December 26, 2019

ఇదేమి ఉయ్యాలా

ఇవాళ గానకోకిల జానకి గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడని తలచుకుంటూ ఆవిడ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక పాటని ఇక్కడ విందాం.....

కొండకోనల్లో పుట్టి పెరిగిన అడవిమల్లి ఆ చిన్నది. నాగరికత వాసనలేవీ తెలియనే తెలియవు. మనసులో ఏదో దాచుకుని, పైకి మరేదో మాట్లాడాల్సిన అవసరం ఏమాత్రమూ లేని ప్రపంచం ఆమెది. చెట్టూ చేమల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగిన ఆ అమ్మాయి, తనకి వయసొచ్చిన విషయం గ్రహించుకుంది. తోడు కావాలన్న తొందర ఆమెలో మొదలయ్యింది. ఓ చక్కని జానపదం అందుకుంది. తన చుట్టూ ఉన్న ప్రకృతితో పాట రూపంలో సంభాషించింది.

యవ్వనం వస్తూ వస్తూ తనతోపాటు ఉరిమే ఉత్సాహాన్ని తీసుకు వస్తుంది. ప్రపంచంలో ఉన్న అందమంతా తన చుట్టూనే ఉన్నట్టు, సంతోషం మొత్తం తనలోనే నిక్షిప్తమైనట్టూ అనిపించడం, యవ్వనారంభంలో అందరికీ సహజమే. ఇందుకు ఆ అడవిమల్లి మినహాయింపు కాదు. ఆమెలో కొత్త ఉత్సాహం పెల్లుబుకుతోంది. నవ్వు దాగనంటోంది. ప్రకృతిలో తననీ, తనలో ప్రకృతినీ చూసుకుంటూ తనకి తగ్గ జతగాడి కోసం ఎదురు చూస్తోంది.

'మౌనపోరాటం' (1989) సినిమాలో ఈ సన్నివేశానికి మన్యపు సౌందర్యాన్ని, గిరిజనపు వాడుకలనీ మేళవించి ఓ అందమైన పాట రాశారు  వేటూరి సుందర రామ్మూర్తి. సంగీత దర్శకత్వం మరెవరో కాదు, ఎస్. జానకి!! గాయనిగా క్షణం తీరిక లేకుండా ఉన్న సమయంలో, జానకి ఎంతో ఇష్టంగా ప్రత్యేకించి సమయం కేటాయించుకుని మరీ సంగీత దర్శకత్వం వహించిన సినిమా ఇది. 'యాల యాల యాలగా ఇదేమి ఉయ్యాల...' అంటూ తొలి యవ్వనపు గిరితనయ లోకి పరకాయ ప్రవేశం చేసి, ఈ పాట పాడేనాటికి జానకి వయసు అక్షరాలా యాభయ్యేళ్లు!

జానకి గొంతులో వినిపించే చిలిపితనం, మధ్యమధ్యలో నవ్వులు, 'ఉప్పొంగి పోయింది మా తేనె గంగమ్మ... ముక్కంటి ఎంగిలి సోకని గౌరమ్మ..' పలికిన తీరు, కోయిలతో పోటీ పడడం.. ఇవేవీ మరో గాయని నుంచి ఆశించలేం..

ఇదేమి ఉయ్యాలా
చిత్రం: మౌనపోరాటం (1989)
సంగీతం, గానం: జానకి
రచన: వేటూరి

యాలయాలయాలగ ఇదేమి ఉయ్యాలా
యాలగాని గాలలో ఎదెట్ట ముయ్యాలా
ఈతడిలో తడితాకిడిలో చలి ఆరడి సాగిన సందడిలో
బిడియాలయాలయాలగ ఇదేమి ఉయ్యాలా
లల్లలలా లల్లాల లాలాల లాలాలా

ఓ కొండ వాగమ్మ తలదువ్వి పోతుంటే
ఓ గాలివాగమ్మ పూలెట్టి పోతుంటే
తెలిమంచు కూసల్లో తనుపొంచి సూరీడు
ముద్దాడిపోయేనమ్మా ఈయాల యాలయాలాగ ఇదేమి ఉయ్యాలా
యాలగాని గాలలో ఎదెట్ట ముయ్యాలా

ఉప్పొంగిపోయింది మా తేనె గంగమ్మ
ఉప్పొంగిపోయింది మా తేనె గంగమ్మ
ముక్కంటి ఎంగిలి సోకని గౌరమ్మ
రామయ్య తాకని రాయంటిదీ జన్మ
శబరమ్మ సేతుల్లో పండింది యీకొమ్మ
సేలల్లో సిలిపి వయసు ఏలల్లో
గాలుల్లో గడుసు పడుసు ఈలల్లో
కూసే కూ కూ కోయిలా
కూఊ

యాలయాలయాలగ ఇదేమి ఉయ్యాలా
యాలగాని గాలలో ఎదెట్ట ముయ్యాలా
ఈ తడిలో తడితాకిడిలో చలి ఆరడి సాగిన సందడిలో
బిడియాలయాలయాలగ ఇదేమి ఉయ్యాలా