చా..."

చిత్ర:- 
"వెళ్ళండి."

శ్రీహరి:-
"అరె... పోతేపోనియ్."

సుబ్బిశెట్టి:- 
"నెడతారేంది!?... మడిసిని నెడతారేందీ?"

శ్రీహరి:-
"అడుగో మీ నాన్న."

సుబ్బిశెట్టి:- 
"వామ్మో! ముంచారు కొంప.."

చింతామణి:- 
"అదిగో బిల్వమంగళమూర్తి వచ్చే వేళయింది...
కోరిన బిల్వమంగళుడు కూరిమి మీరగ నేటి రేయి
నన్ను చేరగ వచ్చుచుండెనని తీయని ఊహలలోన తేలనా?
లేక..... శారద పాండితీసముని జారునిగా నొనరించి నీచతా
ఘోర తరాగ్ని కూపమున కూల్చిన పాపినటంచు మ్రగ్గనా....?ఆ...."

శ్రీహరి:-
"అబ్బా!
నా గొంతు పుట్టింది గానీ... నా కులుకు రాలేదమ్మా.
కులుకు లేకపోతే ఈ రోజుల్లో ముసలోళ్ళకి నచ్చదమ్మా.
ఒక్కొక్కామె చూడూ... కుర్రోళ్ళని చూసి కులకబోయి బజార్న బండికింద బడుద్ది."

చింతామణి:- 
"పోవే..!"

శ్రీహరి:-
"అట్లనగూడదమ్మా...
ఎనక నే గుళ్ళో ఆడే రోజుల్లో... దేవుడికి పూజెవడు చేశాడమ్మా?
అర్చకుడు కూడా నన్ను చూశాడు... పిలక తీసి క్యాప్ పెట్టాడు."

చింతామణి:- 
"అమ్మా..! నా అందం ఎలా ఉందీ?"

శ్రీహరి:-
"దేవకన్య.... ఆయనకూడా ఇదే అడిగేవోడమ్మా.."

చింతామణి:- 
"ఎవరూ..?"

శ్రీహరి:-
"ఎవురని చెప్పేదిలేమ్మా వీరయ్యకి పేరు...
నా కోకలన్నీ ఆయనే ఉతికేవాడు.
సరేగానమ్మా  భలే ఉందమ్మా ముస్తాబు... ఇట్లుండాలమ్మా...!
ఒక్కొక్కామె చూడు దేశంలో... గంటగంటకీ ముస్తాబవ్వుద్ది.
వారానికోసారి మొహం కడుగుద్ది
ఏంటీ హడావుడీ?"

చిత్ర:- 
"బిల్వమంగళమూర్తి  వస్తున్నారే..."

శ్రీహరి:-
"బిల్వమంగళమూర్తి గారా....! వెనకాల్న ఆయన మంచి ఊపులో ఉన్నప్పుడు వాళ్ళ నాయన మీద వేసా కన్ను.... జారిపోయాడు.. ఎవురు చెప్పారమ్మా?"

చిత్ర:- 
"భవానీ శంకరం చెప్పారు."

శ్రీహరి:-
"భేష్... భవానీ క్లాసు మారిందీ...
ఇంకేం..!!
మద్దెల నేర్పు. మెడకేస్కుని నిలబడతాడు.
అమ్మా!
వచ్చేది మహాపండితుడు.
దేశంలో పనికిమాలినోళ్ళు పాడే ఎదవ పాటలు పాడేవు."

చింతామణి:- 
"నాకు తెలుసులేవే.  
ఆ...
మానస సంచరరే..
బ్రహ్మణి మానస సంచరరే...
మదశిఖిపింఛా అలంకృత చికురే
మదశిఖిపింఛా అలంకృత చికురే 
మహనీయ కపోల విజితముకురే
మానస సంచరరే...
బ్రహ్మణి మానస సంచరరే..."

సుబ్బిశెట్టి:- 
"ఆ...ఆ...ఆ..."

చింతామణి:-
"శెట్టి దాపురిస్తున్నాడే...!"

శ్రీహరి:-
"నేను "ఆ" అంటే చెమట్లు కమ్మాల ..."

సుబ్బిశెట్టి:- 
"ఎన్నో ఏండ్లు గతించుకునిపోయినవి గానీ..."

చింతామణి:-
"సంగీతంలో పడ్డావే.... యాపారం ఏం చేశా?"

సుబ్బిశెట్టి:- 
"యాపారం ఎక్కి రావడంలా..."

చింతామణి:-
"ఏం....?"

సుబ్బిశెట్టి:- 
"ఏం చేస్తాం?
అప్పివ్వకపోతే ఉరిమిచూస్తన్నారు....అడిగితే తన్నబోతన్నారు..."

శ్రీహరి:-
:అందుకనీ ...?"

సుబ్బిశెట్టి:- 
"హరిశ్చంద్రుడి వేషం ప్రాక్టీస్  చేస్తన్నా..."

శ్రీహరి:-
"భేష్! మేక నలుపు కదూ... కాటి సీను బాగుంటది."

