January 1, 2020

పూలవెల్లువ సూడే సిన్నెక్క


పూల వెల్లువ సూడే సిన్నెక్క
చిత్రం: గౌతమి (1987),
సాహిత్యం: సిరివెన్నెల,
సంగీతం: బాలు,
గానం: శైలజ, కోరస్

పల్లవి: 
పూలవెల్లువ సూడే సిన్నెక్క పిల్ల పాలనవ్వుల్లోన సిన్నెక్క
రేపో మాపో పెళ్ళి నువ్వు అత్తారింటికి వెళ్ళి
చేమంతమ్మ సీమంతానికి రావే మళ్ళీ        ||పూల||

చరణం 1:

కంటిపాపలాగ నన్ను కాపాడేటి తల్లి గోదారమ్మ ప్రేమ
దూరదేశం వెళ్ళి పెళ్ళి సంబంధాన్ని ఏరికోరి తెచ్చేనమ్మా
చేసే పూజలు చూసి నువ్వు నోచే నోములు పూచి
శుభలగ్నం తానే చేరేనమ్మ ఆశల వాకిలి తీసి

కో: ఏవైందమ్మ చెప్పేయమ్మ ఏదారమ్మ గోదారమ్మా       ||పూల||

చరణం 2:

ఆఘమేఘాన్నెక్కి మాఘమాసం వచ్చి ఆట పట్టించింది నిన్ను
లేత బుగ్గల్లోకి వేడి సిగ్గులు పాకి భారమైపోయింది వెన్ను
చాల్లే వేళాకోళం ఆపండే అల్లరిమేళం
నువ్వు వెయ్యాలమ్మా గోదారమ్మా వీరికి నోటికి తాళం

 కో: పిల్లవయ్యారాలు తూగుటుయ్యాలెక్కి ఊగుతున్నాయమ్మా గారంగా     ||పూల||

స్నేహితురాళ్ళు తనను ఆట పట్టిస్తుంటే పైకి ఎలా ఉన్నా, మనసులో మాత్రం ఆనందంగానే ఉంటుంది. నిజానికి, అందరూ తన పెళ్ళి గురించే మాట్లాడుకోవాలనే కోరిక ప్రతి ఆడపిల్లలోనూ ఉంటుంది. అలాకాకుండా, తన పెళ్ళి అని చెప్పినపుడు 'చాలా సంతోషం ' అని ఫ్రెండ్స్ అందరూ ముక్తసరిగా అనేసి ఊరుకుంటే ఎలా ఉంటుందో సరదాగా ఊహించండి.

స్నేహితులు పెళ్ళికూతురితో వేళాకోళాలాడే సందర్భాలకి రాసిన పాటలు, సినిమా కోసమే రాసినవైనా, సినిమా నుంచి వేరుపడి కూడా, సందర్భానికి అతికే పాటలు.