January 6, 2020

చింతామణి-హెచ్.ఎమ్.వి క్యాసెట్టు రెండవ భాగం


శ్రీహరి:-
"అమ్మా...!  బిల్వమంగళమూర్తి గారొచ్చేసారమ్మా... 
దయచేయండి బాబూ దయచేయండి...కూర్చోండి. 
అమ్మాయికి తగని సిగ్గూ....! 
అమ్మా మనకెందుకమ్మా సిగ్గు...? 
ఎడ మధ్యాన ఆడది కనబడితే ఎనుబోతుల్లాగా ఎమ్మటబడే 
మగోళ్ళకే సిగ్గులేదే......మనకెందుకమ్మా సిగ్గు?"

చింతామణి:-
"సగమగనిసా... సనిదమగనిసా..."

శ్రీహరి:-
"అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది." 

బిల్వమంగళ:-
"ఆ ..."

చింతామణి:-
"సామజవరగమనా.... సామజవరగమనా 
సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత 
సామజవరగమనా... ఆ..."
బిల్వమంగళ:-
"ఆహా ...! ఎంత తీయని కంఠం!"

శ్రీహరి:-
"బాబుగారూ.....! మీరు మెచ్చుకుంటే దేశమంతా మెచ్చుకున్నట్లే.
అమ్మా... లోపల్నుంచి రామ్మా...."

చింతామణి:-
"వస్తున్నానమ్మా....
నమస్కారం."

బిల్వమంగళ:-
"నీ సాధనకు అంతరాయం కలిగించామా....?"

శ్రీహరి:-
"ఇదీ ఒక  సాధనేనా బాబూ.... 
వెనక సుందర పోతూరాచారని.... మద్దెల వాయించే ఆయన...
ఆయన  మద్దెల తీసుకుని.... 
తక్కిటక దిక్కిటక తంగథిక నంగథిక   
తక్కిటక దిక్కిటక తంగథిక  నంగథిక  థోమ్  
అనంగానే 
మూతపగిలి చేతికొచ్చేది...."

చింతామణి:-
"అమ్మా... ఏవిటే నీ పిచ్చి వాగుడు?"

శ్రీహరి:-
"పెద్దముండని... ఒళ్ళు పొంగి ఆపుకోలేకపోయాను. 
నమస్కారం నాయనా...!"

చింతామణి:-
"ఏంటలా చూస్తున్నారు?"

బిల్వమంగళ:-
"చూడకూడదా?"

చింతామణి:-
"మీకంటే అందంగా ఉన్నానా?"

బిల్వమంగళ:-
"అందం ఆడవారి సొత్తేగా..."

చింతామణి:-
"ఊహూ...!
కురుల విరిదండ 
నుదుట కుంకుమపు రేఖ 
కనుల కాటుక 
సకలలంకరణ లేక 
అతివ దేశానికెన్నడందమ్ము రాదు 
కానీ.... సొమ్ముతాకకె పురుషుడు సొగసు కుల్కు....
ఆ...."

బిల్వమంగళ:-
"ఊ!....బాగుంది నీ చతురత."

చింతామణి:-
"మరి బహుమతి?"

బిల్వమంగళ:-
"కోరుకో..."

చింతామణి:-
"ఇస్తారా?"

బిల్వమంగళ:-
"తప్పక..."

చింతామణి:-
"నాకు బహుకాలము నుండి.... కామశాస్త్రము నేర్చుకొనవలనని యున్నది..."

బిల్వమంగళ:-
"అబ్బా...! చంపితివిగదా.."

చింతామణి:-
"అదుగో... మాట తప్పుతున్నారు."

బిల్వమంగళ:-
"లేదు..కాస్త ఆలోచించుకోనీ..."

చింతామణి:-
"అలాగే...అలా తోటలోకెళదామా..."

బిల్వమంగళ:-
"ఊ..."

చింతామణి:-
"ఇన్నాళ్ళకు నా నోములు పండి 
దయచేసెను నా దైవము నేడు
జీవితమంతా తీయని కలగా... 
జీవితమంతా తీయని కలగ
సురలోక రసడోళలూగేనులే
పలికిందీ ప్రణయగీతిక
మొలిచింది మదిని నెలవంకా
మధురమ్ము నీదు రాక...."

శ్రీహరి:-
"గదిలో ఏం చేస్తన్నారు శెట్టిగారూ...?"

సుబ్బిశెట్టి:-
"చీకటిగదిలో బెట్టి నా క్షేమమడుగుతున్నావా? 
ఏం జెప్పమంటా.... టికెట్ లేనోడు కక్కస్ దొడ్లో దూరినట్టుంది నా పని."

శ్రీహరి:-
"సరేగానీ బయటకి రా నాయనా....
అదేందిరా...! నీయమ్మ కడుపుగాల నన్ను పట్టుకుంటావ్?"

