January 14, 2022

తెలుగు సినిమాల్లో హాస్య పోకడలు; జంధ్యాల గారి సినిమాలు ఎందుకు జనరంజకమయ్యాయి?

ఇవాళ (14.01.2022) జంధ్యాల గారి జయంతి సందర్భంగా:


హాస్యం అనగా వినోదం కలిగించి, నవ్వు పుట్టించే లక్షణం కలిగిన ఒక భావానుభవం. హాస్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అలానే సినిమాల్లోనూ చాలా ప్రధానమైన రసం. సినిమాలో సాధారణంగా ఎన్ని రకాల రసాలు పలికినా... హాస్యానికి మాత్రం ఒక ప్రత్యేకమయిన స్థానం ఉంది. రెండున్నర గంటల సినిమాలో ఎన్ని ఎక్కువ దృశ్యాల్లో హాస్యం పరంగా ఎంటర్ టైన్ మెంటు ఉంటే అంత ఎక్కువ రిలీఫ్ ని పొందుతారు ప్రేక్షకులు. అందుకే ముఖ్యంగా చాలా తెలుగు సినిమాల్లో కథావస్తువు ఏదయినా గానీ... చెప్పే మాధ్యమాన్ని హాస్యంగా ఉండేలా చూసుకుంటారు రచయిత, దర్శకుడు. పైగా హాస్య ప్రధానమైన సినిమాలకి తెలుగులో మినిమమ్ గ్యారంటీ కలెక్షన్లు తప్పనిసరిగా వస్తాయి.

సినిమాల్లో మనం చూసే హాస్యం దర్శకుని అభిరుచి మేరకు రకరకాల పద్ధతుల్లో సృష్టించబడుతుంది. కొందరు దర్శకులు దృశ్య ప్రధానమైన హాస్యం ఇష్టపడితే, ఎక్కువమంది దర్శకులు సంభాషణల పరంగా కానీ నేపథ్య సంగీతం మూలంగా హాస్యం వచ్చేలా చూసుకుంటారు. డైలాగులు లేకుండా దృశ్య ప్రధానమైన హాస్యం చూపించడం అంత తేలిక కాదు కాబట్టి తెలుగులో సంభాషణల పరంగా ఉండే హాస్యమే ఎక్కువ. ఈ రకపు హాస్యాన్ని మాటల రచయిత నుంచి, నటుల దగ్గర్నుంచి రాబట్టుకోవడం తేలిక కూడాను.

అసలింతకీ తెలుగు చలనచిత్రాల్లో హాస్యం ఎన్ని రకాలుగా ఉంటుంది? (ఇక్కడ నేను గమనించిన దాదాపు ఏభై రకాల హాస్య ప్రక్రియలను ప్రస్తావించాను. వెదికితే ఇంకా ఉంటాయి.)

1) Slapstick (స్లాప్ స్టిక్) కామెడీ

అవాస్తవిక కామెడీ అని కూడా దీన్ని పిలుస్తారు. దీనిలో హాస్యం ఎక్కువగా తెలివి తక్కువ తనపు పనుల వలన, భౌతికంగా ఒక పాత్ర తనను తాను గానీ లేదా వేరే పాత్రను గానీ బాధించడం ద్వారా పుడుతుంది. డైలాగుల ప్రమేయం అంతగా ఉండక పోవచ్చు. ఈ శైలికి "చార్లీ చాప్లిన్" చిత్రాలు, "పాపాయ్ ద సైలర్ మ్యాన్", "టామ్ అండ్ జెర్రీ" షోలు ప్రధాన ఉదాహరణ. హిందీలో డేవిడ్ ధావన్ చిత్రాలు, శ్రీను వైట్ల సినిమాల్లో బ్రహ్మానందాన్ని నాగార్జున కొట్టడం (కింగ్), "వెంకీ" సినిమాలో, ట్రైన్ ఎపిసోడ్ లో బ్రహ్మానందాన్ని, ఏవీఎస్ ని రవితేజ కొట్టడంఈ.వి.వి గారి సినిమాల్లో ఐరన్ లెగ్గు శాస్త్రి ని రాజేంద్రప్రసాద్ లేదా బ్రహ్మానందంలు లెగ్గు చేసుకోవడం కూడా దీని కిందకే వస్తాయి. తెలుగులో బాబూ మోహన్-కోట ద్వయం మధ్యన జరిగే ఎన్నో సన్నివేశాలు ఈ కోవకు చెందినవే. ప్రాక్టికల్ జోక్స్, ఛేజింగ్ సీన్లు-గుద్దుకోవడం-పడిపోవడాలు ఇవన్నీ ఈ కోవకే వస్తాయి. సుత్తి వీరభద్రరావు "అహ నా పెళ్ళంట","రెండు రెళ్ళు ఆరు" చిత్రాల్లో చొక్కా చించుకోవడం, "చంటబ్బాయ్" లో చిరంజీవి కోటు జేబులో లైటర్ వేసుకోవడం వల్ల పుట్టే హాస్యం, అల్లు అరవింద్-చిరంజీవిల మధ్య జరిగే ప్రహసనాలు, "అహ నా పెళ్ళంట", "వివాహ భోజనంబు" సినిమాల్లో బ్రహ్మానందం తనను తాను మొహంపై కొట్టుకుని విచిత్రమైన హావభావాలు ప్రదర్శించడం కూడా దీని క్రిందకే వస్తాయి.

2) Deadpan (డెడ్ పాన్) కామెడీ; భావరహిత హాస్యం

"హిందువుల విగ్రహాలను కూల్చిన ప్రతిసారీ.... బూట్లు తీసే మందిరంలోకి ప్రవేశించేవాడు ఔరంగజేబు; సర్వమతాలనూ గౌరవించే మా దొడ్డ ప్రభువు."

"అసలుకి టాలీవుడ్లో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం (Nepotism) ఉంటే కదా…! కావాలంటే చూసుకోండి...మంచు విష్ణు అంత అందగాడూ, సుశాంత్ అంత గొప్ప నటుడూ లేనే లేరు."

"పద్మావతి సినిమాని బ్యాన్ చేయించడమే రాజపుత్రులు గత వెయ్యేళ్ళలో గెలిచిన తొలి యుద్ధం." లాంటివి కొన్ని ఉదాహరణలు.

సాధారణంగా ఇది పరిహాసకరమై, రియలిస్టిక్ గా ఉంటుంది. దీన్ని డ్రై హ్యూమర్ అని కూడా అంటారు. ఇక్కడ దృశ్యం లేదా సంభాషణ యొక్క ముఖ్యోద్దేశ్యం దూషణ ప్రధానమైనది. భావం చర్నాకోలాతో కొట్టినట్లు ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య, టి. కృష్ణల దర్శకత్వాల్లో వచ్చిన చిత్రాల్లో పి.ఎల్.నారాయణ గారి పాత్రలు ఇలాంటి హాస్యాన్నే పండిస్తాయి. అంతర్లీనంగా హాస్యం ఉంటుంది గానీ ముఖ కవళికలతో కూడిన భావప్రకటన పెద్దగా అవసరం లేనిది.

"లంకంత కొంపలో ఒక్కడివి ఎలా ఉండగలవు? పాపం..రావణాసుసురుడు లాగా!"(బాబాయ్-అబ్బాయ్) (అశ్వద్ధామ అతః కుంజరః)

3) సెటైర్; వ్యంగ్యం

ఇందులో రెండు రకాలు ఒకటి సెటైర్, రెండవది సర్కాసం (Sarcasm)

ఇది సమయోచిత లేదా పరిశీలనాత్మకమైన అంశాలతో కూడుకున్న హాస్యం.

సమయోచిత హాస్యం అంటే సమకాలీన వార్తలు, ఎన్నికలు, సంస్కృతి లేదా పోకడలపై ఉంటుంది. కొంత అతిశయోక్తిని వాడుకుని హాస్యభరితమైన అంశాల్ని చెప్పడమన్నమాట.

పరిశీలనాత్మక హాస్యం అంటే రోజువారీ జీవిత సంఘటనలను తీసుకుని వ్యంగాస్త్రాలు సంధించడం. ఇది ఎక్కువగా సామాజిక లోపాలు లేదా మూర్ఖత్వాలను, మూఢ విశ్వాసాలను సున్నితంగా విమర్శిస్తుంది.

వ్యంగ్య రచయిత దివంగత జస్పాల్ భట్టి రాసిన ఫ్లాప్ షో సిరీస్‌ను ఎవరు మరచిపోగలరు...? హిందీ సినిమాల్లో "పీకే", "ఓ మై గాడ్" కూడా ఒకరకంగా అలాంటివే.

"టీవీలో వచ్చే ప్రోగ్రాములు ఎంత ఛండాలంగా ఉన్నా...మనం టీవీ బద్దలు కొట్టుకోకూడదు బాబూ..."(అహ నా పెళ్ళంట)

"మామూలుగా దొంగలు పడ్డ ఆర్నెల్లకి గానీ పోలీసులు మొరగరు కదా..!",

"సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుక్కుతింటూ బతుకు. నా కొడుకు పుట్టగానే టీవీ చూసి దడుచుకుని చచ్చాడనుకుంటాను..ఫో" (చంటబ్బాయ్)

"మరే...! ఈ కాలంలో మగవాళ్ళు ఎప్పుడయినా సరదాకి చీర కడుతున్నారేమో గానీ...ఆడపిల్లలు మాత్రం ముచ్చటక్కూడా చీర కట్టడం మానేసారు" (విచిత్రం)

"డొనేషన్లు కట్టి పాసయిన డాక్టర్లున్నంత కాలం మన దేశంలో శవాలకు కొరత లేదు." (రావు గోపాలరావు) 

4) నిందల హాస్యం

ఇందులో రెండు రకాలు

మొదటిది నిందాపూర్వక హాస్యం (Insult)

దీన్నిండా అనుచిత వ్యాఖ్యలుంటాయి. దీన్ని ఇతరులను తూలనాడడానికి ఎక్కువగా వాడుతారు. సాధారణ పరిహాసానికి మించి ఎదుటి వ్యక్తిని కించపరచడానికి ఉపయోగిస్తారు. గేలి చేసేప్పుడు, వెక్కిరించడానికి, ఎగతాళి చేయడానికి, చులకనగా మాట్లాడటానికి ఈ హాస్యాన్ని ఉపయోగిస్తారు.

"జబర్దస్త్" షో నిండా ఇవే జోకులు. "కపిల్ శర్మ షో" కూడా దాదాపు అలాంటిదే. బ్రహ్మానందం-హేమ మధ్యన "అతడు"లో వచ్చే డైలాగులుసూర్యకాంతం-ఛాయాదేవి మధ్యన మాటలుఅత్తాకోడళ్ళ మధ్య ఎపిసోడ్లు, కుళాయిల దగ్గర పోట్లాటలు, గయ్యాళి భార్యల వాచాలత్వపు తిట్లు (ముద్ద మందారం లో అన్నపూర్ణ), విక్రమార్కుడు సినిమాలో పిల్లలతో, వాళ్ళ తల్లులతో రవితేజ హాస్యం ఇవన్నీ కూడా.

"పోతావురరేయ్... నాశనమై పోతావ్..!" (అహ నా పెళ్ళంట), "మలపత్రాష్టుడు" (బావా బావా పన్నీరు) ఇత్యాది సినిమాల్లో బ్రహ్మానందం కోట శ్రీనివాసరావుని తిట్టే తిట్లు కూడా ఇవే.

వాడి కంఠనాళానికీకక్కసు గొట్టానికి తేడా లేదయ్యా (ప్రేమ ఎంత మధురం)

ఇక రెండవది నిందా స్తుతి హాస్యం

పొగిడినట్లు ఉంటుంది గానీ అంతర్లీనంగా మాత్రం తిట్టు. కత్తి కాంతారావు సినిమాలో వేణుమాధవ్ అల్లరి నరేష్ తో "నీ ఎదవ తెలివితేటల మీద నాకు బోల్డంత నమ్మకముంది బావా..." అంటాడు

"ఏం గొప్ప "సంగతం"డీ...! భోపాల్ గ్యాసు ప్రమాదం దీని ముందెంత? ఆఫ్టరాల్...!"

"ఇది మరీ గొప్ప సంగతండీ...! రష్యాలో వచ్చిన భూకంపం, దీని ముందు బలాదూర్..."

"ఇది మరీ అద్భుతం... కనిష్క విమాన పతనం దీన్లో వందో వంతే.." ఫ్లూటు (తో) 'వాయిస్తున్న' బ్రహ్మానందాన్ని చంద్రమోహన్ పొగడ్త (జయమ్ము నిశ్చయమ్మురా)

"మొన్ననే ఐదొందలు రూపాయలు ఖర్చుపెట్టి ఢిల్లీకి వెళ్ళి ఏభై రూపాయలు అప్పు సంపాదించుకొచ్చాడు." (జయమ్ము నిశ్చయమ్మురా)

"అయ్యో...అయ్యో...! నువ్ మంచోడివంటే నమ్మేసిందా? ఆ పిల్లకి బొత్తిగా లోకజ్ఞానం లేదంట్రా..? అరె..నువ్ సూర్యుడుంటే విస్కీ, సెంద్రుడుంటే బ్రాందీ తప్ప వాళ్లిద్దరూ లేనప్పుడసలేం తాగవు." (రాగలీల)

5) అమాయకపు హాస్యం

"అత్తయ్య గారి కర్మకాండలో స్వీటు పెట్టచ్చో లేదో పంతులు గారిని సరిగ్గా కనుక్కోండి...అసలే ఆవిడకి షుగర్."

