Showing posts with label అన్నమాచార్య. Show all posts
Showing posts with label అన్నమాచార్య. Show all posts

కడుపెంత తా కుడుచు

మానవులు తమ జానెడు పొట్ట పోషణకై ఎన్నో కష్టాలు పడుతున్నారు. చెయ్యరాని పనులు చేస్తున్నారు. అలా చెయ్యటమెందుకు అని ఈ పాట పల్లవిలో ప్రశ్నిస్తున్న అన్నమయ్య చరణాల్లో మానవులకు ధర్మబోధ చేస్తున్నాడు. తోటి మానవుల పట్ల దయ, వాత్సల్యం చూపించాలి కాని వారి మనసులను కష్టపెట్టరాదు. ఒకవేళ ఇతరులను కష్టపెడుతూ జీవిస్తుంటే, పరితాపకరమైన ఆ బ్రతుకూ ఒక బ్రతుకేనా? ఇతరులు ఉన్నత స్థానాలకు చేరుతుంటే చూచి సంతోషించాలి. ఈ శరీరము పరులకు చేయు ఉపకారాలన్నీ తనకు తాను చేసుకున్నవిగా చెప్పనియట్టి చదువెందుకు? అంటూ ఘాటుగా చెప్పిన అన్నమయ్య చివరి చరణంలో శ్రీ వేంకటేశ్వరుని సేవాకైంకర్యానికి ఉపయోగపడని సిరిసంపదలు ఎందుకు? హరిని ఆత్మలో చింతించని పదవులెందుకు? అని భౌతిక సుఖాలను ఈసడిస్తున్నాడు. ఇవన్నీ మానవత్వం, దయ, కరుణ, సేవ, సౌభ్రాతృత్వం లాంటి గుణాలను మానవుడు అవలంబించాలని చెప్పేందుకు మాత్రమే హెచ్చరికలు. మానవునికి బంధాలను మీరి డబ్బు, వ్యాపారం, కాంక్ష మిన్నకాకూడదని చెప్పేవి మాత్రమే. అంతేగానీ నీతి, యోగ్యత, న్యాయబుద్ది, సత్యము, నిజాయితి, నిష్కపటములతో మానవులందరూ తమతమ వ్యాపార కార్యకలాపాలు అసలే మానేసి మిన్నకుండమని చెప్పేందుకు కాదు.

కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై
పడని పాట్లనెల్ల పడి పొరలనేలా

పరుల మనసునకు నాపదలు కలుగ గచేయు
పరితాపకరమైన బ్రతుకేల
సొరిది ఇతరుల మేలుచూచి సైపగలేక
తిరుగుచుండేటి కష్ట దేహమిది ఏలా

ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు
చదివి చెప్పనియట్టి చదువేలా
పొదిగొన్న యాసలో బుంగడై సతతంబు
సదమదంబై పడయు చవులు తనకేలా

శ్రీ వేంకటేశ్వరుని సేవానిరతికి గాక
జీవన భ్రాంతిపడు సిరులేలా
దేవోత్తముని యాత్మతెలియనొల్లక పెక్కు
త్రోవలేగిన దేహి దొరతనం బేలా

కుడుపు = తిండి;
పాటులు = అవస్థలు
పరితాపకరము = (ఇతరులకు) బాధ కలిగించునది (లేదా) (ఇతరులదృష్టిలో) అయ్యో! పాపమనిపించుకొన్నది;
సొరిదిన్ = క్రమముగా
చదివిచెప్పని యట్టి చదువు = శ్రుతి స్మృత్యాదుల నుదహరించి చెప్పని విద్య;
పొదిగొన్న = గుంపులుగా పైబడిన;
బుంగుడై = బుంగుడు వడి, మునిగి;
సదమదంబై = నలుగుడువడి;
చవులు = రుచులు

కంటి శుక్రవారము


కంటి శుక్రవారము
చిత్రం : శుక్రవారం మహాలక్ష్మి (1992)
సంగీతం : కృష్ణ తేజ
సాహిత్యం : అన్నమాచార్య కీర్తన
గానం : చిత్ర

కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని కంటీ॥

సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొలచుట్టి
తుమ్మెద యైచాయతోన నెమ్మది నుండే స్వామిని కంటీ॥

పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని కంటీ॥

నవరసములదీ నళినాక్షి


శృంగార సంకీర్తన
రేకు: 148-4
సంపుటము: 7-282
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
గానం: నిత్య సంతోషిణి 

ప|| నవరసములదీ నళినాక్షి | జవకట్టి నీకు జవి సేసీని ||

చ|| శృంగార రసము చెలియ మొకంబున | సంగతి వీరరసము గోళ్ళ |
రంగగు కరుణరసము పెదవులను | అంగపు గుచముల నద్భుత రసము ||

చ|| చెలి హాస్యరసము చెలవుల నిండీ | పలుచని నడుమున భయరసము |
కలికి వాడుగన్నుల భీభత్సము | అల బొమ జంకెనల నదె రౌద్రంబు ||

