బహుశా సులువుగా అర్ధమవడం వలనో లేదా చిన్నతనం నుండీ ఎక్కువగా విన్నందువలనో చాలామందికి హనుమాన్ చాలీసా అంటే ఎమ్ యస్ రామారావు(మోపర్తి సీతారామారావు)గారు పాడిన తెలుగు హనుమాన్ చాలీసా మాత్రమే గుర్తొస్తుంది. ఇతరములు ఏవి విన్నా ఇంత భక్తిభావం కానీ తాదాత్మ్యతకు లోనవడం కానీ జరగవు. ఆయన వైవిధ్యమైన గొంతు, సన్నివేశానికి తగ్గట్లుగా స్వరాన్ని స్వల్పంగా మార్చి పాడే విధానం అంతా అద్భుతం. ఆ గాన మాధుర్యాన్ని చవి చూసి హనుమాన్ భక్తి పారవశ్యంలో మీరూ ఓలలాడండి...
ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం
హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహ బలహః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషత
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాథక శరణములుబుద్దిహీనతను కల్గిన తనువులు
బుద్భుదములని తెలుపు సత్యములు
||శ్రీ హనుమాను||
జయహనుమంత ఙ్ఞాన గుణవందిత
జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ
అంజనీ పుత్ర పవన సుతనామ
ఉదయభానుని మధుర ఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష
కుండలమండిత కుంచిత కేశ
||శ్రీ హనుమాను||
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీ పతి ముద్రిక దోడ్కొని
జలధిలంఘించి లంక జేరుకొని
సూక్ష్మ రూపమున సీతను జూచి
వికట రూపమున లంకను గాల్చి
భీమ రూపమున అసురుల జంపిన
రామ కార్యమును సఫలము జేసిన
||శ్రీ హనుమాను||
సీత జాడగని వచ్చిన నిను గని
శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని
సహస్ర రీతుల నిను కొనియాడగ
కాగల కార్యము నీపై నిడగ
వానర సేనతో వారధి దాటి
లంకేశునితో తలపడి పోరి
హోరు హోరునా పోరు సాగిన
అసురసేనల వరుసన గూల్చిన
||శ్రీ హనుమాను||
లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ
సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామ లక్ష్మణుల అస్త్రధాటికీ
అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని శ్రీ రామ బాణము
జరిపించెను రావణ సంహారము
ఎదురిలేని ఆ లంకాపురమున
ఏలికగా విభీషణు జేసిన
||శ్రీ హనుమాను||
సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశృవులే
అయోధ్యాపురి పొంగిపొరలె
సీతా రాముల సుందర మందిరం
శ్రీకాంతుపదం నీ హృదయం
రామ చరిత కర్ణామృత గాన
రామ నామ రసామృతపాన
||శ్రీ హనుమాను||
దుర్గమమగు ఏ కార్యమైనా
సుగమమే యగు నీకృపజాలిన
కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణ యున్న
రామ ద్వారపు కాపరివైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకిని ఢాకిని
భయపడి పారు నీనామజపము విని
||శ్రీ హనుమాను||
ధ్వజావిరాజా వజ్ర శరీరా
భుజ బల తేజా గధాధరా
ఈశ్వరాంశ సంభూత పవిత్రా
కేసరీ పుత్ర పావన గాత్ర
సనకాదులు బ్రహ్మాది దేవతలు
శారద నారద ఆదిశేషులు
యమ కుబేర దిగ్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తి గానముల
||శ్రీ హనుమాను||
సోదరభరత సమానా యని
శ్రీ రాముడు ఎన్నిక గన్న హనుమా
సాధులపాలిట ఇంద్రుడవన్నా
అసురుల పాలిట కాలుడవన్నా
అష్టసిద్ది నవ నిధులకు దాతగ
జానకీమాత దీవించెనుగా
రామ రసామృత పానము జేసిన
మృత్యుంజయుడవై వెలసినా
||శ్రీ హనుమాను||
నీనామ భజన శ్రీరామ రంజన
జన్మ జన్మాంతర ధుఃఖ బంజన
ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు,
ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగ మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన
||శ్రీ హనుమాను||
శ్రద్దగ దీనిని ఆలకింపుమా
శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తిమీరగ గానము చేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ,
తులసీదాస హనుమాన్ చాలిసా
తెలుగున సుళువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున
దోషములున్న మన్నింపుమన్న
||శ్రీ హనుమాను||
మంగళ హారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత
నీవే అంతా శ్రీ హనుమంత
ఓం శాంతిః శాంతిః శాంతిః