"మన దేవుళ్ళ గొప్పదనం తెలిసే ప్రపంచమంతా ఆది, సోమ, మంగళ ఇత్యాది పేర్లతో రోజుల్ని పిలుస్తున్నారు"

"ఒకే రోజు రెండు లక్షల మందికి వాక్సిన్ వేయడమెందుకు? టీకాలు అయిపోగొట్టుకోవడం ఎందుకు? రోజుకి ఏభై వేల మందికి వేస్తే అవి ఎప్పటికీ అయిపోవు గదా!...బుర్రలో గుజ్జు ఉండదు ప్రభుత్వాలకి." అని చెప్పిన హరియాణా ముఖ్యమంత్రి మాటలు ఇటువంటి హాస్యానికి ఉదాహరణలు.

"హిట్లర్" సినిమాలో బ్రహ్మానందం-కల్పనా రాయ్ మధ్యన జరిగే హాస్యం, "పిల్ల నచ్చింది"లో ఎల్బీ శ్రీరామ్-కల్పనా రాయ్, ఎల్బీ శ్రీరామ్-ఎమ్మెస్ నారాయణల మధ్యన జరిగే హాస్యం, "ఇంద్ర" సినిమాలో ఏవీఎస్ గారి తెనాలి కామెడీ లు ఉదాహరణలు.

"రెండు జెళ్ళ సీత" సినిమాలో ఒక డైలాగు.

వేలు:- "ఇదిగో నేను ఆఫీసు కెళ్తున్నాను. ఊళ్ళో దొంగతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయిట...కళ్ళు మూస్తే చాలు ఇల్లంతా దోచుకు పోతున్నారట."

శ్రీలక్ష్మి:- "అలాగా...! అయితే నేనొక పని చేస్తానండీ!....ఇంటి చుట్టూ మడి బట్టలారేస్తాను, ఒకవేళ దొంగలొచ్చినా మడిబట్టలు ముట్టుకోరు కదా...!"

అదే సినిమాలో ఇంకోచోట పొట్టి ప్రసాద్

"నీ బొంద...! కాలీ ఫ్లవరు, కంట్లో పువ్వు....పువ్వుల జాబితాలోకి రావుగానీ...నీకు నచ్చిన రెండు పుష్పాల పేర్లు చెప్పు."

"రెండు రెళ్ళు ఆరు" సినిమాలో శ్రీలక్ష్మి-సుత్తి వీరభద్రరావు గార్ల హాస్యం పూర్తిగా అదే కోవలోనిదే. ఇంకా చెప్పాలంటే శ్రీలక్ష్మి గారి అన్ని పాత్రలూ ఇదే అమాయకత్వంతో ఉంటాయి దాదాపు జంధ్యాల గారి అన్ని సినిమాల్లోనూ

"బావా బావా పన్నీరు" లో ఇలాంటిదే ఇంకోటి

ఝాన్సీ:- "ఏవండీ...కొంపలో బియ్యం నిండుకున్నాయి. పిల్లలకి ఏం వండి పెట్టనూ ...?"

ధర్మవరపు:- "నన్ను... నన్ను కోసి కూరొండి పెట్టవే. పీడా వదిలిపోతుంది."

ఝాన్సీ:- "పిల్లలు నీచు తినరు కదండీ...!"

“జెండాకర్రలు, బొంగరాలు, ఉరితాళ్ళు, పురికొసలు ముగ్గులుగా వెయ్యరే...” (సీతారామ కళ్యాణం)

6. పదాలాట: ప్రాసలతోట హాస్యం

"అద్వానీ (Advani) గారు తను చెప్పిన మాట మోడీ వినాలనుకుంటే గనుక...తన పేరులో ఉన్న "v"ని తొలగిస్తే సరి."- అరవింద్ కేజ్రీవాల్

“ఆయనేమో వరేసుకోవాలి... రైతులేమో ఉరేసుకోవాల్నా...?” కే‌సి‌ఆర్ గురించి రేవంత్ రెడ్డి.   

"వీణ్ణి కుంగ్ ఫూ నేర్చుకోమని పంపిస్తే కొంగు ఫూ నేర్చుకుని వచ్చాడు."

“బారోమీటర్ ప్రెషర్ ని కొలిస్తే సారోమీటర్ ప్రేమని కొలుస్తుంది.”

నా జీవితంలోకి వచ్చిన women లందరూ omen లే..”

పదాల ఉచ్చారణ, వాటి అర్థాలతో (అక్షరాలనటునిటు చేసి) హాస్యం తెప్పించడం.

జంధ్యాల గారి సినిమాల్లో తరచుగా వినిపించే ఎన్నో హాస్య సంభాషణలు ఎక్కువగా ఈ కోవకే చెందుతాయి. ప్రాసలతో "వేటగాడు" సినిమా లోని రావుగోపాలరావు-సత్యనారాయణల మధ్య వచ్చే డైలాగులే గానీలేదా

"కోడలేదంటే గోడలకేసీ, నీడలకేసీ చూస్తావేరా ఊడల జుట్టు వెధవా?" అనీ..

"అబ్బా....మనకా ఈలలు గోల ఏల? ఈ ఈలన్నది ఇలలో కలలో మన ఇంటా, వంటా లేని విద్యే..."

"ఓసి నీ బాధ తగలెయ్యా...! గుండిగ కింద పడ్డ అప్పడంలా గుండె చితికిపోయింది కదమ్మా..." అని సుత్తి వీరభద్రరావు

"ఇక నా వల్ల కాదే...ఈలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను." ఆనంద భైరవి సినిమాలో సుత్తివేలు గోల.  

"అసుంటే ఆగు శుంఠా...!" (నెలవంక)

"వందా నా బొందా...! అమావాస్యెళ్ళి గ్రహణాన్ని అప్పడిగినట్టుంది. వంద నోటు చేత్తో ముట్టుకుని వంద నెల్లయ్యిందండీ బాబూ....!"

"చిల్లర మనకీ... చివాట్లు ఆయనకీ రాసిపెట్టి ఉంటే మనమేం చేస్తాం...?" "శ్రీవారి శోభనం" సినిమాలో ఇలాంటి డైలాగులు బోలెడుంటాయి

"బోంబే బాంబే తుస్సుమందంటే...." (ష్...గప్ చుప్...!)అవన్నీ ఇదే కోవకి.

"నేను ఇంట్లో వంట చేస్తానని మీతో చెప్పిన శుంఠ ఎవడూ...?" (రెండు రెళ్ళు ఆరు)

"మల్లెపందిరి" సినిమాలో

"ఈ ప్రేమ అనేది ఒక దుష్టసమాసం నాయనా...!ప్రే (Prey) అంటే ఇంగ్లీషులో "ఎఱ" అని అర్థం "మ" నిషాద.... "మ" అంటే సంస్కృతంలో వద్దు అని. అంచేత ప్రేమంటే "ఎఱ కావద్దు" "బలి కావద్దు" అని ప్రేమలో పడదలచుకున్న ఒక యువకునికి హితబోధ చేస్తాడో వేటూరి స్వామి.

"పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవ్వుద్దయ్యా..." (వివాహ భోజనంబు)

"కళ్ళు మూసుకున్న ఏ మనిషినీ కల్లు తాగే ఏ గాడిదకొడుకూ లేపకూడదు...అది శాస్త్రం." ఒక తాగుబోతు ఉవాచ.(పుత్తడిబొమ్మ)

"ఉన్నోళ్ళు, నోరున్నోళ్ళు ఏవయినా అంటారు మావా...!" ఇదే సినిమాలో ఓ ఓదార్పు వాక్యం.

"నేను జెట్ మలానీ నో రాకెట్ మలానీ నో కాదు..." (చంటబ్బాయ్)

“ముగ్గు కొనలేక నా ఆస్తి నుగ్గయిపోతుంది.”, “నా దగ్గర వేడిగా ఉండే అట్లుండవు...వాడిగా ఉండే తిట్లుంటాయి.”,మిష్టర్ హరీ... హరీ అప్ “ఓసీ నీ తెలివి తెల్ల కాకులెత్తుకుపోనూ...”, “నషాలానికెక్కే మసాలా టీ ఒకటియ్...”  (సీతారామ కళ్యాణం)

"వాడు అబ్బాయ్ కాదు డబ్బాయ్...26 హవర్సూ డబ్బవసరమే వాడికి..." "నువ్వసలే ఆలిండియా అబ్బచాటు కొడుకుల సంఘానికి అధ్యక్షుడివి. వీసమెత్తు పనీ, చిన్నమెత్తు రాబడి లేనోడివి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎట్టొప్పుకుందిరా...?"(రాగలీల)

"చేయవలసింది నేను చేసుకుపోతాను. చూడగలిగితే మీరు చూసుకుపోండి...లేదా కళ్ళు మూసుకుపోండి. దట్సాల్..!"

"ఏం చెప్పమంటారు మహాప్రభో...! గురుకృప లాగా ఇది గుఱ్ఱం కృప" విరిగిన నడ్డి మీద చేతులేసుకుని నడుస్తూ చెప్పే పొట్టిప్రసాద్ (నెలవంక)

"ఘంటసాల స్వర టంకశాల కదయ్యా..." (చూపులు కలిసిన శుభవేళ)

తాను గుడ్డ చుట్టుకున్న సైతాను వెధవా...!(బాబాయ్ హోటల్)

“ఈసారి గనుక సెలూన్ లోకి గనక బాబాయొస్తే ఏ సిలోనో పారిపోవాల్సిందే...!”(బాబాయ్ హోటల్)

అంగట్లో అమ్మేవి తక్కువ.... నీ ఆంగిట్లో దూరేవి ఎక్కువా అయిపోయాయి.” “పాతిక కోళ్ళను తిన్నా పరగడుపే...ఏభై మేకల్ని తిన్నా నీకు దిగదుడుపే..” “కుక్క ముక్కు సంప్రాప్తించిదేమిరా నీకు తిక్క వెధవా...!” “బాబూ! నీ క్షుత్తుకు నా జోహార్లు....నీ జీర్ణశక్తికి నా జేజేలు”(పడమటి సంధ్యారాగం)

"చరిత్రలో గోల్డ్ మెడల్ సంపాదించక పోయావో....నీ గోళ్ళు ఊడబీకి, మెడలు విరిచేస్తాను.", "బాతు (బాత్) రూమా? కోడి రూమా?"  (రావుగోపాలరావు)

 7. "స్వ"లోకువ హాస్యం

తమను తాము తక్కువ చేసుకునే హాస్యం. స్టాండ్ అప్ కామెడీల తరహాదన్నమాట. "నువ్వు నాకు నచ్చావ్" లో వెంకటేశ్. "జల్సా", "గుడుంబా శంకర్", "తమ్ముడు" సినిమాల్లో పవన్ కళ్యాణ్ పాత్రలు, చాలా తెలుగు సినిమాల్లో పోరంబోకు హీరో డైలాగులు చాలావరకు ఇవే.

"ఒక్కసారి నా ఫేసు కేసి చూడవే...ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదాని కుంటుందే...? నా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే...అది దడుచుకుని టైఫాయిడ్ తో మంచమెక్కింది. నన్నే ఆడది ప్రేమించి ఉత్తరం వ్రాస్తుందే...?" నిరుద్యోగి పాత్రధారి సుత్తివేలు ఆవేదన.(శ్రీవారి శోభనం)

8. వికారపు హాస్యం

ఇది ఎక్కువగా అప్రయత్నపూర్వకమై ఉంటుంది; అందరూ తన గురించే నవ్వుతున్నట్లు తెలియదు. తన పని తను సీరియస్ గా చేస్తూ పోతుంటాడు కానీ ప్రేక్షకులు నవ్వుకుంటారు. చాలా సినిమాల్లో వెటరన్ ఆర్టిస్టులను అనుకరించి హాస్యగాడు చేసే డాన్స్, డైలాగ్స్. ప్రాంక్స్, వాళ్ళకి తెలియకుండా కమెడియన్లకి తోకలు తగిలించడం, అరటిపండు లేదా గోళీల మీద కాలు వేసి జారిపడడం, పిండి లేదా వస్తువులు తలమీద పడటం లాంటి హాస్య సన్నివేశాలు దీనిక్రిందకే వస్తాయి.

"వాసు" సినిమాలో వెంకటేష్ చేసే బస్టాపు హాస్యం కూడా ఇదే.