సుబ్బిశెట్టి:-    
"ఈరోజుల్లో మనిషి నెవడు చూత్తన్నాడు?
ఒక మాదిరి కుండ, చేపాటి కర్రుంటే చాలు."

శ్రీహరి:-
"అంతేనమ్మా.... ఐదు రూపాయిలిచ్చేది... వన్స్ మోర్ లు కొట్టించుకునేది..."

సుబ్బిశెట్టి:- 
"వాడొస్తున్నాడు... తలుపేయ్ తలుపేయ్ తలుపేయ్...!"

శ్రీహరి:-
"వాడెవడో ఆడోళ్ళని గొడవ చేసే వెధవ..."

సుబ్బిశెట్టి:- 
"ఈడింకా ఎధవ..
వీరభద్రుడి గుళ్ళో వెండి మీసాలు నూకాడు.
ఈయనకంటా... చందా ఇయ్యాలంట."

శ్రీహరి:-
"ఇస్తే పోలా..."

సుబ్బిశెట్టి:- 
"ఎందుకు పోదూ ...!
ఏకాహం చేస్తానండీ అంటే ఏడొందలిచ్చా... ఏసుకుని పొడుకున్నాడు.
పెసాదం ఏదిరా అంటే పీపా చూపిచ్చాడు."

శ్రీహరి:-
"నక్లిస్ ఏదీ ? అమ్మాయ్ అన్నం తింటంలా... "

సుబ్బిశెట్టి:- 
"నీకింకా ఇయ్యలా!
ఏ జేబులో పెట్టానబ్బా...."

శ్రీహరి:-
"శెట్టిగారు జేబులో చేయి పెట్టాడమ్మా...
చొప్పదూసినట్లు దూయడమే ..."

సుబ్బిశెట్టి:- 
"లచ్చప్పా....
నాపెంపు నీకు తెలియదూ...?
నీ పుట్టిన్రోజు పండక్కి.. బస్తా పిడకలు, బండెడు కట్టెలు పంపిచ్చా...
లెక్క రాసుకున్నానా?"

శ్రీహరి:-
"నిజమేనయ్యా.... అయ్యి పచ్చియ్యి, తడిసినియ్యి ..."

సుబ్బిశెట్టి:- 
"మండలా...కాస్తి పెట్రోలు పొయ్యకపోయా...
ఇస్తాగానీ ఏదీ ఒక పాట పాడితే..."

శ్రీహరి:-
"శత యోజనంబై..."

సుబ్బిశెట్టి:- 
"లచ్చప్పా...  దణ్ణం పెడతా నువ్వుకాదమ్మా...
అమ్మాయ్ చేత పాడిచ్చు..."

చింతామణి:-
"నీకు తోడు పాటా....
నీ మొకము చూడ కంటికి నిద్ర రాదు..."

సుబ్బిశెట్టి:-   
"అదేంది... లచ్చప్పా మొకం అంటదీ?"

శ్రీహరి:-
"మొఖమంతా కాదులే.... నల్లటి పెదాల్లో ఉన్న పర్సనాలిటీ..."

సుబ్బిశెట్టి:-   
"అక్కడందమే..."

చింతామణి:-
"సరసమాడిన ఒడలు కంపరము పుట్టు..."

సుబ్బిశెట్టి:-  
"అదేంది గీక్కునే పని పురుగు చేష్టలాగా...."

శ్రీహరి:-
"గీక్కోటం కాదులే.... తలుపేసి ఊరక గిల్లటం.."

సుబ్బిశెట్టి:-
"ఉ ...ఊ..."

చింతామణి:-
"కోటి పాపాల పెట్టు నీ గొంతువిన్న..."

సుబ్బిశెట్టి:-
"ఆ..."

చింతామణి:-
"బ్రతుకుపై తృటిలోన విరక్తి కల్గు...ఆ.."

సుబ్బిశెట్టి:-    
"అదేంది గొంతూ, పాపం అంటదీ?"

శ్రీహరి:-
"గొంతంటే పరమాత్మ కద నాయనా...
నీ గొంతిన్నాం. మా ఇద్దరికి మోక్షం వచ్చేసింది."

సుబ్బిశెట్టి:- 
"మీ ఇద్దరికొచ్చింది ... అబ్బా దాన్నన్యాయం చేశారే..."

శ్రీహరి:-
"అదెవరు?.."

సుబ్బిశెట్టి:- 
"చిత్ర...
మడిసి మడిసికి ఏడ పాడేదబ్బా...
అదిగూడా వింటే ఇంటి మొత్తానికి ఒకసారే వచ్చేదే..."

శ్రీహరి:-
"ఏంటదీ?"

సుబ్బిశెట్టి:- 
"మోక్షం."

శ్రీహరి:-
"సరే గానీ....
జేబులో చేయిబెట్టి లాగవే నక్లెస్సు...."

సుబ్బిశెట్టి:- 
"ఇంకా నీకియ్యలా...
ఏ జేబులో ఉందబ్బా?"

