January 1, 2020

పుష్పవిలాపం

జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి "పుష్పవిలాపం" పద్యములు.
పూర్తి ఆడియో ఇక్కడ వినవచ్చు...

గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు

నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము దీతువా?" యనుచు బావురు మన్నవి - కృంగిపోతి, నా
మానసమందెదో తళుకు మన్నది "పుష్పవిలాప" కావ్యమై.
ఆయువుగల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవె తల్లి జా
తీయత దిద్ది తీర్తుము, తదీయ కర్ములలోన స్వేచ్ఛమై
నూయలలూగుచున్ మురియుచుందుము - ఆయువు దీరినంతనే
హాయిగ కండ్లు మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

గాలిని గౌరవింతుము సుగంధము పూసి, సమాశ్రయించు భ్రుం
గాలకు విందుసేసెదము కమ్మని తేనెలు, మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయి గూర్తుము, స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో
తాళుము! తృంపబోవకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే! 

ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేనివారు మీ యాడువారు!

మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవితమెల్ల మీకై త్యజించి కృశించి నశించిపోవ మా
యౌవనమెల్ల కొల్లగొని ఆ పై చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారవైతురుగదా! నరజాతికి నీతి యున్నదా?

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజమౌ ప్రేమ నీలోన చచ్చెనేమొ?
అందమును హత్యజేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.