రెండు మూడు సార్లు తలుపు తెరిస్తే వచ్చే విసిగించే పాత్ర...ఇంకోసారి తలుపు తెరిస్తే వేరెవరో ముఖ్యులు రావడం (రెండు రెళ్ళు ఆరు) లాంటివి ఈ కోవకు వస్తాయి.

చంటబ్బాయ్ లో కోటు చొక్కా చేతులు లాగగానే వచ్చేయడం, తెలియక సుహాసిని మీద ఇంకు చల్లడం, పాటల్లో ఏదో గొప్పగా చేయబోయిన ప్రతిసారీ జేమ్స్ పాండు భంగపడటంష్ గప్ చుప్ లో శుభలేఖ సుధాకర్ వాక్యూమ్ క్లీనర్ ప్రహసనం కూడా అటువంటివే.

9. డార్క్ (బ్లాక్) హ్యూమర్

వివాదాస్పదమైన హాస్యం. సాధారణంగా ఎక్కువ శాతం ప్రజలు దీనిని మెచ్చుకోరు; ముఖ్యంగా విమర్శకులు. చాలా మంది దీనిని అనారోగ్యకరంగా మరియు అరగని హాస్యంగా భావిస్తారు. మరియు దాన్ని ఆస్వాదించే వారు తరచూ ఎక్కడో కొంత అపరాధ భావనతో ఉంటారు. నగరాల్లోని మల్టీ ప్లెక్స్ థియేటర్లలో ఈ సినిమాలను ప్రదర్శిస్తారు. బ్లాక్ కామెడీ సాధారణంగా లైంగిక హింస, వివక్ష, జాత్యహంకార, న్యాయ విరుద్ధ,మత, సాంప్రదాయ వ్యతిరేక, రాజకీయ దురుద్దేశ, అశ్లీల మరియు మరణం వంటి అంశాలను కలిగి ఉంటుంది. "ది బెన్నీ హిల్ షో" అన్న పేరుతొ వచ్చిన బ్రిటిష్ కామెడీ ఒక పెద్ద ఉదాహరణ. దాన్నిండా స్కిన్ షో ఉంటుంది, అసభ్య డైలాగులు ఉంటాయి అంగాంగ ప్రదర్శన ఉంటుంది. ఇందులోని అసభ్యకరమైన హాస్యాన్ని బ్లూ హ్యూమర్ అని కూడా పిలుస్తారు.

10. సందర్భోచిత హాస్యం

పాత్ర ఉన్న పరిస్థితుల నుండి ఉత్పన్నమయ్యే హాస్యం. కామెడీ అఫ్ ఎర్రర్స్ కూడా దీని క్రిందకే వస్తాయి. పాత్రలు మారుపడిపోవడం, వేరెవరికో దొరకడం, తికమక-అయోమయం-గజిబిజి హాస్యాలన్నీ ఈ కోవకే. జంధ్యాల గారి సినిమాల్లో ఇలాంటి పాత్రోచిత హాస్యం నిండుగా ఉంటుంది. చంటబ్బాయ్, అహ నా పెళ్ళంట లాంటి సినిమాల్లో ఒక్కొక్క పాత్రా దానికున్న క్యారెక్టరైజేషన్ పరంగా పూర్తి విస్తృతితో మూలాల్లో కెళ్ళి మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆయన సినిమాల్లో జస్ట్ పాత్రల పరిచయం, ప్లాట్ పాయింట్లు, ముగింపు, ముక్తాయింపు మాత్రమే ఉండవు. ఒక్కొక్క పాత్రా దాని పరిధి మేరకు హాస్యపు గుబాళింపులు కురిపిస్తూనే ఉంటుంది. పైగా ఒక్కో సీనులో ఒక్కో పాత్రా చేసే హావభావ విన్యాసాలు కడు విచిత్రంగా ఉంటాయి. ఆయన అన్ని సినిమాల్లోనూ సుత్తివేలు, సుత్తి వీరభద్రరావుల జంట చేసే హావభావ కోలాహలం బహు రంజుగా ఉంటుంది. దానికి తోడు అటు గ్రాంథికానికీ, ఇటు వాడుకభాషకీ మధ్యస్థంగా ఉండే జంధ్యాల మార్కు పదవిన్యాసం కూడా ఆ పరిమళాన్ని ఇంకా రమణీయంగా మారుస్తుంది. శ్రీవారి శోభనం సినిమాలో కనిపించినవన్నీ కొట్టేసే చిలిపి దొంగగా సుత్తి వీరభద్రరావు పాత్రని మలచిన తీరు, ఆయనకి వ్రాసిన మాటలు భలే గమ్మత్తుగా ఉంటాయి.

"రుచి చూడక అట్టా అంటన్నావు గానీ...ఓసారి ఒక సుక్క తాగి సూడవే సుబ్బులూ! రేపటాలనుంచి బువ్వ కూడా ఆ సారా నీళ్ళతో వండుకో పోతే నన్ను సెప్పెట్టి కొట్టు" విన్నకోట రామన్న పంతులు "ముద్దమందారం" సినిమాలో పలికించే హాస్యం.

"ఉత్తుత్తి వెక్కిళ్ళకి ఉత్తి గ్లాసు చాలు." రాజేంద్రప్రసాద్ తో రజని (ఆహ నా పెళ్ళంట)

"అయ్ బాబోయ్...ఇదేంటయ్యా ఇది. గడ్డం అనుకున్నావా? పొలమనుకున్నావా? నాట్లేస్తున్నావ్ అదే పనిగా…" మంగలి పెట్టిన గాట్లను చూసుకుని వలవలలాడే ఒక పాత్ర.

“వీడెవడో రోహిణీకార్తెలో బెజవాడలో పుట్టినట్లున్నాడు; చీటికీమాటికీ మండిపడిపోతున్నాడు.”(చిన్ని కృష్ణుడు) 

"ఈ రోజుల్లో రిక్షా తొక్కేవాడు లక్షంటున్నాడు. ఆటో నడిపేవాడు మీటరు మీద రెండు లక్షలు పెట్టి... ఆ తర్వాత మాట్లాడమంటున్నాడు.  అదే ట్యాక్సీ వాడయితే స్టెప్నీతో సహా ఐదు టైర్లకీ అయిదు లక్షలిచ్చేయ మంటున్నాడు." (విచిత్రం) 

దర్శకత్వం చేసిన కొత్తల్లో కొన్ని అభ్యంతరకరమైన డైలాగులు వ్రాసినా...తర్వాత్తర్వాత జంధ్యాల గారు వాటిని త్యజించారు. అందులో ఒకటి "సాని పాపకీ, సారాబుడ్డికీ అంటూ, ఎంగిలీ ఉండవు బాబూ..."(ముద్దమందారం)

11. సింబాలిక్ హాస్యం:

ఎవరినన్నా పిచ్చ కొట్టుడు కొడుతుంటే....దూది ఏకుతున్నట్లు, చాకిరేవులో బట్టలు బండకేసి బాదుతున్నట్లు చూపించడం, రోట్లో పచ్చడి చేస్తున్నట్లు, పొత్రంతో రోట్లో పిండి రుబ్బుతున్నట్లు, అంట్లు తోముతున్నట్లు, తువ్వాలును పిండినట్లు చూపించడం, పేపరు చింపేసి బాగా చేశారని చెప్పడం లాంటివన్నమాట.

జంధ్యాల మార్కు సింబాలిక్ హాస్యం చాలా సినిమాల్లో చూడొచ్చు. "అహ నా పెళ్ళంట" లో బకెట్ తన్ని చచ్చినట్లు పడిపోయే నూతన్ ప్రసాద్. అతని ఆటోబయోగ్రఫీ దెబ్బకి ఎదుటివాళ్ళు ఇరుక్కుపోయిన సందర్భాలలో "రాణీ చచ్చిందేవ్...ఫినిష్" అనీ చెస్ ఆడే యువతులు"దొరికిపోయాడ్రరేయ్ ఇక వాడు చచ్చాడన్నమాటే... ఫినిష్." అని రోడ్డు పక్కన ఆటాడుకునే పిల్లలూ"హమ్మయ్య...దొరికింది" అని కోడిని పట్టుకుని బ్రహ్మానందంతో అనిపించడం.

"పుత్తడిబొమ్మ" సినిమాలో మేక పాత్రధారి ఆశుకవిత్వం దెబ్బకి వాంతులు చేసుకునే ఒక ఇల్లాలుఆవిడ చెవులు మూసే ఇంకో ఇల్లాలు.

ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు తమ పిల్లల సంసారాల్లో వచ్చిన చిక్కులకు దండేసిన ఫొటోల్లో నుంచి మాట్లాడుతూ, తదనుగుణంగా ఫీలింగ్స్ పెట్టడం (మొగుడూ-పెళ్ళాలూ)

పనీ పాటా లేని ఆడంగులు... పెళ్ళయిన జంటల మధ్య పుల్లలు పెట్టడం కోసం ఇంటి తలుపు తట్టే ముందు...ఒక కోతుల గుంపుని చూపించడం (మల్లె పందిరి)

12. వెటకారపు హాస్యం:

"ఈ మందు తాగితే చాలయ్యా బేషుగ్గా బరువు తగ్గుతావు. కానీ అది ఒంటబట్టడానికి మాత్రం ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట మాత్రం నడవాలి."

"పేస్ బుక్ వలన కలిగే నష్టాల గురించి పేస్ బుక్ లో నిన్న ఒక మంచి ఆర్టికల్ వచ్చింది... చదివావా?"

మన తెలుగు సినిమాల్లో గోదావరి జిల్లాల హాస్యంగా ముఖ్యంగా భీమవరానికి చెందినదిగా చెలామణిలో ఉన్న హాస్యమిది. నువ్వు నాకు నచ్చావ్, స్వయంవరం, అతడు సినిమాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వ్రాసిన సంభాషణలుసునీల్, కృష్ణభగవాన్ తదితర నటులు పలికించే హాస్యం ఈ కోవకు చెందినదే.

13. Body Shaming:

పాత్రధారుల వేషధారణను, వాళ్ళ భౌతిక రూపాలను వెక్కిరించడం. లావుగా ఉన్న వాళ్ళను చూపించిన ప్రతిసారీ నేపథ్య సంగీతంలో పంది, ఏనుగు లేదా బఱ్ఱె అరుపులు వేయడం. అందంగా లేని వాళ్ళని, సన్నగా ఉండే వాళ్ళని, నల్లగా ఉన్న వాళ్ళ రంగుని ఎగతాళి చేయడం. పొట్టివారిని, బట్టతల వాళ్ళని, కుంటి, గుడ్డి, మెల్లకన్ను, మూగ పాత్రలను ఆ వికలాంగాల పేర్లతో హేళన చేయడం. వికలాంగుల మీద జోకులన్నీ ఇవే.

"అహ నా పెళ్ళంట" లో గుండు హనుమంతరావు-బ్రహ్మానందం మధ్యన ఉండేది కూడా కొంతవరకు ఇదే.

"విచిత్ర సోదరులు" చిత్రంలో అప్పు పాత్ర, జంధ్యాల గారి "మూడు ముళ్ళు" చిత్రంలో మరుగుజ్జుల నుంచి పిండుకున్న హాస్యం కూడా ఈ విభాగానికి చెందినదే.

"జయమ్ము నిశ్చయమ్మురా" లో చంద్రమోహన్ గారి అత్తగారి చెవిటి పాత్ర.

ఏవండీ...ఊళ్ళోకి సర్కస్ వచ్చింది..సాయంత్రం వెళ్దామా?”భార్య “వద్దే...అక్కడ ఏనుగుల మధ్య తప్పి పొతావ్ నువ్వు” భర్త. “నిన్ను సైకిలెక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది. ఒక రిక్షాలో ఇద్దరం పట్టం. పోనీ నడిచి వెళదామా అంటే..అరమైలు దూరం ఆరునెల్ల కాలం నడుస్తావ్...చెరుకు గడ లాంటి అమ్మాయిని చేసుకుందామనుకున్నాను. ఆరు మణుగుల చింతపండు బస్తావి దొరికావు. దానికి తోడు చెట్టంత చెవుడు.” “సీతారామ కళ్యాణం” లో సుత్తివేలు భార్య కల్పనారాయ్ పాత్రతో చేసే సంభాషణలు. “ఆహా! ఆ మొహం చూడు ...రావణాసురుడి పది తలకాయల బరువు తూగుతుంది.బావా బకాసురా! మీ అక్కయ్యని తోలుకుపో..”. “ఇదిగో ఏసియాడ్ చిహ్నమా...”

"ది బార్బేరియన్స్ అనీ...ద అగ్లియెస్ట్ అనీ అమెరికాలో రెండు పోటీలు జరుగుతాయి. మన సుందరి గారి ఫోటో పంపించామంటే...అక్కడి జడ్జీలు జడుసుకుని చస్తారు...ప్రైజ్ఇచ్చి తీరతారు" (బాబాయ్-అబ్బాయ్)

"మావయ్యా.." అని మగ గొంతుతోపిలిచే పెళ్ళికూతురు (అహ నా పెళ్ళంట)

"చంటబ్బాయ్" లో చెవిటి సాక్షి రంగారావు పాత్ర.

