December 23, 2019

కోయిలాల ఓ కమ్మటి

చక్కని పల్లెటూరి భాష, భావనలతో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలంనుంచి జాలువారిన ఆణిముత్యం. అద్భుతమయిన ట్యూన్ తో సంగీత జ్ఞాని ఇళయరాజా ఈ పాటని మలచిన తీరు అనితరసాధ్యం. తన మొగుడి గురించి అప్పటివరకూ తప్పుగా అనుకుని తదనంతరం పరివర్తన చెంది... భర్త కోసం ఎదురుచూస్తూ పాడుకున్న అపూర్వ శబ్దతరంగం. 

కోయిలాల ఓ కమ్మటి
మొరటోడు నా మొగుడు (1992)
సంగీతం: ఇళయరాజా
రచన: సిరివెన్నెల
గానం: స్వర్ణలత

కోయిలాల ఓ కమ్మటి కబురినవేల
సల్లటేళ ఆ సంగతి సెవినెయ్యాల
ఆలకిస్తే నమ్మలేవులే
అమ్మతోడు కల్లకాదులే
గుండెలో నిండే ఇంత సంతోషం
ఉండలేనందే ఇనిపో కొంచెం
కోయిలాల ఓ కమ్మటి కబురినవేల
సల్లటేళ ఆ సంగతి సెవినెయ్యాల

చరణం 1:

ఉడుకు నీళ్ళు కాసాను సలవపంచ తీసాను
ఎప్పుడొచ్చి తానవాడునో
ఇష్టమైన కూడొండి ఏడి మీద ఉంచాను
ఎప్పుడొచ్చి ఆరగించునో...
యీపు రుద్ద మంటాడు  యేవిటో
పాడు సిగ్గు ఆడి మాట ఆలకిస్తదా
గోరు ముద్దలంటాడు యేవిటో
కంటిరెప్ప ఆడి సైగ సూడనిస్తదా
ఇట్టా ఎల్లకాలం ఆడి జతగా బతకనా
వచ్చే ఏళ కోసం వీధి గడపై సూడనా
జతగా బతకనా...
గడపై సూడనా....
కోయిలాల ఓ కమ్మటి కబురినవేల
సల్లటేళ ఆ సంగతి సెవినెయ్యాల

చరణం 1:

మాటలోనె పెళుసంట మనసు ఎన్నపూసంట
మావ అచ్చు రాములోరటే
దేవుడల్లే ఆడొస్తే దెయ్యవేమో అన్నట్టు
దడుసుకోని దూరమైతినే
ఎంత కష్టపెట్టానే మామని
ఎన్ని జన్మలెత్తి ఋణము తీర్చుకొందునే
కడుపులోన ఉన్న ఆడి ప్రేమని
కాలసేత అంతకంత తన్నమందునే
యాడో మిగిలి ఉన్నా కాస్త పున్నెం పండెనే
ఎంతో ఒదులుకున్నా ఇంత భాగ్యం అందెనే
పున్నెం పండెనే
భాగ్యం అందెనే

కోయిలాల ఓ కమ్మటి కబురినవేల
సల్లటేళ ఆ సంగతి సెవినెయ్యాల
ఆలకిస్తే నమ్మలేవులే
అమ్మతోడు కల్లకాదులే
గుండెలో నిండే ఇంత సంతోషం
ఉండలేనందే ఇనిపో కొంచెం