చ|| రతి మరపుల శాంతరసంబదె | అతి మోహము పదియవరసము |
ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి సతమై యీపెకు సంతోస రసము ||

మేదిని జీవులఁ గావ మేలుకోవయ్యా

గానం: ఏసుదాస్

గానం: నిత్య సంతోషిణి

తాళ్లపాక పదసాహిత్యము
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 79-2
సంపుటము: 1-377
రచన: తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం

మేదిని జీవులఁ గావ మేలుకోవయ్యా
నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా

॥పల్లవి॥

తగుగోపికల కన్నుఁదామరలు వికసించె
మిగుల సూర్యనేత్రుఁడ మేలుకోవయ్యా
తెగువ రాక్షసులనే తిమిరము విరియఁగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా
॥మేదిని॥

ఘనదురితపు నల్లఁగలువలు వికసించె
మినుకు శశివర్ణుఁడ మేలుకోవయ్యా
పనివడి వేదాలనే పక్షులెల్లాఁ బలుకఁగ
జనక యాశ్రితపారిజాత మేలుకోవయ్య
॥మేదిని॥

వరలక్ష్మికుచచక్రవాకము లొండొంటి రాయ
మెరయు దోషారహిత మేలుకోవయ్యా
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేఁడు మేలుకోవయ్యా
॥మేదిని॥

Oh Sri Venkatesa, please wake up from sleep to protect the world. Your compassion is great protection for us.

Lotus-like eyes of Gopikas are beautiful. Wake up Oh Lord with eyes effulgent like the sun. Demonish darkness is there all over. You are the supreme radiance to illumine te world.

Dark sins are like blooming blue water lillies. Oh Lord, you shine like the moon. Birds are twittering like Vedic chanting. Oh Father, you are celestial Parijata tree to fulfill wishes of devotees.

Goddess Lakshmi’s breasts, resembling Chakravaka birds are rubbing you. Oh unblemished Lord, please wake up to enjoy our daily offerings. Oh Sri Venkatesa, wake up pleasantly today.

నెయ్యములల్లో నేరేళ్ళో



నెయ్యములల్లో నేరేళ్ళో
చిత్రం :  శుభలేఖ (1982)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  తాళ్లపాక అన్నమాచార్య
నేపధ్య గానం :  బాలు
రాగము: దేసాళం

నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో

పలచని చెమటల బాహుమూలముల-
చెలమలలోనాఁ జెలుపములే
థళథళమను ముత్యపు జెఱఁగు సురటి
దులిపేటి నీళ్ళతుంపిళ్ళో

తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి పొటి యలుకల చిరునగవే
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో

గరగరికల వేంకటపతి కౌఁగిట
పరిమళములలో బచ్చనలు
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాఁకులినుపగుగ్గిళ్ళో

నెయ్యము = స్నేహము, ప్రియము
అల్లోనేరేళ్ళో = ఆడపిల్లలు వెన్నెల రాత్రుల్లో ఆడుకునే ఒక ఆట, స్త్రీలుపాడే పాట (జానపదం)
ఒయ్యన = తిన్నగ, మెల్లగ, Gently, Softly
ఉవ్విళ్ళూ = తపనలు, తహతహలు, eagerness

చెలమలు = గుంటలు, pit, కొలనులు, పల్లము
చెలువము = అందము, సౌందర్యము
థళథళ = తళతళ
ముత్యపు = ముత్యాల
చెఱగు = చెంగు, చీర కొంగు, పైట
సురటి = విసనకఱ్ఱ
దులుపేటి = దులుపుతున్న
నీళ్ళా తుంపిళ్ళో = తుంపరలు, వాన చినుకులు

తొటతొట కన్నుల తొరిగేటి నీళ్ళు = అదురుతున్న కళ్ళనుండి రాలేటి కన్నీరు
(తొరిగేటి = రాలేటి)
చిటిపొటి యలుకలు = చిన్న చిన్న గొడవలు, చిలిపితగాదా, అల్పమైన , silly fights
చిరునగవే = చిరునవ్వులే
వటఫలంబు = మర్రిపండు
వన్నెల = సొభగు
మోవి = పెదవి
గుటక = ఒక్కసారి మింగగల
గుక్కిళ్ళు = గుటక మింగు శబ్ధము

గరగరికల = సింగారమైన, అలంకారములుగల, చక్కదనాలుగల
బచ్చనలు = కలయికలు, కూటములు, ఒదిగిపోవడము
మరునివింటి = మన్మథుడి చెరకు విల్లు
కమ్మని = కమ్మనైన
అంప విరులు = పువ్వుల బాణాలు / బాణాల పువ్వులు(!?)
గురి = లక్ష్యం
తాకు = తాకేటి
గుగ్గిళ్ళు = ఉడకబెట్టిన శనగలు