మానవులు తమ జానెడు పొట్ట పోషణకై ఎన్నో కష్టాలు పడుతున్నారు. చెయ్యరాని పనులు చేస్తున్నారు. అలా చెయ్యటమెందుకు అని ఈ పాట పల్లవిలో ప్రశ్నిస్తున్న అన్నమయ్య చరణాల్లో మానవులకు ధర్మబోధ చేస్తున్నాడు. తోటి మానవుల పట్ల దయ, వాత్సల్యం చూపించాలి కాని వారి మనసులను కష్టపెట్టరాదు. ఒకవేళ ఇతరులను కష్టపెడుతూ జీవిస్తుంటే, పరితాపకరమైన ఆ బ్రతుకూ ఒక బ్రతుకేనా? ఇతరులు ఉన్నత స్థానాలకు చేరుతుంటే చూచి సంతోషించాలి. ఈ శరీరము పరులకు చేయు ఉపకారాలన్నీ తనకు తాను చేసుకున్నవిగా చెప్పనియట్టి చదువెందుకు? అంటూ ఘాటుగా చెప్పిన అన్నమయ్య చివరి చరణంలో శ్రీ వేంకటేశ్వరుని సేవాకైంకర్యానికి ఉపయోగపడని సిరిసంపదలు ఎందుకు? హరిని ఆత్మలో చింతించని పదవులెందుకు? అని భౌతిక సుఖాలను ఈసడిస్తున్నాడు. ఇవన్నీ మానవత్వం, దయ, కరుణ, సేవ, సౌభ్రాతృత్వం లాంటి గుణాలను మానవుడు అవలంబించాలని చెప్పేందుకు మాత్రమే హెచ్చరికలు. మానవునికి బంధాలను మీరి డబ్బు, వ్యాపారం, కాంక్ష మిన్నకాకూడదని చెప్పేవి మాత్రమే. అంతేగానీ నీతి, యోగ్యత, న్యాయబుద్ది, సత్యము, నిజాయితి, నిష్కపటములతో మానవులందరూ తమతమ వ్యాపార కార్యకలాపాలు అసలే మానేసి మిన్నకుండమని చెప్పేందుకు కాదు.
కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై
పడని పాట్లనెల్ల పడి పొరలనేలా
పరుల మనసునకు నాపదలు కలుగ గచేయు
పరితాపకరమైన బ్రతుకేల
సొరిది ఇతరుల మేలుచూచి సైపగలేక
తిరుగుచుండేటి కష్ట దేహమిది ఏలా
ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు
చదివి చెప్పనియట్టి చదువేలా
పొదిగొన్న యాసలో బుంగడై సతతంబు
సదమదంబై పడయు చవులు తనకేలా
శ్రీ వేంకటేశ్వరుని సేవానిరతికి గాక
జీవన భ్రాంతిపడు సిరులేలా
దేవోత్తముని యాత్మతెలియనొల్లక పెక్కు
త్రోవలేగిన దేహి దొరతనం బేలా
కుడుపు = తిండి;
పాటులు = అవస్థలు
పరితాపకరము = (ఇతరులకు) బాధ కలిగించునది (లేదా) (ఇతరులదృష్టిలో) అయ్యో! పాపమనిపించుకొన్నది;
సొరిదిన్ = క్రమముగా
చదివిచెప్పని యట్టి చదువు = శ్రుతి స్మృత్యాదుల నుదహరించి చెప్పని విద్య;
పొదిగొన్న = గుంపులుగా పైబడిన;
బుంగుడై = బుంగుడు వడి, మునిగి;
సదమదంబై = నలుగుడువడి;
చవులు = రుచులు
కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై
పడని పాట్లనెల్ల పడి పొరలనేలా
పరుల మనసునకు నాపదలు కలుగ గచేయు
పరితాపకరమైన బ్రతుకేల
సొరిది ఇతరుల మేలుచూచి సైపగలేక
తిరుగుచుండేటి కష్ట దేహమిది ఏలా
ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు
చదివి చెప్పనియట్టి చదువేలా
పొదిగొన్న యాసలో బుంగడై సతతంబు
సదమదంబై పడయు చవులు తనకేలా
శ్రీ వేంకటేశ్వరుని సేవానిరతికి గాక
జీవన భ్రాంతిపడు సిరులేలా
దేవోత్తముని యాత్మతెలియనొల్లక పెక్కు
త్రోవలేగిన దేహి దొరతనం బేలా
కుడుపు = తిండి;
పాటులు = అవస్థలు
పరితాపకరము = (ఇతరులకు) బాధ కలిగించునది (లేదా) (ఇతరులదృష్టిలో) అయ్యో! పాపమనిపించుకొన్నది;
సొరిదిన్ = క్రమముగా
చదివిచెప్పని యట్టి చదువు = శ్రుతి స్మృత్యాదుల నుదహరించి చెప్పని విద్య;
పొదిగొన్న = గుంపులుగా పైబడిన;
బుంగుడై = బుంగుడు వడి, మునిగి;
సదమదంబై = నలుగుడువడి;
చవులు = రుచులు