కళ్ళు చిదంబరం పాత్రను కోట తిట్టే తిట్లు (ప్రేమ ఎంత మధురం)

14. పేరడీ మరియు స్పూఫ్ హాస్యం

చెల్లెలికాపురం సినిమాలోని "చరణకింకిణులు ఘల్లుఘల్లుమన.." అనే పాటని పేరడీ చేసి "శుభాకాంక్షలు" సినిమాలో వాడుకోవడం ఒక మంచి ఉదాహరణ. అలానే "రాము" సినిమాలో సుత్తివేలు-శ్రీలక్ష్మి పాడుకునే పాటలో బోలెడు తెలుగుపాటల పేరడీ ఉంటుంది. ఈవీవీ సత్యనారాయణ గారి "జంబలకిడి పంబ" సినిమాలో ముత్యాల చెమ్మచెక్క ఇత్యాది పాటల పేరడీ, రంభ హో పాట పేరడీ తొట్టిగ్యాంగ్ సినిమాలో వాడుకున్నారు. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" అన్న పాటని ఒకతను చెంబట్టుకు వెళ్తూ పాడుతూ ఉండటం కూడా ఒక విధంగా ఇలాంటి కామెడీనే.

"శ్రీవారికి ప్రేమలేఖ", "ష్ గప్ చుప్!" లాంటి జంధ్యాల సినిమాల్లో ఇలాంటి హాస్యాన్ని పాటల్లో చూడొచ్చు.

15. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హాస్యం

వెనుకనుంచి నవ్వులు, కీచు గొంతులు కలిపి మనకు నవ్వు తెప్పించాలని అనుకోవడం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి బాగా పేరు తెచ్చిపెట్టిన "ఆనందోబ్రహ్మ"లో ఈ హాస్యం చాలా హుందాగా ఉంటుంది. ఈ మధ్య వచ్చిన టిక్ టాక్ వీడియోల్లో ఇలాంటి రోత, ఇరిటేటింగ్ నవ్వులు మనం గమనించొచ్చు.

జంధ్యాల గారి సినిమాల్లో హాస్యం పరాకాష్టకు చేరడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సహాయం చేసింది..ముఖ్యంగా జయమ్ము నిశ్చయమ్మురా లో "నాన్నా చిట్టీ..."కి రాజ్-కోటి గార్లు ఇచ్చిన సంగీతం.

16. దృశ్య సంబంధమైన కామెడీ (Silent Comedy)

దీన్ని నిశ్శబ్ద హాస్యం అని కూడా అనొచ్చు. ఈ రకపు హాస్యానికి బస్టర్ కీటన్, మిస్టర్ బీన్, లారెల్-హార్డీ ల చిత్రాలు ప్రధాన ఉదాహరణ. పాత్రలు మాట్లాడవు లేదా మాటలు అవసరం లేకుండానే, ముఖ కవళికలతోనే  హాస్యాన్ని పండిస్తాయి. హాస్యం అంతర్లీనంగా ఉండటమే కాకుండా కొన్ని కొన్ని సన్నివేశాలు ఇంత అద్భుతంగా ఎలా తీసారా అని అనిపిస్తుంది కూడాను వీటిని చూస్తుంటే.

"మాయాబజార్" లో అల్లు-వంగర-బాలకృష్ణల మధ్యన జరిగే గింబళి, గిల్పం హాస్యం లాగా. "పుష్పక విమానం"లో శవ దర్శనం చేసుకునేప్పుడు హీరో-హీరోయిన్లు ప్రేమించుకునే సీను, నీటుగా గిఫ్ట్ప్యాక్ చేసిన డబ్బా ని పారవేయడానికి వెళ్ళే సీనులో హాస్యం, పి ఎల్ నారాయణ-కమల్ మధ్యలో డబ్బుతో దర్పాల ప్రదర్శన లాంటివి దీనికి ఉదాహరణలు.

హనుమంతుడి గుండె నిండా రాముడొక్కడే ఉంటాడని, సీతమ్మవారికి చోటే లేదని...ఆవిడ బొమ్మని సహితం తీసేయించిన భార్యాబాధిత సంఘం ప్రెసిడెంటు (వివాహ భోజనంబు)

శుభలేఖ సుధాకర్ తన అన్నలతో మొదటిసారి పెళ్ళిచూపులకి వచ్చినప్పుడు, వాళ్ళ బరువుకి కారు టైర్ లో గాలి లేనట్లు చూపడం (అహ నా పెళ్ళంట)

చంటబ్బాయ్ లో విచిత్ర వేషధారణ వేసుకుని పట్టుబడ్డ ప్రతిసారీ పోలీస్ వ్యాన్ కి వేలాడదీసిన ఆనవాళ్ళు (పింక్ పాంథర్ సినిమా ప్రేరణ)

17. Spontaneous హాస్యం (ఆశువు)

"కపిల్ శర్మ షో" లో కనిపించే అప్రయత్నపూర్వక హాస్యం ఇలాంటిదే. దీనిలోని హాస్యం ముందే తయారు పెట్టుకున్నది కాకుండా పూర్తిగా అక్కడికక్కడే సహజసిద్ధంగా పుడుతుంది. అలానే స్టార్ మహిళ ఇత్యాది సుమక్క నిర్వహించే షోలు, జర్నలిస్టులు ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేప్పుడు దొరలే హాస్య సంభాషణలు, జబర్దస్త్ షో లో కొంతమంది టీమ్ లీడర్ల స్కిట్ లు ఈ కోవకే చెందుతాయి. సినిమాల్లో ఇలాంటి హాస్యం చూపించడం అరుదు.

18. డబుల్ మీనింగ్ డైలాగులు

దీన్నే నాన్-వెజ్ కామెడీ లేదా అడల్ట్ కామెడీ అని కూడా అనొచ్చు. అంతర్లీనంగా బూతు ధ్వనించే సంభాషణలు ఉంటాయి. ఒంటరిగా లేదా ఒకే వేవ్ లెన్త్ ఉన్న లైక్-మైండెడ్ స్నేహితులతో కలిసి మాత్రమే ఆస్వాదించదగిన హాస్యమిది: కుటుంబమంతా చూడతగ్గది కాదు. బిగ్ బాస్, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, సీతారత్నం గారబ్బాయి, చినరాయుడు లాంటి బోలెడు సినిమాలు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. గోదావరి జిల్లాల హాస్యం పేరుమీద ఈవీవీ సత్యనారాయణ సినిమాలు, కృష్ణభగవాన్ చాలా సినిమాల్లో పోషించిన పాత్రలు (కబడ్డీ కబడ్డీ, కితకితలు, జాన్ అప్పారావు, ఎవడి గోల వాడిది), కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల్లో వై.విజయ పాత్రకు వాడుకునే మాటలు, కృష్ణ గారి సినిమా "దొంగోడొచ్చాడు" కి రాధ పాత్రకి వ్రాసుకున్న డైలాగులు ఇలాంటి హాస్యానికి ఉదాహరణలు.

జంధ్యాల గారు దర్శకత్వం వహించిన సినిమాల్లో మచ్చుకి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇలాంటి అశ్లీల ద్వంద్వార్థాలు వినపడవు.

19. పాతపదాలకు కొత్త అర్థాలు కల్పించడం, లేదా క్రొత్త పదాలను వాడటం ద్వారా హాస్యం పుట్టించడం:

దీనిలో అప్పటిదాకా అమలులో ఉన్న పదాల అర్థాలను మార్చి వేరేగా అన్వయించి, అనువర్తించడం.

జంధ్యాల గారి సినిమాల్లో ఇలాంటివి కోకొల్లలు. "సుత్తి" అనే పదం "నాలుగు స్తంభాలాట" సినిమా తర్వాత బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. అలానే ఆయన అంతకుముందే ప్రయోగించిన "వద్దు బాబూ...! మేకులొద్దు... మేకుల డబ్బా దాచేయండి." అన్న "నెలవంక" సినిమాలోని డైలాగు కూడా పేలింది.

"ఆకాశ సీతమ్మ" (అహ నా పెళ్ళంట)

"తలంటు" (మొగుడూ-పెళ్ళాలూ!)

"ఎక్స్ పెక్ట్ చేశా…" (అహ నా పెళ్ళంట)

"పితా…" (రెండు రెళ్ళు ఆరు)

"నాకేంటి?" (అహ నా పెళ్ళంట) 

"మతా లంగేష్కర్" (హై హై నాయకా)

"టై; మెడ గోచీ" (ప్రేమా జిందాబాద్)

 20. అతిశయోక్త హాస్యం

సినిమాల్లో హాస్య సంభాషణలు వాస్తవానికి దగ్గరి పోలికతో ఉండాలి కాని వాస్తవం కాకూడదు: అతిశయోక్తి పాలు ఉండాల్సిందే. ఇక హాస్యం ద్వారా చెప్పబడిన విషయం ఆ పాత్రల అంతర్లీన ఉద్వేగాలను ప్రస్పుటంగా తెలియజేసేదిగా ఉండి గాఢంగా ప్రేక్షకుల మనస్సులో ముద్ర వేయాలి. జంధ్యాల గారి సినిమాల్లో చాలా సంభాషణలు అతిశయోక్తిగానే ఉంటాయి...ఒక ప్రక్క బోలెడంత హాస్యాన్ని పంచుతూనే.

"మా అన్నయ్య ఆస్తంతా మా పేర్న వ్రాసేసి ఏ కారు ప్రమాదంలోనయినా గుటుక్కుమనేలా దీవించు స్వామీ..." అని దేవుడికి దణ్ణం పెట్టుకునే ఓ చెల్లెలు (ఇలా ఎవరూ దణ్ణం పెట్టుకోరు సరికదా…! ఒకవేళ పెట్టుకున్నా ఇలాంటి భాష మాత్రం వాడరు.) , "మనబ్బాయి గోపీయా...వాడు...'నాన్నా నాక్కొంచెం తలనొప్పిగా ఉందీ...ఇప్పుడే రైలింజన్ కింద తలపెట్టొస్తా'నని వెళ్ళాడు" (బావా బావా పన్నీరు)

"అదుగో....అటూ ఇటూ చూసి ఎవరూ లేకపోతే ఏ సోఫానో ఏ బీరువానో చంకన పెట్టుకుని పోవడానికి వచ్చావా?" (అమరజీవి)

 21. పంచ్ డైలాగుల హాస్యం

చాటు పదముల లాంటివి.

"మందమతికి పనెక్కువ, లోభికి ఖర్చెక్కువ, బోణీ బేరానికి ధర్మమెక్కువ."

"నిజం తన ఒంటికాలుతో రెండడుగులు వేసే లోగా అబద్ధం మూడు నోళ్ళ ఆసరాతో  నాలుగు మైళ్ళు ప్రయాణిస్తుంది."  

"ఓ మనిషీ...! యుద్ధాన్ని నువ్వు అంతం చేయి. లేకుంటే అది నిన్నంతం చేస్తుంది."

"మా ఆవిడతో నేను మాట్లాడి అయిదేళ్ళయ్యింది; ఆవిడకి అడ్డురావడమెందుకు..?"

"నీ పిండం పిచ్చుకలకు పెట్టా", "వాష్ బేసిన్లో చేపలు పట్టే మొహం" ఇత్యాది బోలెడు తిట్లు జంధ్యాల గారి చాలా సినిమాల్లో ఉంటాయి. ఈ తిట్లన్నింటికీ పరాకాష్టగా రావు గోపాల రావు సినిమాలో పి. ఎల్. నారాయణ కోసం "ఛీ... నిన్ను తిడితే ఊపిరి దండగరా....! ఫో... అవతలకి ఫో!" అని వ్రాసారు జంధ్యాల గారు. 

22. కన్ఫ్యూషన్ కామెడీ (తికమక-మకతిక)

ఒకరి పాత్రలోకి ఇంకొకరు పరకాయ ప్రవేశం చేయడం వల్లనో, ఒకరి బదులుగా వేరే వాళ్లనుకుని పొరబడడం వల్ల ఏర్పడే హాస్యం. అద్దె తలిదండ్రులుగానూ, భార్యలు, భర్తలు, అన్నలుగా నటించేందుకు కుదుర్చుకున్న నాటకాల పరిషత్తులో ప్రయిజులు కొట్టిన ఉద్దండులు. పురిటి మంచంలోనే తారుమారు కాబడిన కవలపిల్లల కథలు, లేదా ఒకే పోలికలతో ఉన్నవారి కథలయిన హలో బ్రదర్, సొమ్మొకడిది సోకొకడిది, ఇద్దరు మిత్రులు, రౌడీ అల్లుడు, చుట్టాలున్నారు జాగ్రత్త, రాముడు-భీముడు, యముడికి మొగుడు ఇత్యాది సినిమాల్లో ఒకరి మారుగా మరొకరు చేరి పండించే హాస్యం. చిత్రం భళారే విచిత్రం, బృందావనం, చిలక్కొట్టుడు లాంటి సినిమాల్లో అద్దె నటుల భాగోతం.