శ్రీహరి:-
"మెళ్ళో ఏసుకుంటే మోకాళ్ళు దాటాల...."

సుబ్బిశెట్టి:- 
"గిలకలకి తగిలితేనే ఒప్పుకో.."

శ్రీహరి:-
"అమ్మా....
శెట్టిగారు ధనియాల్లాగా వాడుకోమ్మా... పిండేకొంది రసమొచ్చుద్ది."

సుబ్బిశెట్టి:- 
"ఇదుగో... దగ్గర్రా...
అమ్మ బోయిందిలే.
నే సెంటు పూసుకున్నా కూడా..."

చింతామణి:-
"చెయ్ తీయ్..."  

సుబ్బిశెట్టి:-   
"అబ్బా...!
కొత్త కోక కట్టావే... ఏమన్నా పై బేరం తగిలిందా?"

చింతామణి:-
"పళ్ళు రాల్తయ్..."

సుబ్బిశెట్టి:- 
"అవున్లే...
అమ్మకి ఊడిపోతున్నయ్ గదూ ఇయ్ రాలగొట్టి సెట్టు కట్టించుకుందామనా?
ఇయ్ లాభంలా... మా అయ్య దగ్గరుంది మంచి సెట్టు.
మా అయ్య సెట్టయితే మీ అమ్మకి బాగా సూటవ్వుద్ది."

చింతామణి:-
"ఇదిగో ఇక్కడ నీ పనేమిటో తెలుసుగా...!'  

సుబ్బిశెట్టి:- 
"ఎందుకు తెలియదు..?
చిత్రకి డబ్బులు, నీకు బట్టలు, అమ్మకి చుట్టలు అందిచ్చటమేగా నా పని.
సరేగానీ...చిత్రనేందీ మా బజారు మీద  వదిలారు?"

చింతామణి:-
"ఏం వదిలితే?..."

సుబ్బిశెట్టి:- 
"ఏందా? ఊరు నాశనమైపోతంది
పజ్జెనిమిదేళ్ళొచ్చినా అది పైటేసుకోదు
చూసిన కుర్రోళ్ళు చేతులొదిలి సైకిల్ తొక్కుతున్నారు."

చింతామణి:-
"ఏడిసావ్ గానీ..."  

సుబ్బిశెట్టి:- 
"ఎవుర్నీ?"

చింతామణి:-
"నిన్నే.."

సుబ్బిశెట్టి:- 
"నన్ను కాదులే...."

చింతామణి:-
"ఏదోయ్ కొర్నాటి కోక?"

సుబ్బిశెట్టి:-    
"ఇంకా మీకేం చెప్పలేదాండీ?
మందులకోసం తిరుగుతున్నామనీ...
మయ్య చావు బతుకుల్లో ఉన్నాడని..."

చింతామణి:-
"ఇప్పుడెలా ఉందో...?"

సుబ్బిశెట్టి:-   
"ఏ సంగతీ తేల్చడండీ...!
చచ్చాడు చచ్చాడనంగానే సంతోషంగా లోనకి పోవడం.
బతికాడు బతికాడనంగానే ఆశలొదిలి అంతా ఎనక్కి రావడం.
అయినా ఇక పర్లేదులెండి... దేవుడి దయవల్ల, మీ అందరి దయవల్ల మయ్యకండి నిన్నట్నుంచి ఎక్కిళ్ళు కూడా పుట్టాయి.."

శ్రీహరి:-
"అమ్మా.... బిల్వమంగళమూర్తి గారొచ్చేస్తున్నారమ్మా...."

సుబ్బిశెట్టి:-   
"బిల్వమంగళా ....మా అయ్యని ఎరుగుండాడు
ఎటు పోవాలి లచ్ఛప్పా..."

శ్రీహరి:-
"ఇటురాండి శెట్టిగారు
గదిలో దూరు..."

సుబ్బిశెట్టి:-   
"చీకటిగా ఉంది."

శ్రీహరి:-
"అయితే మానే... ఒంగో...."

సుబ్బిశెట్టి:- 
"అబ్బా...పొట్ట వంగనీయటం లేదూ..."

శ్రీహరి:-
"ఆ....పంచె ఇప్పతీసేసేయ్
చీకటే కదా....!"

సుబ్బిశెట్టి:- 
"ఉండు...
లోన డ్రాయర్ ఉందో లేదో చూసుకోనీ..."

శ్రీహరి:-
"ఆ.... కింద పందికొక్కు తిరుగుతుంది జాగ్రత్త...!"

సుబ్బిశెట్టి:-   
"డ్రాయర్ లో దూరుద్దేమో లచ్ఛప్పా...."

శ్రీహరి:-
"ఏం చేస్తాంలే... పాపం...!
ఆలి ముద్దులకొక మాట తూలెనేని
అలిగి కాటికిబోవు ఆత్మాభిమానులు...
ఆకటా!...
వేశ్య దా తన్నినం సైతి చూరునందు
వేళ్ళాడుదురు గబ్బిలాల వోలె.....ఆ ...."