సుబ్బిశెట్టి:-
"మెత్తగ తగిలితే మీ అమ్మాయనుకున్నాలే."

శ్రీహరి:-
"నక్లిస్  ఏది?"

సుబ్బిశెట్టి:-
"నక్లిసా ...ఎందుకీయనూ...?
ఒక్క పాట పాడమంటే.... పంతులుగారి పెళ్ళికి సాయిబ్బు గారు మంత్రాలు చదివినట్టు చదివారు గానీ... నక్లిస్ అంట... తేలా..."

శ్రీహరి:-
"సరే లేరా..."

సుబ్బిశెట్టి:-
"ఆ...! ఇప్పుడు నువ్వు ఒరేయ్ అంది నన్నా?"

శ్రీహరి:-
"నిన్నేందిరా నీ బాబునన్నా.. ఒరేయ్ దుప్పట్లేయిరా.... ఒరేయ్..."

సుబ్బిశెట్టి:-
"ఒరేయ్.."

శ్రీహరి:-
"ఒరేయ్..."

సుబ్బిశెట్టి:-
"ఏముంది మరి.... ఇడిసేసింది వీధికి పెద్దనీ..
నన్ను ఒరేయ్ అంటావే సవారిబొంగూ...."

శ్రీహరి:-
"సవారిబొంగునేలే ఆ చూపు చూడు...!
లంచాలు తీసుకునే ధర్మాసుపట్టల్లో మంచాలేసేవాడు చూస్తన్నట్లు చూస్తన్నాడు. పటపటా కొరకటమే నా సంగతి తెలియదుగావాల..."

సుబ్బిశెట్టి:-
"పటపటా కొరకటానికి ఇయ్యేం పక్కలకింద వక్కలు కావు."

శ్రీహరి:-
"పక్కలకింద వక్కలు తింటాన్నేనూ...?"

సుబ్బిశెట్టి:-
"లేక పటికబెల్లం ముక్క తిన్నావా? 
మొక్కజొన్న కండె తిన్నావే నా పాపా...."

శ్రీహరి:-
"తేలుస్తా రా.. 
ఇంతకుముందు కాదు మాటినంగానే తలుపుతీయటం.
ఇక తీస్తా... మూలనున్న చీపిరి."

సుబ్బిశెట్టి:-
"ఆ...ఆ...ఆ..."

శ్రీహరి:-
"తేలుస్తారా ఒరేయ్..."

సుబ్బిశెట్టి:-
"తేలుస్తానే ఒసేయ్..."

శ్రీహరి:-
"ఒసేయ్..
నాపరువు పోయింది నాయనా...
నే బావిలో పడతా."

సుబ్బిశెట్టి:-
"బావిలో పడితే నీళ్ళు చెడతయ్ గానీ... కాలవలో దూకమ్మా...లాకుల్లో తేలతావ్."

శ్రీహరి:-
"పోరా... దుప్పట్లడిగితే ఎప్పుడడిగినా... రేపూ... రేపూ... రేపూ.."

సుబ్బిశెట్టి:-
"ఏం జేయమంటా.... మా అయ్య చావందే..."

శ్రీహరి:-
"నిన్న మా నాయన చచ్చిపోయాడని చెబితివి గదరా!"

సుబ్బిశెట్టి:-
"నిన్నగాదు.... మొన్న చచ్చాడు.
బయటపెట్టంగానే బతికాడు.
ఈసారి వాడ్ని చావనీ నేను రెండు దుప్పట్లు తెచ్చిస్తాను."

శ్రీహరి:-
"రొండెందుకు?"

సుబ్బిశెట్టి:-
"ఒకటి మామూలుగా పక్కకి పరవాలా....
ఇంకోటి బారుకి పైన కప్పొద్దూ....
పైన కప్పుతాం.... పైన కప్పుతాం
పైన కప్పుతాం.... పైన కప్పుతాం."

శ్రీహరి:-
"ఇంకొక్కటి తీసుకురా నాయనా..."

సుబ్బిశెట్టి:-
"ఎందుకు?"

శ్రీహరి:-
"నువ్వుంటావుగా...
తలకు చుట్టుతాం.... తలకు చుట్టుతాం....
తలకు చుట్టుతాం.... తలకు చుట్టుతాం..."

శ్రీహరి:-
"పోరా ఎధవా..."

సుబ్బిశెట్టి:-
"అరే యాపారాస్తుడ్ని పట్టుకుని ఒరే అంటావు?"

శ్రీహరి:-
"యాపారాస్తుడా.... రెండు పాతగుడ్డలు పెట్టి పెద్ద యాపారాస్తులంట...  యాపారాస్తులు."

సుబ్బిశెట్టి:-
"ఏంది? నాది పాతగుడ్డల యాపారమా...?"

