తల్లీ భారతి వందనము
నీ ఇల్లే మా నందనము
మేమంతా నీ పిల్లలము
నీ చల్లని ఒడిలో మల్లెలము
చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా
తల్లిదండ్రులను గురువులను
ఎల్ల వేళలా కొలిచెదమమ్మా
కుల మత భేదం మరిచెదము
కలతలు మాని మెలగెదము
మానవులంతా సమానమంటూ
మమతను సమతను పెంచెదము
తెలుగుజాతికి అభ్యుదయం
నవభారతికి నవోదయం
భావి పౌరులం మనం మనం
భారత జనులకు జయం జయం