January 1, 2020

ఏ దేశమేగినా


ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
సిరులు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!
వేదశాఖలు పెరిగె నిచ్చట
ఆదికావ్యం బందె నిచ్చట
అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు

ఓరుగల్లున రాజ వీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు
విద్యానగర రాజవీధుల గవితకు పెండ్లి పందిళ్ళు కప్పించునాడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు
ఆంధ్ర సంతతి కే మహితాభిమాన
దివ్య దీక్షా సుఖ స్ఫూర్తి తీవరించె
నా మహాదేశ మర్థించి యాంధ్రులార
చల్లుడాంధ్రలోకమున నక్షితలు నేడు
తృణ కంకణమునుండి:

అడుగుల బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్
మడుగులు గట్ట, మండు కనుమాలపుటెండ పడంతియోర్తు జా
ఱెడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా
ల్నడకన బోవుచుండె నెడలన్ కనుపించెడి పచ్చతోటలకున్
నిమ్మచెట్టు లేగొమ్ము పందిళ్ళకింద
పుస్తకపు పేటికలను, నా హస్తముదిత
చిత్రసూత్రమునను వసియించియున్న
దోయి!యిందాక మన ప్రేమయును సఖుండ!
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (మార్చి 17, 1892 - జూన్ 30, 1984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.

కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు.

అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి.

రాయప్రోలు సుబ్బారావు మొదటి చూపులోనే చూపరులను ఆకట్టుకుంటారని ప్రతీతి. తమ బెట్టుతో, బింకంతో, ఠీవితో, పల్లెవాటుల వయ్యారంతో, చెక్కుచెదరని క్రాఫింగ్‌తో నిండుగా ఉండేవారు. ఐతే ఒక పక్క కవిత్వంలో మన వంటి ధీరులింకెందునూ లేరని, ఏదేశమేగినా జాతిగౌరవం నిలపాలని వ్రాస్తూనే, మరొక పక్క తెలంగాణలో ప్రజలు రాజ్యంతో వీరోచితంగా పోరాడుతూండగా నైజాం రాజ్యాన్ని పొగుడుతూ రగడ రచించారన్న పేరు మూటకట్టుకున్నారు. వారిని గురించి రాస్తూ ఆంధ్రపత్రికలో సాహిత్యంలో కట్టలు తెంచుకుని మరవపారిన వీరి దేశభక్తి నిత్యజీవితాన్ని ముట్టనయినా ముట్టలేదు. ‘అవమానమేలరా అనుమానమేల, భరతపుత్రుడనంచు భక్తితో పలుక’ అని ప్రశ్నించి, ‘కంకణ విసర్జనకిది కాలమగునె’ అని హెచ్చరించిన వీరు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు తఖ్తు పునాదులు ఊగిసలాడే వేళకు, దీక్షాకంకణం తృణకంకణంలాగ విదిల్చివేశారు.