శ్రీహరి:-
"ఆ..."

సుబ్బిశెట్టి:-
"అబ్బో నువ్వు పెట్టావుగా పెద్ద పక్కదూడల కంపెనీ..."

శ్రీహరి:-
"పైకొస్తున్నావేరా... రా..."

సుబ్బిశెట్టి:-
"నువ్వు ఆడదానివి ఒక తొడ గొడ్తే నేను రొండు తొడలు కొట్టనూ...!
ఇదిగో....
పొడుస్తానే.... నాకు ఆడామగా తేడా లేదు ఎవుడి మీదయినా కలబడతా.."

శ్రీహరి:-
"ఒరేయ్ మల్లిగా... ఇటురా..."

సుబ్బిశెట్టి:-
"వామ్మో...! వాడు ఏసుకుని వస్తాడే.."

శ్రీహరి:-
"కోటిగా... నువ్వూ రారా..."

సుబ్బిశెట్టి:-
"వాడు మడుసుల్ని కొరుకుతాడు.
లచ్చప్పా మనిద్దరి మధ్య వాళ్లెందుకు జెప్పు?
నువ్ జెప్పావ్... నే పోతన్నా. అయ్యా.... మీరక్కడే ఉండండి... నే పోతన్నా."

చింతామణి:-
"అమ్మా శెట్టి వెళ్ళాడా?"

శ్రీహరి:-
"శెట్టిగాడికి నరాలు లూజయిపోయినాయమ్మా...
సరేగాని పండితుడు బుట్టలో పడ్డాడా?"

చింతామణి:-
"పండితుడా ఎవరే...?

ఇంతులు తారసిల్లు వరకే....
ఇంతులు తారసిల్లు వరకే
పురుషాగ్రణులెంత లేసి సామంతములాడినన్
బిగువు మాటలు పల్కెనన్....
ఇంతులు తారసిల్లు వరకే....
కామినీమణీ కాంత ప్రచంచలాగ్ని 
కలికాలవమించుకపాటి సోకెనేని
ఎంతటి పండితుండయిన
ఎంతటి పండితుండయిన
ఇట్టే.... ఇట్టే.... కరుంగడే... వెన్న పోలికన్..ఆ..."

"మ్రోయింపరా నీ మోహన మురళి
కరిగింతురో విని మృదు రవళి
మ్రోయింపరా నీ మోహన మురళి
రాగమేఘ మధు తారలలోన
వెదురులు, పొన్నలు వేణువులైనవి
మైమరచిన మల్లెతీవియలు
పారిజాతముల ప్రస్తుతించినవి
మ్రోయింపరా నీ మోహన మురళి
కరిగింతురో విని మృదు రవళి
మ్రోయింపరా నీ మోహన మురళి."

శ్రీహరి:-
"అమ్మా! వేమపాటి కోటయ్యొచ్చాడమ్మా..... బాగుపడి పోతాం తల్లీ...
అమ్మా! ఎన్ని రోజులమ్మా.... ఈ పూజా?
కృష్ణ పరమాత్మ మనకి మోక్షం ఇయ్యడమ్మా... 
మోక్షమిచ్చేది రూపాయమ్మా..
నా మాటిను తల్లి.... మంచి వయసమ్మా....
వయసు పోతే మనం సంపాయిచ్చుకోలేం తల్లీ....
రంగస్థలం మీద బూతులు వాడినా, వేశ్యలకు మూతులు వాడినా
చూసే దిక్కుండదమ్మా.... నా మాటిను."

చింతామణి:-
"ఎప్పుడయినా ఈ అందం నశించేదే...."

శ్రీహరి:-
"అబ్బా... నీ వయసు నాకుంటే ఊరిని ఇరగదీసేదాన్నమ్మా..."

చింతామణి:-
"నీతిలేని జన్మ ఒక జన్మేనా?..."

శ్రీహరి:-
"నీతి...? 
నీతిగా పడి పంచలో పస్తులు మాడి చచ్చేవాడిమీద
దేశంలో పక్కలేసేవాడికే పలుకుబడి పెరిగింది."

చింతామణి:-
"నీవెన్ని చెప్పినా నా మనసు మారదమ్మా...."

శ్రీహరి:-
"మారదా తల్లీ.... నా మాటినమ్మా
అయితే ఒక పని చేయి తల్లీ....
కృష్ణపరమాత్మ యందు మనసు లయం చెయ్యి...
కృష్ణుడికి మనసిచ్చేయ్ తల్లీ...!
శరీరం నాకొదిలిపెట్టు.
ఇది నే చూసుకుంటాను.
అసల్ది ఆయన చూసుకుంటాడు.."

చింతామణి:-
"ఛీ! ధనపిచ్చి పట్టింది....
డబ్బంతా తగలబెట్టేస్తాను...
వెళ్ళు..."