"రాగలీల" చిత్రంలో హీరో అన్నయ్యలా నటించడానికోసం మల్లికార్జునరావు, ధమ్, సత్తిబాబు పోటీపడి పండించిన హాస్యం.

"రెండు రెళ్ళు ఆరు" సినిమా నేపథ్యమే అలాంటి కన్ఫ్యూషన్ కామెడీ. దాన్లో ఒక పాత్ర పేరు తికమక కూడాను.

"ప్రేమకు వేళాయెరా" గౌతమ్ రాజ్-జేడీ, "బాబాయ్-అబ్బాయ్" లాంటి సినిమాల్లో హోటల్ లో సుష్టుగా తిని బిల్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి కథలు చెప్పి, ఎదుటివారిని కన్ఫ్యూజ్ చేసే సన్నివేశాలు

23. అసంబద్ధమైన హాస్యం (Farcical)  

ఇది చర్య-ప్రతిచర్యల అతిశయోక్తితో నిండి ఉంటుంది. ఇది విపరీత, అసంబద్ధమైన మరియు అసంభవమైన పరిస్థితులను సృష్టించడం ద్వారా ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తుంది.

"చిత్రం భళారే విచిత్రం" సినిమాలో బ్రహ్మానందంసాయిబాబా ఫోటో ఎక్కడ కనిపిస్తే అక్కడ దణ్ణం పెట్టుకోవడం, పూనకం వచ్చినట్లు ఎగరడం దీనికి ఉదాహరణ.

"అహ నా పెళ్ళంట" సినిమాలో పేపరు లుంగీ హాస్యం, తిండిపోతుల హాస్యం, కోట-బ్రహ్మానందాలు టీ అమ్ముకోడానికి వెళ్ళినప్పుడు గుడ్డివాడుగా వ్యవహారం మార్చి చేసే హాస్యం ఇవన్నీ ఇదే కోవకు వస్తాయి. జంధ్యాల గారి చాలా సినిమాలులేదా అన్ని సినిమాల లోని హాస్య సన్నివేశాలు ఇదే కోవకు చెందుతాయి. స్లాప్ స్టిక్ కామెడీ లాగా ఇది కూడా పరిహాసాస్పదమై ఉంటుంది కానీ ఒక పాత్ర ఇంకొక పాత్రని భౌతికంగా బాధించదు.

“నాకు చెట్టంత కొడుకున్నాడని కొందరు మాటవరసకంటారు. నా విషయంలో అది అక్షరాలా నిజమైందిరా భీమసేనా! కొద్దిగా కూర మిగిలింది...చూసినట్టు లేవు. ఊదేయ్...నాయనా ఊదేయ్! (పడమటి సంధ్యారాగం)

24. అవినాభావ (అలవాట్లో పొరపాటు) హాస్యం

ఒక ఫీల్డులో మంచి చేయితిరిగిన లక్షణం ఉన్న వ్యక్తి అలవాటులో పొరపాటుగా వేరే ఫీల్డుకి కూడా దాన్ని అన్వయించడం. తెలుగు సినిమాల్లో ఇది చాలా తరచుగా ఉపయోగిస్తారు. "చంద్రలేఖ" సినిమాలో బ్రహ్మాజీ పండ్ల రసాల గురించి చెప్పడం, జైలు నుంచి విడుదలై వచ్చిన గిరిబాబు "దొంగోడొచ్చాడు" లో పండించే హాస్యం.

"కళావర్ ఎనిమిది లాగా నల్లగా గుమ్మటంలా ఉండేవాడు...లైఫ్ మిడిల్ డ్రాపు చేసి అర్థాంతరంగా పైకెళ్లిపోయాడు. ఆయన భార్య ఇస్పెట్ రాణీ లాగా కళకళలాడుతుండేది. ఆవిడా కౌంటయిపోయిందనుకో." (చంటబ్బాయ్)

"ఏవిటోపదమూడూ జోకర్లే పడ్డాటంత విచిత్రంగా ఉందిరా ఈ పిల్ల.."-నూతన్ ప్రసాద్ (శ్రీవారికి ప్రేమలేఖ)

25. పాత్రలు డైరెక్టుగా ప్రేక్షకులతో మాట్లాడటం

కథలోనుంచి బయటికొచ్చి ప్రేక్షకులకి ఏదో చెప్పడం

"ఇకనుంచి మా మామనొక తమాషా అయిన ఆట పట్టిస్తాను, ఈలోగా మీరు కాస్త కాఫీలవి తాగిరండి చెప్తాను...వెళ్ళిరండి."-రాజేంద్రప్రసాద్ (అహ నా పెళ్ళంట ఇంటర్వెల్ కార్డు.)

"నమస్కారం...మీక్కాస్త ఆలస్యంగా కనిపిస్తున్నాను. ఏమీ అనుకోకండి." అ.భా.పీ.సం అధ్యక్షుడు సుత్తివేలు (అహ నా పెళ్ళంట.)

26. కోతల హాస్యం

"మా ఇంటి నూక మీ ఇంటి న్యూడిల్స్ కన్నా పొడుగు."

మాటలు కోటలు దాటుతాయిజబర్దస్త్ షో లో గుంటూరు బాబాయ్ హాస్యం లాంటిది.

"చంటబ్బాయ్" లో చిరంజీవి పాత్ర ఇలాంటిదే....ప్రేయసి ముందు బోలెడు హెచ్చులు పోతూ ఉంటుంది.

27. కుళ్ళు జోకులు

జంధ్యాల గారి సినిమాల్లో చాలావరకు హాస్యం సరిహద్దు దాకా వస్తుంది. కొండొకచో అది దాటినట్లు కూడా భావరూపేణా అనిపిస్తుంది కానీ...ఎందుకో మరి అతన్ని ఏమీ అనబుద్ధికాదు.

"పుత్తడిబొమ్మ" సినిమాలో వీరభద్రరావు, అతన్ని ప్రేత కవితలతో హడలెత్తించే నరసింగరావు పాత్రలు చాలావరకు కుళ్ళుజోకుల కవిత్వమే చెప్తుంది. గజారోహణం జరిగేప్పుడు, సన్మానసభలో మామిడాకుల దండ, తద్దినం మంత్రాలు చదవడం, స్టేజి పైకి తోసుకెళ్ళడం, హారతిపళ్ళెంలో దీపావళి పాము బిళ్ళలు వెలిగించడం లాంటి చేష్టలు ఈ కోవకు చెందినవే. (వీటినే ఈవీవీ గారు "మా అల్లుడు వెరీగుడ్డు" అనే సినిమాలో ఇంకా విస్తృతంగా హాస్యీకరించి బ్రహ్మానందం-ఎల్బీ శ్రీరామ్ ల చేత చేయించారు.) అలానే “బాబాయ్ హోటల్” సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పే కవితలు కూడా చచ్చువే.

28. ఇంటలెక్చువల్ హాస్యం

"ఈ సోమవారం నుంచి సెక్యూరిటీ ప్రాబ్లెమ్స్ వల్ల ఆఫీసుకి మోటార్ సైకిళ్ళు తేకూడదట. ఏడ్చినట్లే ఉంది....అటు ధిమాఖ్ తీసుకెళ్లకా, ఇటు మోటార్ సైకిళ్ళు తీసుకెళ్లకా పని ఎట్లా అవుతుంది?"

"కళ్ళకి రెప్పలు పెట్టినట్లు, చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు." (జయమ్ము నిశ్చయమ్మురా)

"నీ నిద్రతో సగం దరిద్రం అంటుకుంది నా గల్లాపెట్టెకి" (రాగలీల)

“మంత్రాలు నేర్చుకుని మంగలి షాపు పెట్టుకున్నట్లు”(బాబాయ్ హోటల్)

“నన్ను మోసం చేయటానికి పుట్టబోయేవాడి తల్లికింకా పెళ్ళేకాలేదురా ఎనుబోతు వెధవా...!”(బాబాయ్ హోటల్)

29. పరిహాస హాస్యం (Mockery)

అంతకుముందు సినిమాల్లోని థీమ్ ని కానీ పాత్రలని కానీ వేరేగా మార్చి చెప్పడం....ముందు చెప్పినదానికి వ్యతిరేకంగా. దీనిని ఎంజాయ్ చేయాలంటే ముందు చెప్పిన పాత్రల గురించిన అవగాహన ఉండటం తప్పనిసరి. 

వీడు శంకరాభరణం లాంటివాడండీ (పేరుకి శంకరుడికి చెందినదే అయినా...పాము లాంటివాడని అర్థం.)

నువ్వెవడిరా బాబూ....? భరతుడిలాగా...! అడవుల పాలైన శ్రీరాముడి చెప్పులు కూడా ఎత్తుకెళ్ళే రకం. 

వివాహ భోజనంబు సినిమాలో హనుమంతుడి గెటప్ లో ఉన్న భీమరాజు పాత్రతో రాజేంద్రప్రసాద్ చమత్కార భాషణలు. 

30. కక్కుర్తి (ద్రాపి) హాస్యం

ఢిల్లీ రోడ్ల మీద రిలయన్స్ బిల్డింగ్ ముందునుంచి ఇద్దరు టీచర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. అందులో ఒక టీచర్-"నేనే గనుక రిలయన్స్ అధిపతిని అయ్యుంటేముఖేష్ అంబానీ కన్నా ఎక్కువ సంపాదించేవాడిని. ఏం చేస్తాంప్రాప్తం లేదు."

రెండవ టీచర్:- "అదెలారా…? ఆయనకి తెలియని వ్యాపార రహస్యాలు ప్రత్యేకంగా నీకేం తెలుసు? మరీ బడాయి కాకపోతే…"

మొదటి టీచర్:- "అందుగ్గాదూ నీ డిప్పలో గుజ్జు లేదనేదీసాయంత్రం పిల్లలకి ట్యూషన్ తీస్కోవడం మానేస్తానా ఏంటి?"

"ఆనందం" సినిమాలో ఎక్కడ ఖర్చుపెట్టవలసి వస్తుందోనని, కావాలని, పర్సు మర్చిపోయే శివారెడ్డి పాత్ర, "అత్తిలి సత్తిబాబు LKG" సినిమాలో అల్లరి నరేష్ చేసే ప్రవర్తన ఇలాంటి హాస్యానికి ఉదాహరణలు.

"అహ నా పెళ్ళంట", "బావా బావా పన్నీరు" సినిమాల్లో పీనాసి కోట పాత్రకు, గొడ్డుకి కూడా పెట్టకుండా అడ్డమైన గడ్డీ తినే కోట పాత్ర బాబాయ్ హోటల్ కోసం వ్రాసిన మాటలు పూర్తిగా ఇవే.

అన్నట్లు...ఈ ద్రాపి (కక్కుర్తి గలవాఁడని అర్థం) అన్న పదాన్ని ఆయన చాలా సినిమాల్లో వినియోగించారు. జంధ్యాల గారు తన చిత్రాల్లో దేనికైనా నోరు తెరుచుకుని సిద్ధమవగల శుద్ధద్రాపులను ఎంతో మందిని సృష్టించారు; ఆ పాత్రలకు తగ్గ పనివాళ్ళను కూడా.

31. జుగుప్సాకర హాస్యం

"జంబలకిడి పంబ" సినిమాలో ఆడవాళ్ళకు రావలసిన నొప్పులు మగోళ్ళకు రావడం, పెళ్లిచూపుల ప్రహసనాలు, బ్రహ్మానందం తెల్ల తుండు తలకు కప్పుకోవడం, చిన్నపిల్లల చేత పెద్ద మాటలు, బూతులు పలికించడం కూడా జుగుప్స కలిగిస్తుంది. (మొగుడూ-పెళ్ళాలూ! అన్న సినిమాలో జంధ్యాల గారు ఇదే రకమయిన ప్రహసనాలను 2085 సంవత్సరంలో జరిగినట్లు ఎంతో హుందాగా చిత్రీకరించారు. అక్కడ పెళ్లికూతురుగా వచ్చిన అమ్మాయి ("మహీజ" అనుకుంటాను)ఆవిడ అందం కానీ సున్నితాభినయం కానీ చూడాల్సిందే.) అలానే హోమోస్ / గేస్ మరియు ట్రాన్స్ జెండర్ ల గురించి చాలా తెలుగు సినిమాల్లో వచ్చిన హాస్య ప్రస్తావనలు కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి.

"విస్తరి నిండావడ్డించి, చివర్లో ఇంతఇంత అశుద్ధం వేస్తారు మీరు." (మొగుడూ-పెళ్ళాలూ…!)

"అశుద్ధ భక్షకా…!" లాంటి తిట్లు (అహ నా పెళ్ళంట

రాగలీల సినిమాలో మన్మధుడు వేసిన బాణం ప్రభావం వల్ల ఒకేచోట వున్న సంబంధంలేని ఆడ-మగలు పూనకం వచ్చినట్లు ఒకరినొకరు వాటేసుకోవడం. (బ్రహ్మానందం అయితే మరీ చిన్న పిల్ల వెంటపడటం.)

