December 30, 2019

సీరెల్ కావలెనా – రయికల్ కావలెనా


సీరెల్ కావలెనా – రయికల్ కావలెనా
వర్గం: జట్టిజాం పాట

పాడటానికి అనువైన రాగం: హిందుస్తాని తోడి రాగస్వరాలు (ఆదితాళం)

అందమైన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పడుచు.
అందుకే బావ చీరెలూ, సొమ్ములూ తెచ్చిస్తానని సెప్పినా వద్దంటుంది ఆ మరదలు పిల్ల.
ఆ మరదలు పిల్ల మనసులోని మాటను జానపదులు ఇలా పాటలా పాడుకుంటారు…

సీరెల్ కావలెనా – రయికల్ కావలెనా
నీకేం కావాలనే మైదుకూరు సంతలోనా

సీరల్ నా కొద్దురో – రయికల్ నా కొద్దురో
నీవే నీవే నీవే కావాలరో రంగమ్మత్త కొడుకా

కమ్మల్ కావలెనా – కడియాల్ కావలెనా
నీకేం కావలనే పొద్దుటూరు సంతలోనా
కమ్మల్ నాకొద్దురా – కడియాల్ నాకొద్దురా
నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా

ఆరం కావలెనా – గొలుసుల్ కావలెనా
నీకేం కావాలనే – బద్వేల్ బజారులోనా

ఆరం నాకొద్దురా – గొలుసుల్ నాకొద్దురా
నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా

నేనే కావాలంటే – సుబ్బమ్మత్త కూతురా
అయ్యన్ అడగలనే – మా అమ్మన్ అడగలనే

అయ్యన్ నేనడుగుతా – మీ అమ్మన్ నేనడుగుతా
పద పదా బావ ఇంటికెళ్ళిపోదాము…

పాటను సేకరించినవారు: కలిమిశెట్టి మునెయ్య, దొమ్మరనంద్యాల, కడప జిల్లా