శ్రీహరి:-
"అమ్మా.... అమ్మా... డబ్బుపోయింది నాయనో...
అమ్మను కాదు నేను శ్రీకృష్ణపరమాత్మని...
జెండాపై సచిరి సోదరుల్ సుతులు...
అమ్మా...!"

చిత్ర :-
"అమ్మకి పిచ్చి పట్టింది..."

చింతామణి:-
"ఎందరు నా గతాన భుజియింపగ కూడును, కట్టబట్టలేక 
ఇందును అందును జోగులై అల్లలనాడుచు ఉన్న వారల
ఎందరు మందయానలు నిజేసుల కోసము రాత్రియున్ పవలు
కృంగి కృశియించి ప్రాణముల్ కోల్పడిరో వచియింప శక్యమే...ఆ" 

సుబ్బిశెట్టి:-
"అట్టూ...పెసర.... 
వేడి వేడి... వేడి వేడి... 
ఉప్పుటూరి వారి ఉల్లిపాయ పెసర."

భవానీశంకరం:-
"శెట్టీ... బాగున్నావా?"

సుబ్బిశెట్టి:-
"బాగానే ఉన్నాం లే....
ఇప్పుడెవురికీ... తెలిసినోళ్ళకి కూడా అప్పులు పెట్టడం లేదయ్యా...
పొద్దున్నే తగిలాడు చూడు మొహం.... నీళ్ళ బిందె, నెత్తిన గుడ్డా..."

భవానీశంకరం:-
"నేను ... భవానీశంకరాన్ని."

సుబ్బిశెట్టి:-
"ఒరే....ఒరే....ఒరే.... నువ్వా...! బిళ్ళగోసి పంచెలూ, పక్కమెడ లాల్చీలు ధరించిన పంతులుగారు...  చివరికి  నీళ్ళ  బిందెలు మోస్తన్నారే...." 

భవానీశంకరం:-
"నీ చేతికి వచ్చిందిగా అట్ల పళ్ళెం..."

సుబ్బిశెట్టి:-
"ఏయ్! మాకూ మీకూ ఎక్కడ పోటీ అయ్యా.... 
శ్రీకృష్ణుడి చేతిలో చక్రం ఎట్టాటిదో.... మా ఆర్యవైశ్యుల చేతిలో అట్ల పళ్ళెం అటువంటిది.
ఇదిగో... పంతులూ నీళ్ళు మోయలేవుగానీ... ఎక్కడయినా రెండిళ్ళు చూసుకుని నమ్మబలుక్కొని అంట్లు తోము... సద్దెన్నం పెడతారు." 

భవానీశంకరం:-
"శెట్టీ...!"

సుబ్బిశెట్టి:-
"ఉరిమిచూత్తా వేంది ? ఇదిగో ఇక నువ్వు ఉరిమి చూసినా ఒకటే.... నేను ఊరక చూసినా ఒకటే.."
"ఏందసలు?"

భవానీశంకరం:-
"ఏం కలబడతావా?..."

సుబ్బిశెట్టి:-
"కలబడతానని నీతో చెప్పానా ఏంది?"

భవానీశంకరం:-
"పంచె పైకి దోపుతున్నావ్..."

సుబ్బిశెట్టి:-
"కాళ్లకడ్డం పడతంటే పైకి దోపుతుకుంటున్నాను.
సరేగానీ పంతులూ నువ్వు పెద్దపెద్దగా మాట్టాడబాక చూసినోళ్ళకి బాగుండదు.
ఎంతచెడ్డా ఒక్కత్త అల్లుళ్ళం గదూ...!" 
"సరేగానీ పంతులుగారూ.... అప్పుడు ఊళ్ళో ఏంది అట్టనుకున్నారు?"

భవానీశంకరం:-
"ఏమిటో?"

సుబ్బిశెట్టి:-
"ఆ.. అదేలే ఆఖరి దశలో తవర్ని శ్రీహరికుమారి చెప్పుతో కొట్టిందంటగా..."

భవానీశంకరం:-
"శెట్టీ...కొట్టానంటే మొహం తిరగాలి."

సుబ్బిశెట్టి:-
"ఏందీ..? కొడతా నువ్వు ... నువ్వు కొడతా... మేమంత చేతగానోళ్ళమనుకున్నావా ఏందీ?
నువ్వు కొడితే నేను పరిగెత్తనూ...."

భవానీశంకరం:-
"ఇంటికొచ్చి కొడతా...."

సుబ్బిశెట్టి:-
"ఇంటి కాడా? నన్నింటిదగ్గర వేయిమంది కూడా కొట్టలేరు."

భవానీశంకరం:-
"ఏమో..." 

సుబ్బిశెట్టి:-
"మా ఇంటికి ఇనప గడి."

చిత్ర :-
"బావగారూ...!"