32. సామెతల హాస్యం

"మొండిదానా మొండిదానా నీ మొగుడేం చేసాడే అంటే...అటుకొట్టి ఇటుకొట్టి వాడే పోయాడు" అందిట. "సంతానం కోసమని సప్త సముద్రాల్లోనూ స్నానం చేస్తే...ఉప్పు నీరు తగిలి ఉన్నది కాస్తా ఊడిపోయిందిటయ్యా...." కొంటె కాపురం సినిమాలో వీరభద్రరావు-వేలు మధ్యన ఇటువంటి సామెతలు చాలా ఉంటాయి. (అందులో చాలా అశ్లీలంగా కూడా ఉంటాయి.)

"అన్న మదం అన్ని మదాలకు మూలం." (ప్రేమ ఎంత మధురం)

33. శ్లేష లేదా యమక-చమక అలంకార హాస్యం 

"పరీక్షిత్తును నేనీరోజు పరీక్షిత్తును."

"అనిరుధ్దూ... కొంచెం అని రుద్దూ..." పలక మీద అక్షరాలు వ్రాయించేప్పుడు పంతులు గారు అనిరుధ్ తో పలికే మాటలు 

"టిఫిన్ లో అట్లు మాత్రమే ఉన్నాయా....సరే అట్లే కానీయ్." (శ్రీశ్రీ)

"చెప్పుకొనలేని స్థితిలో ఉన్నాను." (శ్రీశ్రీ)

"నాటిక వ్రాయమంటావా...సరే ఏ నాటికయినా వ్రాస్తాను." (శ్రీశ్రీ)

"ఊరికే వెళ్తున్నాను." (శ్రీశ్రీ)

"ఆ-రుద్ర భూములన్నియూ ఆరుద్రవే..."

"పురాణాల మీద కామెంట్లు చేస్తే ప్రాణాల మీద ఆశ ఒదులుకున్నట్లే.."

"పోలేరమ్మ..మీ వారు ఎక్కడికీ పోలేరమ్మ." 

"అరేయ్ కోటీ..! ఇంకో టీ......"

"నిత్యాగ్ని హోత్రం" అన్న మాటకి చైన్ స్మోకర్ (సరిగమలు), ఎప్పుడూ కడుపు ఆకలి తీర్చుకోవడానికి చూస్తూనే ఉంటుంది అన్న అర్థంలోనూ వాడొచ్చు. 

"ఇక్కడ కడితే మొలత్రాడు, నాను తాడు, కాశీ తాడు, ఉరితాడు, పడతాడు- "అతడు" సినిమాలో బ్రహ్మానందం-త్రిషల మధ్య చతుర సంభాషణ.

“మన రెస్టారెంటు అందరికీ ఇస్టారెంటుగా ఉండాలి.”- (బాబాయ్ హోటల్)

"ఆ వంకతో నయినా నీ వంక కాసేపు చూస్తూ ఉండొచ్చని" (అమరజీవి)

34. నర్మగర్భహాస్యం

"ఆడు బో దేవాంతకుడండీ! హోమియోపతి మాత్ర రుచి చూసి ఏ రోగానిదో చెప్పగల సమర్ధుడు...."

“మీరు అచ్చం హీరోలా కన్పిస్తున్నారు సార్...”, “నేనంత ఎధవలా కన్పిస్తున్నానా?” (మైఖేల్ మదన కామరాజు)  

"అయ్యగారికి సదువంటే ప్రాణం. ఒక్కోసారి వారం, పదిహేను రోజులు తిండీ, నీళ్ళు మానేసి...ఆ గదిలో కూర్చుని ఒకటే సదువు...సదువు... సదువు... సదువేనండీ. పట్టపగలు కూడా లైట్లేసే ఉంటయ్యండీ. సదువుంటే సాలు మరేం అక్కర్లేదండీ ఆయనకీ..." తన యజమాని స్త్రీ లోలత్వాన్ని పుస్తకార్చనతో నర్మగర్భంగా పోల్చి చెప్పే సుత్తివేలు (రాగలీల)

35. మత సంబంధ యాసల హాస్యం 

"నా చెప్పు ముక్కలు మీ చెవిన పెట్టుకొనుడు." 

క్రిష్టియన్ పాత్రలు మన సినిమాల్లో తెలుగు మాట్లాడితే బహు గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళకు వ్రాసుకునే మాటలు ఒక ప్రత్యేకమైన సింటాక్స్ తో కూడి ఉంటాయి. ముఖ్యంగా చర్చి ఫాదర్ లకు వ్రాసుకునేవి..."పోలీస్ రిపోర్ట్" చిత్రంలో విజయ్ చందర్ వాడే "ద్వారము తెరిచియే ఉన్నది." "తెలివి గల మాటలకు చెవి యొగ్గుము.", "నీతిమంతుల తలమీదకి ఆశీర్వాదములొచ్చునని చెప్పబడి యున్నది." అన్న వాక్యాలు ఉదాహరణలు.  

ముస్లిం పాత్రలకి వ్రాసుకునే డైలాగులు కూడా చాలా కృతకంగా హాస్యాన్ని కురిపిస్తాయి. "క్యా హోనా సాబ్?" "కైకూ ..." "అరే భాయ్...నీకి ఇవ్వటమే నాకి ఖుషీ"(నిప్పులాంటి మనిషి) “నాకీ” “నీకీ” “మాకీ” “మీకీ” లాంటి పదాలు, ఎక్కడయినా “ఎ” అని వస్తే దాన్ని “హె” అని పలికించడం "ఎక్కడ" అనకుండా "హెక్కడ" అనడం, "దేనికి" (ఏమిటికి) అనడానికి "హేమిటికి" అనడం ఇత్యాది.   

36. గొలుసుకట్టు హాస్యం 

మొదటివాడు:- "ఏమండీ ఇక్కడ అప్పారావు గారిల్లెక్కడా?"

రెండవవాడు:- "ఏ అప్పారావు గారండీ...?"

మొదటివాడు:- "ఎ.అప్పారావు గారండీ..."

రెండవవాడు:-"అదేనండీ... మీకు కావలసింది ఏ అప్పారావూ అంట?"

మొదటివాడు:-"ఎ.అప్పారావు గారండీ..." ఇలా ఉంటుంది హాస్యం. బ్రహ్మానందం-పొట్టి ప్రసాద్ ల మధ్య అప్పుల అప్పారావు చిత్రంలో. 

"నీ ఊరేంటి? - మల్లడుగు" అనగనగా ఒకరోజు సినిమాలో జేడీ చక్రవర్తి- బ్రహ్మానందంల హాస్యం  

అలానే బ్రహ్మానందం, ఏ.వీ.ఎస్., కోట గార్ల మధ్యన అప్పు గురించి ఆయనకిద్దరు సినిమాలో వచ్చే సన్నివేశాలు ఇలాంటివే. 

బ్రహ్మానందం-ఐరన్ లెగ్ శాస్త్రి మధ్యన వచ్చే సన్నివేశాలు, ధర్మచక్రం సినిమాలో బ్రహ్మానందం-ఏ.వీ.ఎస్. బస్సులో హాస్యం

వీరభద్రరావు-బ్రహ్మానందం మధ్యన వచ్చే విజయవాడలోని వీధులు, హోటల్ లో దొరికే రకరకాల పదార్ధాలను మెనూ గా చెప్పే సన్నివేశాలు (వివాహ భోజనంబు)

"అతడే ఒక సైన్యం" లో సునీల్-ఎమ్మెస్ "నువ్వెవరు?" హాస్యం

“నీవల్ల దేశానికి ఏమిరా ఉపయోగం...? బాలరాజూ...!ధర్మవరపు సుబ్రహ్మణ్యం-, కాకపోతే ఇక్కడ రెండండి అని చెప్పడం, కాదంబరి కిరణ్ (అమ్మ-నాన్న-ఓ తమిళమ్మాయి)

“నల్ల ఆవు- తెల్ల ఆవు” హాస్యం 

37. ఉపమానాల హాస్యం 

"మా అయ్యగారు బోరింగ్ పంపు వంటి వారు. ముందు కొంచెం నీళ్ళు పోస్తేనే నీటిధార రాదుగదండీ...మా అయ్యగారిదీ అదే పధ్ధతి. చేతిలో కొంచెం బరువు పెడితే గానీ మాట్లాడరు..."ఈ చుట్టుపక్కల నాలుగు జిల్లాల వాళ్ళెవ్వరూ ఈ గుమ్మం తొక్కరు" అన్జెప్పి కోట "నాకేంటి?" గురించి బ్రహ్మానందం చెప్పే పరిచయవాక్యాలు (అహ నా పెళ్ళంట) 

38. వ్యతిరేక భావ హాస్యం 

గొప్పోడివి మరి...

భలేవోడివే ...

భలే కొత్త విషయం చెప్పావే...

39. భాషామార్పు మూలాన పేస్ వేల్యూ హాస్యం 

"పోరారేయ్ ముండా" మౌనరాగం లో రేవతి హాస్యం.

సంసారం ఒక చదరంగం సినిమాలో గొల్లపూడి కొడుకు-హిందీ పిల్ల మధ్యన జరిగే హాస్యం 

రెండు రెళ్ళు ఆరు సినిమాలో రాళ్ళపల్లిఆహా నా పెళ్ళంట సినిమాలో సాల్టుకి సాంబారుకి మధ్యన నలిగే రాళ్ళపల్లి 

40. వ్యతిరేక పద హాస్యం

"అన్నమాట లేదూ...తమ్ముడు మాట లేదు." 

"తెలుసా మీకూ....అసలివాళ చచ్చిపోయేవాణ్ణండీ... నేను...చచ్చిపోయేవాణ్ని..."

"ఆ...మాకంత అదృష్టం కూడానూ."

"నాకు మగ పోలీసులంటేనే మహా భయ్యం....ఇక ఆడ పోలీసు వద్దూ, ఈడ పోలీసూ వద్దు గానీ...." (రావు గోపాలరావు)

“ఇదిగో మొదటిసారిగా చివరిసారి చెప్తున్నాను.” (సీతారామ కళ్యాణం) 

41. పాత్రలకు అర్థం కాకుండా ప్రేక్షకులను నవ్వించే హాస్యం 

ఇది సహజంగా పరాయి భాషకు చెందిన పాత్రలతో తెలుగులో మాట్లాడేప్పుడు కురిపిస్తారు. "సంసారం ఒక చదరంగం"

"బుజ్జమ్మా ...ఇదిగో మంచినీళ్ళు...పంది తాగినట్లు తాగు." తెలుగు రాని హీరోయిన్ తో నవ్వుతూ విసిగిపోయిన హీరో మాట్లాడే మాటలు.

అలానే సునీల్ "చెప్పవే చిరుగాలి" చిత్రంలో  హీరోయిన్ కి చెవుడనుకుని ఆవిడ ముందు చేసే చేష్టలు. 

42. పదాల్లోని అక్షరాలు మార్చి కురిపించే హాస్యం 

తల్పం-గిల్పం, కంబళి-గింబళి (మాయాబజార్)

మగానుభావుడు (పోలీస్ రిపోర్ట్)

43. పరాయి భాషా పదాల హాస్యం

తెలుగులో పలికితే విచిత్రంగా ఉండే పరాయి భాషా పదాలు 

డోంగ్రే, గూట్లే, పూమ్ పుహార్, ఎంద చేట, కిస్కా-మిస్కా, డకోటా లాంటివి.

44. పురాణ పాత్రల / పేరెన్నికగన్న పాత్రల మీద హాస్యం (Allusion)

"అల్లా ఉద్దీన్... ఇటొచ్చి ఈ దీపం వెలిగించు నాయనా."

"వసుదేవుడూ... కొంచెం అయ్యగారి కాళ్ళంట పట్టు." 

"కృష్ణా...అయ్యా కొంచెం చెట్టెక్కి చీరలు ఆరేసిరా నాయనా ..."

"అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ కన్నా గట్టివాడు.... జేమ్స్ బాండ్." 

45. విదేశీయులు లేదా పరభాషీయులు తెలుగు మాట్లాడితే పుట్టే హాస్యం 

"బొంబాయి ప్రియుడు" సినిమాలో అమెరికన్ రిటర్న్స్ గా బాబూ మోహన్, శివాజీరాజా హాస్యం. "అల్లూరి సీతారామరాజు", లాంటి స్వాతంత్య్ర పోరాట సినిమాల్లో జగ్గయ్య, తదితర ఆంగ్లేయుల మాటలు, అదే సినిమాలో చలం తమిళ-తెలుగు హాస్యం. "సర్దార్ పాపారాయుడు" లో మోహన్ బాబు మాటలు, దుబాయ్ శీను సినిమాలో సునీల్ మాట్లాడే గల్ఫ్ షేక్ యాస. హలో బ్రదర్ తదితర సినిమాల్లో మార్వాడీ పాత్రలు పలికే తెలుగు మాటలు

46. నత్తి వాళ్ళు పలికే మాటల హాస్యం 

"అహ నా పెళ్ళంట" సినిమాలో బ్రహ్మానందం. 