సుబ్బిశెట్టి:-
"బట్టలకొట్టున్నప్పుడు బావా అన్నారు... తలగొరిగారు.
అట్ల పళ్ళెం  వచ్చినాక ఆ పిలుపు లేదే.... ఎవురీ మరదలు?"

చిత్ర :-
"నేనండీ... చిత్రని!"

సుబ్బిశెట్టి:-
"ఎవురూ? ...చిత్రా నువ్వా...!"

చిత్ర :-
"దండాలండీ... దండాలు."

సుబ్బిశెట్టి:-
"మొగుడూ, మొద్దులూ, పిల్లా... పాపా  లేకుండా  కలకాలం వర్ధిల్లు.
ఏంది ఇప్పుడు వారు చెప్పింది పంతులుగారు ఇన్నారూ ?
దండాలండీ  బావగారు అంటే ఓరి ఎధవల్లారా ఇంకా మీరు బతికుండారా అని అర్ధం."

చిత్ర :-
"ఏంటి ఇట్ల మారిపొయ్యారు?"

సుబ్బిశెట్టి:-
"ఏం జేయమంటామ్మా.... మా బతుకే ఒక హరిశ్చంద్ర నాటకం.
అందులో అమ్మ కాట్ సీను వరకు చేసి కాటి సీను మాకొదిలింది." 

చిత్ర :-
"ఊ...ఉ ..."(ఏడుస్తూ)

సుబ్బిశెట్టి:-
"అయ్యో.... అయ్యో... అయ్యో.... నువ్వేడుత్తావేం?
అయ్యో నువ్వేడుత్తావెందుకే? ఇల్లూ, ఒళ్ళు గుల్లయి మేం ఏడవాలి గానీ 
ఆ... అసలూ .... ఏంది ఏడుత్తావేంది ఏం జరిగింది?"

చిత్ర :-
"సొమ్మంతా పోయిందని...." 

సుబ్బిశెట్టి:-
"ఆ...!"

చిత్ర :-
"మా ఇంటి మొత్తానికి ఒక్కసారే..."

సుబ్బిశెట్టి:-
"కలరా తగిలిందా?"

చిత్ర :-
"కాదు. మతిపోయింది."

సుబ్బిశెట్టి:-
"శ్రీమద్రామణగోవిందో హారి...
చల్లని వార్త చెప్పావు.
చిత్రా! అక్కకి కూడా ఎక్కిందే పిచ్చి?"

చిత్ర :-
"అక్కే... సాని వృత్తి మానేసి...."

సుబ్బిశెట్టి:-
"సారాయికొట్టు పెట్టుకుందా?..."

చిత్ర :-
"ఊహూ... సన్యాసుల్లో కలిసింది."

సుబ్బిశెట్టి:-
"తిన్నారు దెబ్బ.
అది గాదు ఎర్రి మొకమా సన్యాసోడి దగ్గరా ఉంటది కొబ్బరిపీచు, గొట్టం.
ఎందుకు జరిగిందట్ఠా...?"

చిత్ర :-
"మా అక్కకే..."

సుబ్బిశెట్టి:-
"ఆ..."

చిత్ర :-
"కల్లోనే ..."

సుబ్బిశెట్టి:-
"నే గనిపిచ్చానా....."

భవానీశంకరం:-
"నే గనిపిచ్చాను."

సుబ్బిశెట్టి:-
"నువ్వెట్ట కనపడతావయ్యా.....ఇంతలావు మడిసివి."

చిత్ర :-
"శ్రీకృష్ణపరమాత్మ కనిపించి..."

సుబ్బిశెట్టి:-
"ఆహా! మోకాళ్ళవరకు చూపిచ్చాడా.... మొత్తం దర్శనమిచ్చాడా? ఇదుగో.... 
పొద్దుగూకులూ పొజిషన్ లో ఉండేవాడికి నాకే కనపడలేదు... మీ అక్కకెట్ట కనపడ్డాడే కృష్ణుడూ?"

చిత్ర :-
"దేవుడు కనిపించాలంటే పుణ్యం చేసుకోవాలి."

సుబ్బిశెట్టి:- 
"అవునండోయ్... వారంటే రోజుకి అయిదారుసార్లన్నా జేసుకుంటారు పుణ్యం. 
ఏమ్మా... ఇక నీ బతుకు బస్టాండింగేనా?"

చిత్ర :-
"నాకేం..? మా అక్క నా పేరుతో పదివేలు బ్యాంకిలో వేసింది."

భవానీశంకరం:-
"ఎందుకో?..."

సుబ్బిశెట్టి:-
"ఎందుకేంది పంతులూ...? పెన్సిలిన్ ఇంజక్షన్లకి."

చిత్ర :-
"కాదు...నాకయిదువేలు... నన్ను చేసుకున్నోడికయిదువేలు..."

సుబ్బిశెట్టి:-
"అరవబాకు... అరవబాకు... అరవబాకు... ఎంత ఎంత ఎంత నీకెంత?"

చిత్ర :-
"నాకయిదువేలు..... నన్ను చేసుకున్నోడికయిదువేలు..." 

సుబ్బిశెట్టి:-
"చిత్రో.... ఇటుచూడు....మరి నన్ను చేసుకుంటావా?"

చిత్ర :-
"నీ తొర్రిపన్ను.... నీకు పెళ్లా?..."

సుబ్బిశెట్టి:-
"ఓసి యెర్రిమొకమా నువ్వు "ఊ" అనవే ఉన్న నాలుగూ ఊడగొట్టిచ్చుకుని మొత్తం ఫుల్ సెట్టు గట్టించుకుంటాను."

చిత్ర :-
"ఉహూ... చేసుకోను."

సుబ్బిశెట్టి:-
"చేసుకోదండీ... ఇది చివరికి ఏ చిటికెలోడ్నో మద్దెలోడ్నో చేసుకుంటది.
అసలు నువ్వెందుకొచ్చావే ఇక్కడికి?.

చిత్ర :-
"మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుచుకు రమ్మన్నది."

సుబ్బిశెట్టి:-
"ఎవరూ....?"

చిత్ర :-
"మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుచుకు రమ్మన్నది."

సుబ్బిశెట్టి:-
"అక్కేనా...ఎల్దాం పద.... పంతులూ! దువ్వెనుందా జేబులో ...ఎల్దాం పద... ఎళదాం  పద."

చింతామణి:-
"చాలు చాలునిక రాగబంధముల త్రెంచగ రావయ్యా....ఈశా 
చాలు చాలునిక రాగబంధముల త్రెంచగ రావయ్యా 
తీరేకొలదీ పెరుగును కామం 
జీవితమే ఒక ఆరని దాహం 
అదియే తరగని దాహం 
చాలు చాలునిక రాగబంధముల త్రెంచగ రావయ్యా..."

సుబ్బిశెట్టి:-
"చిత్రా... అక్కేది?"

చిత్ర :-
"పూజ చేసుకుంటుంది."

చింతామణి:-
"నల్లని మేనితోడ చిరునవ్వులు పరువులిడన్ గడున్ విరాజిల్లెడు 
మోముతోడ కృప చిందెడు కన్గవతోడ నందమౌ పిల్లనగ్రోవి తోడ 
శిఖపించకలాపము తోడ నా యొడల్ ఝల్లుమనంగ వచ్చి 
కృపసాచిలా నవ్వుచు నిల్చె ముందటన్ 
ఆ......

దేవకీనందనా గోపాలా.....
పాపిని భ్రష్టురాల అతి బానిసనై బహు నీచవృత్తిలో 
రేపులు మాపులుం బడి చరించిన మాటయె నిక్కము 
ఇక ఆ పాపపు దారి త్రొక్కను  
ఇక ఆ పాపపు దారి త్రొక్కను 
భవశ్చరణాబ్ది యుగంబు సాక్షిగా 
నాపై ప్రేమనిల్పి యదునందనా.... కృష్ణా తరింపజేయవే....
ఆ ..."

సుబ్బిశెట్టి:-
"చిత్రా... ఇంకెంతసేపే పూజ?
అక్కని రమ్మనమను బయటకి..." 

చిత్ర :-
"వస్తుంది."

శ్రీహరి:-
"చెల్లియొ చెల్లకో..."

సుబ్బిశెట్టి:-
"అక్క పిలుస్తుందని తీసుకొచ్చి, అమ్మకప్పజెప్పావే నీయమ్మ కడుపుగాలా ..."

శ్రీహరి:-
"జెండాపై సచిరి సోదరుల్ సుతులు...
ఎవురూ... ఎవురు మీరు? ఎల్లండి మా ఇంట్లోకి మొగాళ్ళు రావడానికి వీల్లేదు... వెళ్ళండి అమ్మాయి భక్తిలో పడిపోయింది."

భవానీశంకరం:-
"మేం గుర్తున్నామా?"

శ్రీహరి:-
"ఎవురూ శంకర్రావబ్బాయా...!"

సుబ్బిశెట్టి:-
"లచ్ఛప్పోయ్.."

శ్రీహరి:-
"శెట్టిగారూ....ఏం నాయనా...!
మీరింకా నాశనమై పోలా అయ్యా...!" 

సుబ్బిశెట్టి:-
"ఏదీ... నీ అల్లుళ్లం కదూ...! మీ పెద్దదినం జేసేదాకా బతికే ఉంటాం."

శ్రీహరి:-
"ఒరే... ఒరే... ఒరే... పాపం అట్లమ్ముకుంటున్నారా?"