47. నోరు తిరగని హాస్యం 

"హ" ఉన్న చోటల్లా "గ" పలికే రాళ్ళపల్లిమహానుభావుడు-మగానుభావుడు (పోలీస్ రిపోర్ట్)

"ర" ఉన్న చోటల్లా "ల" పలికే రాధ"బ్లేకులో మీలే మహాలాజు" (లంకేశ్వరుడు)

"ర" ఉన్న చోటల్లా "ల", “స” “ట” ల బదులుగా “త” పలికే నిట్టల “నమత్తే తార్...ఏంటీ బ్యాడ్ త్మెల్లు?” “బొక్కలో తోతి మక్కెలిరగ తంతాను.” “నన్ను లా అంటావా..? పల్లు లాలిపోతాయ్..”(అల్లా ఉద్దీన్-అద్భుత దీపం)

"నానా" అని పలికే చోట "ణాణా" అని వత్తి పలికే పాత్ర ()

“అదే లిటిక్యులేషను” అల్లు వారి ఉవాచ (కలియుగ రావణాసురుడు)

48. ఒకదాని బదులు మరొక మాట 

"ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్ళాం" చిత్రంలో వై. విజయ,  "పెళ్ళి" చిత్రంలో జయలలిత పాత్రలు వెతికి మరీ తెలుగులో ఉన్న బూతు పదాల జోలికి వెళ్ళి భాషను బహు ఖూనీ చేస్తాయి. 

49. ఊత పదాల హాస్యం 

“రంగు పడుద్ది” (ఘటోత్కచుడు)“రఫ్ఫాడిస్తా” (గ్యాంగ్ లీడర్), “బాబులు గాడి దెబ్బంటే... గోల్కొండ అబ్బా అనాలి” (దొంగ రాముడు), “సుర్రు సుమ్మయి పోద్ధి” (ఘరానా బుల్లోడు), “అర్థం చేసుకోరూ...!” (స్వర్ణ కమలం), “అట్ట సూడమాకయ్యా” (స్వయంకృషి), “ఏందీ... నా ఆసులోది” (మీ ఇంటికొస్తే ఏమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు)“బాక్సు బద్దలై పోవాలి” (రౌడీ అల్లుడు), “పీకానంటే దెబ్బ...పైనా కిందా అబ్బ” (కిరాయి దాదా)“అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది!” (పట్నం వచ్చిన పతివ్రతలు), “నూటొక్క జిల్లాల అందగాణ్ణి” (చలి చీమలు)“ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో...” (ఘరానా మొగుడు)“అంతొద్దు..ఇది చాలు..” (హిట్లర్), “సభకు నమస్కారం” (తోకలేనిపిట్ట)“నాన్నా చిట్టీ!” (జయమ్ము నిశ్చయంబురా) లాంటివి తెలుగు సినిమాల్లో చాలా పుట్టించారు. 

"మా పద్ధతులు, మా లెక్కలు మాకుంటయ్ సార్...." కోట (విచిత్రం)

50. కొత్త పాత్ర స్వభావాల ద్వారా పుట్టే హాస్యం

జంధ్యాల గారు తన సినిమాల ద్వారా వందకు పైగా హాస్య పాత్రలను సృష్టించారు. ఆ ఘనతను మరే దర్శకుడూ అందుకోలేడన్నది నిర్వివాదాంశం. ఆయన సినిమాలో నటించడానికి పెద్ద ప్రిపరేషన్ అవసరం లేదు. మామూలు పాత్రలే కొంచెం వైవిధ్యంగా బిహేవ్ చేస్తాయి అంతే. కామెడీ పాత్రలను గమ్మత్తైన మెలికలతో పాత్రలను సృష్టిస్తారాయన. ఈయన చిత్రాల్లో బోలెడు మేనరిజమ్స్ ఉంటాయి. దాదాపు అన్ని పాత్రలకీ ఊతపదాలుంటాయి.

అటు తిప్పి, ఇటు తిప్పి ప్రతివారికీ ఆటో బయోగ్రఫీ చెప్పే నూతన్ ప్రసాద్, తిన్న ఉప్పుకి ద్రోహం చేయలేని రాళ్ళపల్లి, రెండు ఏనుగుల మధ్య పీనుగ గా మారిన శుభలేఖ సుధాకర్(అహ నా పెళ్ళంట)

సంతోషమొచ్చినా విషాదమొచ్చినా ఈల వేసే శ్రీలక్ష్మి (ఆనంద భైరవి)  

సుత్తి, రివర్స్ సుత్తి (నాలుగు స్తంభాలాట)

కొత్త కొత్త వంటకాలను సృష్టించే శ్రీమతి, అవి తినలేక సతమతమయ్యే భర్త, కనిపించినవారందరికీ సినిమా టైటిల్స్ నించీ చెప్పి విసిగించే ఇల్లాలు (శ్రీవారికి ప్రేమలేఖ)

విషయం అంతరాంతరాలలోకి వెళ్ళి మరీ స్పష్టత కోసం ప్రశ్నలు గుప్పించే కాదంబరి కిరణ్ కుమార్ పాత్ర (బావా బావా పన్నీరు)

సంగీతం నేర్చుకునే ఇల్లాలు; శ్రీలక్ష్మి, ఆవిడ బాధ పడలేక చొక్కా చించుకునే భర్త వీరభద్రరావు, అన్నం పెట్టిన చేతిమీద కృతజ్ఞత గలిగి దాని గురించి టాంటాం వేసే ముష్టివాడు భీమేశ్వరరావు, అన్ని భాషల్లోనూ మాట్లాడే మిలట్రీ వంటవాడు రాళ్ళపల్లి, చెవిటి పుచ్చా పూర్ణానందం, "పితా" పొట్టిప్రసాద్, మాట్లాడేది తెలుగైనా ఎవరికీ అర్థంకాకుండా మాట్లాడే సాక్షి రంగారావు (రెండు రెళ్ళు ఆరు)

ఆసనాలు వేయించి మరీ కథలు చెప్పించుకునే శ్రోత వీరభద్రరావు, రికార్డుల కోసం చీరలో శీర్షాసనం వేయడానికైనా తెగించే రమాప్రభ (వివాహ భోజనంబు)

అచ్చమైన గ్రాంథికంలో మాట్లాడే కోట, ఎంత దూరమైనా నడుస్తూ...సుత్తి కొట్టే వీరభద్రరావు, కప్పపొట్ట-కుక్కచూపు దంపతులు, తమ కూతురు పొరపాటున ఎవర్నీ ప్రేమించకూడదని  అనుక్షణం మారువేషాలు వేసుకుని మరీ పరీక్షించే నూతన్ ప్రసాద్ దంపతులు (చూపులు కలిసిన శుభవేళ)

ఎవడైనా మర్డర్ చేసినా "మా ఊరు బందరంటే" చాలు వదిలేసే ఎస్సై కోట, వయసు పెరిగినా చిన్నపిల్లాడిలా ప్రతి చిన్నదానికీ అలిగి చెట్టెక్కి కూచునే వేలు (ష్...గప్ చుప్.)

ఇరవై నిండకుండానే నూరేళ్ళు నిండిన కొడుకుని గుర్తుచేసిన వాళ్ళందరినీ "బాబూ...చిట్టీ...!" అని కౌగిలించుకునే శ్రీలక్ష్మి, అప్పులకోసం ఆర్నెల్లు ఉత్తరభారతం లోనూ ఆర్నెల్లు దక్షిణభారతం లోనూ తిరుగుతుండే సత్యనారాయణ, ఆఖరికి యజమాని మాటకి ఎడ్డెమంటే తెడ్డెమనే కుక్క పాత్ర (జయమ్ము నిశ్చయమ్మురా..)

ఇంకో పదహారేళ్లలో వంద కొట్టే వృద్దాప్యంలో ఉండి కూడా ఆడోళ్ళను చూసి చొంగలు కార్చుకునే పుచ్చా పూర్ణానందం, కనిపించినవన్నీ కొట్టేసే వీరభద్రరావు (శ్రీవారి శోభనం)

ఇష్టమొచ్చినట్లు వంటలు చేసి పారేసి, కవితలు గీసి పారేసే శ్రీలక్ష్మి (చంటబ్బాయ్)

యజమాని మగవాడి చేతివంట తినకపోవడం చేత ఆడవాళ్ళ వస్త్రధారణ వేసుకుని వంట చేసే పాత్ర (నెలవంక)

తన కుమారుడి నిరుద్యోగానికి కారణమైన టీవీని సమాధి చేసే రాళ్ళపల్లి, ఎవరైనా తగాదా పడుతుంటే వాళ్ళు వాడే బండబూతులు తాను తీయబోయే తెలుగు సినిమా డైలాగులుగా, టైటిల్స్ గానూ వాడుకోడానికి నోట్ చేసుకునే బ్రహ్మానందం, బండి నడిపేటప్పుడు దూరపు వస్తువులు మాత్రమే చూడగల శవాల ట్యాక్సీ డ్రైవర్ (ప్రేమ ఎంత మధురం)

తనింటికొచ్చిన అందరు మగవెధవలనీ, గతంలో తన పెళ్ళిచూపులప్పుడు చూడటానికొచ్చిన పెళ్ళికొడుకులుగా గుర్తుపట్టే శ్రీలక్ష్మి. బయటికి చెప్పవలసిన మాటలు గుసగుసగానూ, సీక్రెట్లను బిగ్గరగానూ చెప్పే ఆవిడే... (లేడీస్ స్పెషల్)

నూనెగుడ్డల మడ్డివెధవ; తలకెంత నూనె రాసుకోవాలో, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని పనివాడు బ్రహ్మానందం (బావా బావా పన్నీరు)

చెత్త కవిత్వాలను వినిపించే శ్రీలక్ష్మిసుత్తి వీరభద్రరావు, నరసింగరావుల పాత్రలు (చంటబ్బాయ్, పుత్తడిబొమ్మ)

మాటిమాటికీ చెవిలో వార్తలు చెప్పి పెళ్ళిళ్ళు ఆపుచేయించే పాత్రలు (ప్రేమ ఎంత మధురం, అహ నా పెళ్ళంట, జయమ్ము నిశ్చయమ్మురా)

ఏ భాషలోనూ లేని వింత పదాలను తిట్లుగా మార్చి తిట్టే వీరభద్రరావు, ఒక రుమాలు ఉచితంగా వస్తుందని పది పట్టుచీరలు కొనే పిచ్చిమాలోకం శ్రీలక్ష్మి, పదో ఏటనే పెళ్ళి చేసుకోవాలని తపించిన నరేష్ (మొగుడూ- పెళ్ళాలూ!)

భర్త వంటి మీదున్న కొత్త లుంగీని తీసి స్టీలు సామాన్ల వాడికి వేసి స్పూనయినా సరే మహాభాగ్యంగా తీసుకునే రాధాకుమారి  (రావుగోపాలరావు)

తనకి బీపీ పెరిగితే, దాన్ని తగ్గించుకునేవరకూ కొట్టుకుందుకు గాను ఎప్పుడూ ఒక వస్తాదును ఎప్పుడూ ప్రక్కనే ఉంచుకునే సుత్తివేలు (బాబాయ్-అబ్బాయ్)

తనకి బీపీ పెరిగితే, దాన్ని తగ్గించుకునేందుకు గాను ఎప్పుడూ ఇంజెక్షన్లు ఇచ్చే ఒక డాక్టరును... కూడా ఉంచుకునే కోట (ప్రేమ ఎంత మధురం)

ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ తాకట్టుపెట్టి బజార్లోని పునిస్త్రీలను చచ్చు సినిమాలకి తీసుకెళ్ళి, కొత్త డైరెక్టర్లను ఉద్ధరించే శ్రీలక్ష్మి పాత్ర, లయ-తాళాల కనుగుణంగా మాలీషు చేసి, జుట్టు కత్తిరించే మంగలి వేలు (బాబాయ్ హోటల్)

పుట్టెడు చెవుడున్న ఆవిడని పెళ్ళి చేసుకుని, నిశబ్దం అన్న పదాన్ని కూడా ఎలుగెత్తి అరచి చేప్పే లైబ్రేరియన్ వేలు (సీతారామ కళ్యాణం)

టొమాటో పళ్ళు, దోసకాయలు, చింతపండు, గోంగూర పచ్చడి బొమ్మలను కూడా ముగ్గులుగా వేసే రమాప్రభ (సీతారామ కళ్యాణం)

హరికథలు స్పష్టంగా చెప్పే అందమైన అమ్మాయిని మాత్రమే పెళ్ళి చేసుకోవాలని ఎదురుచూసి వృద్ధుడయిన పుచ్చా పూర్ణానందం, బూతు మాట అనకుండా ఆపుకుని ఎదురుగా ఉన్న వస్తువు పేర్లను పలికే కోట, (హై హై నాయకా)

తనకన్నా అందంగా లేనివాళ్ళనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసే వేలు, కొడుకు పెళ్ళిచూపులకు వెళ్ళినచోటల్లా కాబోయే పెళ్లికూతుళ్ళను వంటల గురించి ప్రశ్నలడిగి విసిగించే నిట్టల (ప్రేమా జిందాబాద్)

ఇంకా లెక్కలేనన్ని పాత్రలను సృష్టించారు జంధ్యాల గారు. 

———————————————————————————————————-

అసలు జంధ్యాల గారి సినిమాలు ఎందుకని జనరంజకంగా ఉంటాయి?

  • కథా సంవిధానంలో హాస్యాన్ని మాధ్యమంగా ఉపయోగించడం. జంధ్యాల గారి అన్ని సినిమాల్లో చమత్కార సృజనని గమనించవచ్చు.
  • ఎక్కడా బోరు కొట్టకుండా ఆహ్లాదకరంగా వ్రాసుకునే సంభాషణల్లో హాస్యానికి పెద్దపీట వేయడం. అన్ని పాత్రలూ మధ్యతరగతి ప్రేక్షకుల ఇళ్ళ మధ్యలోనుంచి లాక్కురాబడ్డవే.
  • ఏ సంఘటనలో కూడా, ఏ పాత్రయినా గానీ మామూలుగా అందరూ మాట్లాడే విధంగా మాట్లాడదు...ఒక ప్రత్యేక ఛందస్సులో, సరళంగా, ప్రస్ఫుటంగా, ఒకింత పెద్ద నోరేసుకుని మాత్రం మాట్లాడుతుంది: కాకపోతే సహజంగా మనం మాట్లాడేలా కాకుండా కథలు, నవలలు, నాటకాలు అచ్చులో ఎలా ఉంటాయో అలాంటి భాష వాడుక ఉంటుంది అతని చిత్రాల్లో. పాత్రలు అలాంటి భాష ప్రయోగిస్తే అదొకరకమైన గమ్మత్తుగా ఉంటుంది. మాయాబజార్ సినిమా విజయానికి కూడా అలాంటి సింటాక్స్ ఉన్న సంభాషణలే ఒక కారణమని నా అభిప్రాయం.
  • హాస్యాన్ని చిలకరిస్తూనే  హుందాగా ఉండే పాత్రలు, వారికి తగ్గ మాటలు వ్రాసుకోవడం.
  • ఒక పాత్ర గుణగణాల మీద అంచుల దాకా వెళ్ళగలిగిన కల్పనా చాతుర్యం. (అహ నా పెళ్ళంట లో ఆవకాయ జాడీ హాస్యం, కోడిని వేలాడదీసి లొట్టలేసుకుని తినే హాస్యం నిజ్జంగా తారస్థాయిలో ఉంటాయి.)
  • హాస్యాన్ని ఎంత అద్భుతంగా వ్రాసుకుంటారో అంతే గొప్పగా ఎమోషనల్ సీన్లు కూడా వ్రాసుకోవడం. (ఉదాహరణకి ముద్దమందారం లో పూర్ణిమ పాత్ర పతాక సన్నివేశంలో కాన్పుకోసం పడే కష్టాలుచంటబ్బాయ్ లో చివరి ఇరవై నిమిషాలకి ఆయన వ్రాసిన సంభాషణలు.)
  • ఆర్గానిక్ గా ఉండే స్క్రీన్-ప్లే. ఎక్కడా దాని ప్రవాహం కృత్రిమంగా ఉండకపోవడం.
  • పంచులు కోసం ప్రాకులాట ఉండదు, గోల ఉండదు.
  • సినిమాలో ప్రతినాయకుడు ఎప్పుడూ చనిపోడు; ముదురు విలనిజం ఉండదు; గాఢమయిన సంఘర్షణలుండవు; చెడ్డ పాత్రలకు కనువిప్పు, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం పొందినట్లుగా చూపించడం తప్ప. రెండు పరస్పర విరుద్దమయిన మానవీయ భావాల మధ్యన చిన్నపాటి ఫ్రిక్షన్ ఉంటుంది గానీ ఏ పాత్రా ఇంకో పాత్రని చంపుకునేంత స్థాయిలో గొడవలుండవు. రాజ్ కుమార్ హీరాని సినిమాల్లో కూడా అదే రకమయిన కథావస్తువు ఉంటుంది.
  • హీరోయిన్ల దేహ సౌందర్యం చూపించ ప్రయత్నం చేయకపోవడం. నిండుగా కప్పుకున్న దుస్తులతోనే ఆడ పాత్రలుంటాయి. ఆడవారిని చిన్నచూపు చూడకపోవడం. శరీరాల మీదా ("అహ నా పెళ్ళంట", "ష్...గప్ చుప్...! " లాంటి సినిమాలు మినహాయింపు.), ఇతిహాసాల మీద, పురాణ పాత్రల మీద, సంప్రదాయాల మీదా జోకులు వేయకపోవడం.
  • తెలుగు భాష మీద ఉన్న గొప్ప పట్టు. ఏ తరహా భావ వ్యక్తీకరణ ప్రక్రియనయినా వ్రాయడంలో జంధ్యాల గారు సిద్ధహస్తులు.
  • నటుల నుంచి రాబట్టుకునే పాత్రోచిత హావభావాలు. వాటిని ఇంటర్ కట్స్ గా రియాక్షన్ రూపంలో తెరమీద చూపించడం. (సుత్తి వీరభద్రరావు-వేలు-శ్రీలక్ష్మి కాంబినేషన్ లో వచ్చిన ఏ సన్నివేశమయినా దీనికి ఉదాహరణే... )
  • తెలుగు నేటివిటీ ఉండేలా చూసుకోవడం, అచ్చ తెలుగు సంభాషణలు వ్రాసుకోవడం. (అందుకనే గామోసు ఈయన సినిమాలు ఏవీ ఇతర భాషల్లో రీమేక్ చేయబడలేదు.)
  • పాటలు సందర్భోచితంగాను, పాత్రోచితంగానూ ఉండేలా చూసుకోవడం, మంచి సంగీత సాహిత్యాలతో వాటిని రాగ-భావయుక్తంగా ఉండేలా సమకూర్చుకోవడం. చిత్రీకరణ ఆహ్లాదకరంగా, జనాకర్షంగా ఉండేలా చేయడం. (మొదటి చిత్రాల్లో ఉన్నంత మంచి పాటలు ఎందుకనో తర్వాత్తర్వాత ఆయన సినిమాల్లో రాలేదు. చివర్న వచ్చిన సినిమాల్లో పాటలు వినడానికి అస్సలు బాగోవు గానీ మంచి అర్థవంతంగా అయితే ఉంటాయి.)
  • ఎంత చిక్కని హాస్యం పండించినా జోకులు వేసేవాళ్ళు గానీ స్పందించే వాళ్ళు గానీ పొరపాటున కూడా నవ్వరు; ఆ బాధ్యతంతా ప్రేక్షకులదే.
  • బరువైన సెంటిమెంట్ సీను పడిన ప్రతిసారీ, ప్రేక్షకుడు తేలిక పడేలా అంతకన్నా గొప్పగా వ్రాసుకున్న హాస్య సన్నివేశం పండేలా చూసుకోవడం.
  • సంప్రదాయాలను హేళన చేసేలా ఆయన కథలుండవు. ఒకవేళ వితంతు వివాహాలు, మత మౌఢ్యం, నాస్తికత్వం లాంటి విషయాల మీద తీసినా... చాలా సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించే వారు. ప్రతి చిత్రంలోనూ దైవం, మూఢ నమ్మకాలు, మత విశ్వాసాల కన్నా మమత, మానవత, మనిషి మిన్న అనే భావాన్ని అంతర్లీనంగా చెప్పేవారు (నెలవంక  సినిమాలో తులసి పాత్రని మలచిన తీరు బహు గొప్పగా ఉంటుంది.). మనం ఇప్పుడు చూస్తున్నట్లు అందరూ పనికట్టుకుని చిలువలు పలువులు చేసి చెప్పుకుని మరీ ఎన్నో గ్రూపుల్లో తలకెత్తుకుంటున్న బూజుపట్టిన సంప్రదాయాలు మనిషిని ఎప్పుడూ ముందుకు పోకుండా అడ్డుపడతాయనే ఆయన భావించేవారు. (నెలవంక)
  • యుగళగీతాల్లో బృంద నాట్యకారులు (కసికసిగా వనితా ఇటుచూడుజయమ్ము నిశ్చయమ్మురా, విచిత్రం సినిమాల్లోని కొన్ని పాటలు మినహాయింపు) ఉండరు; పాపం ప్రేమికులకు కావలసినంత ప్రైవసీ ఉంటుంది.
  • చాలా తక్కువ బడ్జెట్ లో చిత్రం పూర్తి చేసేలా కథలు తయారు చేసుకునే వాళ్ళు. కథంతా మన ఇంటి ప్రక్కనే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. పెద్ద పెద్ద సెట్టింగులు, పొడుగు పొడుగు చేజింగులు ఉండనే ఉండవు. పరిసరాలన్నీ మనకి పరిచయమున్నవే అన్నట్లు అనిపిస్తాయి.
  • అద్భుత నటులయిన సాక్షి రంగారావు, ధమ్, సత్తిబాబు, వేలు, వీరభద్రరావు, శ్రీలక్ష్మి, అలీ, బ్రహ్మానందం, జెన్నీ, అశోక్ కుమార్, విద్యాసాగర్, రత్నసాగర్, నూతన్ ప్రసాద్, పొట్టి ప్రసాద్, సంధ్య, కోట, రాధాకుమారి, రావి కొండలరావు, భీమేశ్వరరావు, మిశ్రో, జిత్ మోహన్ మిత్రా, నిర్మలమ్మ, కాకినాడ శ్యామల, పావలా శ్యామల, డబ్బింగ్ జానకి, సుబ్బరాయశర్మ, కాదంబరి కిరణ్ కుమార్, ఝాన్సీ, నిట్టల లాంటి వారితో ఎన్నో అత్యద్భుతమయిన పాత్రలను సృష్టించారు జంధ్యాల గారు. ———————————————————————————

జంధ్యాల గారు అన్ని రకాల హాస్య ప్రక్రియలూ వ్రాయడంలో అందె వేసిన చేయి. అలా అని ఆయన విద్వత్తు ఒక్క హాస్యచతురతకే కట్టుబడి లేదు. సినిమాకు చెందిన అన్ని రకాల మాటలూ ఆయన అద్భుతంగా వ్రాసుకునేవారు. కనుక ఇక్కడ మనం ఉట్టి హాస్యానికే చెందిన ఉదాహరణలు మాత్రమే చెప్పుకుంటే నాణేనికి ఒక వైపు మాత్రమే చూసినట్లు లెక్క; ఆయన ప్రతిభని పూర్తిగా ఆవిష్కరించినట్లు కాదు. ఆయన కలం నుంచి జాలువారిన ఎన్నో అద్భుతమైన సెంటిమెంట్ డైలాగ్స్ ఉన్నాయి. అవి వింటున్నప్పుడల్లా గుండె బరువెక్కుతుంది, మనసు తడుస్తుంది; వెరసి కళ్ళు కురుస్తాయి. "నాలుగు స్తంభాలాట", "ముద్దమందారం", "పడమటి సంధ్యారాగం", "రాగలీల" (సుమలతకు వ్రాసినవి), నెలవంక (గుమ్మడి, సోమయాజులు), భానుప్రియ, సాక్షి రంగారావుల మధ్యతరగతి బ్రతుకు, దాని వెనుకనున్న కష్టాల మీద (మొగుడూ-పెళ్ళాలూ!), "మీరామాటనగానే నా కడుపులోంచి ఎగసిన మాటకీనా నోటికీ మధ్య ఈ రెండు చిన్ని బంగారు రేకులు అడ్డు పడ్డాయండి" అని గుండెల మీదున్న తాళిని చూపిస్తూ తన దగుల్బాజీ భర్తతో, లేడీస్ స్పెషల్ లో సంధ్య పాత్ర కోసం వ్రాసుకున్న పంక్తులు ఇంకెవరూ వ్రాయలేరేమో అన్నంత గొప్పగా ఉంటాయి. ఆయన సినిమాలకి రిపీట్ ఆడియన్స్ ఆయన వైవిధ్యంగా వ్రాసిన హాస్యం మూలంగా వచ్చినా గానీ, అవి మొదలుకి విజయవంతమవ్వడానికి సెంటిమెంట్ డైలాగ్స్ కూడా చాలా దోహదం చేశాయన్నది నా ఉద్దేశ్యం.

 —————————————————————————————————————-

పులగం చిన్నారాయణ గారి "జంధ్యామారుతం" నుంచి కొంత, గురువుగారి సినిమాలు ఎన్నోసార్లు చూసి ఇష్టంగా వ్రాసుకున్న నోట్సు ఇంకొంత, ఇంటర్నెట్ సౌజన్యంతో మరికొంత సంకలనం చేసి వ్రాసినవి. (అసంపూర్ణం)