సుబ్బిశెట్టి:-
"అరె చుట్టచేయి పెడతావేంది పళ్లెంలో...."

శ్రీహరి:- 
"పిండి తక్కువ గానీ.... అట్టు పెద్దదే."

సుబ్బిశెట్టి:-
"ఆ...అనుభవం పెరగలా...."

శ్రీహరి:-
"కమ్మగా ఉండయ్యబ్బా..."

సుబ్బిశెట్టి:-
"తప్పు... అయ్... తినగూడదు తప్పు...."

శ్రీహరి:-
"అప్పిస్తా...."

సుబ్బిశెట్టి:-
"అప్పా ... ఒకప్పుడు రొక్కమిచ్చి చచ్చావా?"

శ్రీహరి:-
"అమ్మాయి బోయింది. 
డబ్బు బోయింది."

సుబ్బిశెట్టి:-
"రూపాయిచ్చా...."

శ్రీహరి:-
"అమ్మాయిని శ్రీకృష్ణపరమాత్మ తీసికెళ్ళిపోయాడు... బలాట్టు..."

సుబ్బిశెట్టి:-
"ఎవరూ?
శ్రీకృష్ణపరమాత్మా.... ఎవురమ్మా ఈయనా? ద్వారకానగరం కృష్ణుడా... దొడ్డాకిలి నుంచి వచ్చేవాడా?"

శ్రీహరి:-
"అమ్మాయుంటే పైసాకొక ముద్దు చొప్పున పదికోట్లు సంపాయిచ్చేదానిని."

సుబ్బిశెట్టి:-
"ఎంత సంపాదించినా.... చివరికి చిత్తుకాగితాలూ చిప్పేనే నా అప్పా..."

శ్రీహరి:-
"చిప్పకూడా చిన్నదే...
చేసుకున్న మొగుడ్ని చెట్లపాలు చేసి... కొంపలమ్మట తిరిగే ముండలకి పెద్దయ్యిచ్చి... దేవుడు మాకీ చిన్నయ్యిచ్చాడు... ఆఖర్న."

సుబ్బిశెట్టి:-
"నయ్యం... పగలగొట్టియ్యాల్సింది."

శ్రీహరి:-
"చిత్రా.. నువ్వుగూడా మారిపొయ్యావమ్మా.
ఇదివరకు మమ్మ బజారుకొస్తంటే ఎట్లుండేది చిత్ర... అలివేలు మంగమ్మా అనేవాళ్ళు.... ఇప్పుడు తిప్పుకున్నారు పాపం."
"చిత్రా...! ఇంట్లోకెళ్ళి ఆయేసుకుని పప్పేసుకుని...."

సుబ్బిశెట్టి:-
"ఆ ఎళ్ళమ్మా.... ఆయేసుకుని, పప్పేసుకుని ఊళ్ళోవాళ్ళ గడ్డేసుకుని తిను."

శ్రీహరి:-
"నాయనా మీరుగూడా మారిపోయారే....!"

సుబ్బిశెట్టి:-
"నువ్వుమాత్రం తక్కువా ఏంది?
ఆ రోజుల్లో.... వారముసుగేసుకుని వాకిట్లో నిలబడితే రంభలాగుండేదానివి. 
లంబాడీ దెయ్యం లాగా లేవూ...!"

శ్రీహరి:-
"నిజమే...! నేనూ మారాను..మీరూ మారారు."
"ఆ రోజుల్లో మీరుగూడా బజారు కొస్తుంటే.... బజారుకి పెట్టే బల్బుల్లా ఉండేవోళ్ళు. 
ఇప్పుడేముంది నాయనా... బఱ్ఱెకి బడే జోరీగల్లాగా ఉండారు."

సుబ్బిశెట్టి:-
"ఎల్లెళ్ళు..." 

శ్రీహరి:-
"అల్లుడుగారూ... ఆ పళ్లెం నాదీ...!"

సుబ్బిశెట్టి:-
"నాదీ..."

శ్రీహరి:-
"నా ఇంట్లోంచి తీసుకొచ్చావ్." 

సుబ్బిశెట్టి:-
"పెమానకంగా నాది."

శ్రీహరి:- 
"ప్రమాణకంగా నాది...నాశనమై పోతావ్..."

సుబ్బిశెట్టి:-
"వదులు..."

శ్రీహరి:-
"వదులు..."

సుబ్బిశెట్టి:-
"వామ్మో... చెయ్యి కొరికింది. 
పంతులూ! ఇంతకుముందు సరుకు తిన్నారు. ఇప్పుడు సామాను కూడా తిన్నారయ్యా...."

చింతామణి:-
"పూరయ మమకామం గోపాలం 
పూరయ మమకామం గోపాలం  
పూరయ మమకామం."

"బాగున్నారా నాయనలారా...!"

సుబ్బిశెట్టి:-
"అమ్మా మాబాగడుగుతారూ...?
తమరి దయవల్ల, తమరి అమ్మగారి  దయవల్ల
అగ్గై బుగ్గై దుమ్మై ధూళై గాల్లో కలిసి 
క్యూ సిస్టం లో నిలబడ్డాం...వేప్పుల్లలమ్మే యానాదోళ్ల లాగా..."

భవానీశంకరం:-
"చింతామణీ...! అదేమట్లు మారిపోయితివి?"

చింతామణి:-
"పిచ్చవాడా...!"
"రక్తమాంస పురీష మూత్రముల బాత్ర 
మేలిమి పసిండి బొమ్మంచు మెరుపటంచు 
అజ్ఞులగువారు మోహాంధులగుచు దలఁతు 
రంతియే కాక సౌందర్యమనగ గలదే...ఏ..."

"మీ ఇరువురి నిమిత్తము చెరి పదివేల రూపాయలు 
పురపాలకుల అధీనము చేసినాము." 

సుబ్బిశెట్టి:-
"వెళ్ళి తెచ్చుకుంటామండీ."

చింతామణి:-
"ఇప్పుడు కాదు...
వేశ్యా సంపర్కము వల్ల మీరు పొందిన అనుభవమును 
ఆరునెలల పాటు దేశమున ప్రచారము చేసి వచ్చిన పిమ్మట"

సుబ్బిశెట్టి:-
"ఆ ధనము మాకొసంగ బడును. 
పంతులూ ఇక్కడ పెట్టారు లిటిగేషను 
దేశమంతా తిరగాలంట ఖర్చులెవడిస్తాడు? మనకి నష్టం గదూ..."

భవానీశంకరం:-
"శెట్టీ... నువ్వెలా పుట్టావయ్యా?
వారిచ్చేది పదివేలు... దేశమంతా తిరిగి రమ్మన్నారు 
మనం పదూళ్ళు తిరిగేది... ఇరవై ఊళ్ళు రాసేది." 

సుబ్బిశెట్టి:-
"పంతులూ..నువ్వు నీళ్ళు మోస్తావనుకున్నాను గానీ కొంపలార్పుతావనుకోలేదయ్యా 
పంతులు..!  ఎందుకయినా మంచిదిగానీ... వాళ్లెదుట శాంపిల్ గా ప్రచారం  మొదలు పెట్టు... తర్వాత పేచీ పెడతారు." 

భవానీశంకరం:-
"ఇంట రంభల వంటి ఇంతులుండ 
సాని సంపర్కము గోరు చవటలారా 
ఇచ్చకముల నమ్మి యిండ్లు వాకిళ్ళన్ని   
అర్పించు కూళలారా 
స్వానుభవమిది...."

సుబ్బిశెట్టి:-
"ఇద్దరిమీద చెప్పు.... ఇద్దరిమీద చెప్పు." 

భవానీశంకరం:-
"మా ....స్వానుభవమిది 
దెల్పుచున్నాము వినుడు చచ్చి బ్రతికిన వాడును 
సానికొంపకు జొచ్చి మిగిలినవాడును మచ్చుకేని 
వసుధ నెందును లేడు... దైవంబు తోడు....ఆ.."

భవానీశంకరం:-
"శెట్టీ ... ఇక నీ ప్రచారం గానివ్వు.."

సుబ్బిశెట్టి:-
"నా ప్రాణానికొచ్చిందే....
కాని రోజులొచ్చి, కళ్ళు మూసుకపోయి 
సల్లంగ సానింటి కెళ్ళినాను 
నీమీద వలపంటె....ఒరే ఒరే...! నిజమేగామోసనుకుని
బిడియమిడిచి ...పంతులూ నువ్వెరితోనయినా చెబుతావా ఏంది?"

భవానీశంకరం:-
"చెప్పన్లే ..."

సుబ్బిశెట్టి:-
"ఆ...బిడియమిడిచి...  గబాగబ పిసికినాను... 
కాళ్ళు..."

భవానీశంకరం:-
"ఇక చాల్లే... రా పోదాం."

సుబ్బిశెట్టి:-
"అమ్మా...! వెళ్ళొస్తాం తల్లీ...!"

చింతామణి:-
"సరే నాయనా..."

"మన్యే త్వామిహ మాధవ దైవం
మన్యే త్వామిహ మాధవ దైవం  
మాయాస్వీకృత మానుష భావం
ధన్యైరాదృత తత్త్వ స్వభావం
ధన్యైరాదృత తత్త్వ స్వభావం  
ధాతారం జగతామతి విభవమ్‌
ధాతారం జగతామతి విభవమ్‌"

"పూరయ మమకామం గోపాలం 
పూరయ మమకామం గోపాలం 
పూరయ మమకామం..."

.....సమాప్తం....