చల్లని వెన్నెల సోనలు

చల్లని వెన్నెల సోనలు
చిత్రం :  వెలుగు నీడలు (1961)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  సుశీల, జిక్కి

చల్లని వెన్నెల సోనలు - తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే
మంచి ముత్యముల వానలు- "చల్లని"

పిడికిలి మూసిన చేతులు - లేత గులాబీ రేకులు పిడికిలి
మూసిన చేతులు - లేత గులాబీ రేకులు పిడికిలి
చెంపకు చారెడు సోగకన్నులే
సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు -"చల్లని"

ఇంటను వెలసిన దైవము - కంటను మెరిసిన దీపం

మా హృదయాలకు హాయి నొసంగే
పాపాయే మా ప్రాణము "ఇంటను"

చల్లని వెన్నెల సోనలు - తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి నవ్వు పువ్వులె
మంచి ముత్యముల వానలు
నోచిన నోముల పంటగ - అందరి కళ్ళకు విందుగా
పేరు ప్రతిష్టలె నీ పెన్నిథిగా
నూరేళ్ళాయువు పొందుమా

-చల్లని

ఈ పాటను శ్రీశ్రీ రాయగా సుశీల, జిక్కి ఆలపించారు. సావిత్రి, గిరిజ అభినయించారు. సన్నివేశ ప్రాధాన్యంగా సూర్యకాంతం, ముగ్గురు చిన్నపిల్లలు ఏడాదిలోపు, రెండు మూడేళ్ళలోపు, అయిదారేళ్ళ లోపు పిల్లలు కనిపిస్తారు. పుట్టి పెరుగుతున్న పిల్లవాణ్ణి పెంచుతున్న కన్నతల్లి హృదయం, ఆ పిల్లవాడిపై మమకారం పెంచుకున్న మరో మాతృ హృదయం - స్పందిస్తే ఎటువంటి భావాలు కలుగుతాయో వాటినే అక్షర రూపంలో అందించారు శ్రీశ్రీ. పరకాయ ప్రవేశ విద్య మంచి కవికి అంతర్లీనంగా ఉంటుందనటానికి ఈ పాట ఓ ఉదాహరణ.

ఇక్కడ ఆనాటి విలువల గురించి మరోసారి చెప్పుకోవాలి. పాట మొదట్లో మా పాపాయి బోసిననవ్వులె మంచి ముత్యముల వానలు - అని ఉంటుంది. తర్వాత నుంచి - మా పాపాయి నవ్వు పువ్వులె మంచి ముత్యముల వానలు - గా ఆ లైను రూపాంతరం చెందుతుంది. అందుకు కారణం - పిల్లవాడు పెరిగి బోసి నవ్వుల స్థాయి నుండి పళ్ళొచ్చాక అందంగా నవ్వేటంతగా పెద్దవాడయ్యాడు - అని ఎస్టాబ్లిష్ చెయ్యాలనుకోవటమే! నిర్మాత, దర్శకుడు, పాటల రచయిత కలిసి కూర్చుని అనుకుంటేనే గాని ఇంత లోతైన అవగాహన కలగదు. ఆనాడు ఉన్నదీ, ఈనాడు కొరవడుతున్నదీ అదే!

ఈ పాటను వకుళాభరణం రాగం ఆధారంగా స్వరపరిచారు. 'ఇంటను వెలిసిన దీపము' చరణానికి చక్రవాక రాగాన్ని, 'నోచిన నోములు పండగా' చరణం వద్ద మాయా మాళవ రాగాన్ని స్పృశించినా వకుళాభరణ రాగాన్నే ప్రధానంగా చేసుకుని పాటను నడపడం జరిగింది. ఈ పాటకు బెంగాలీలో గీతారయ్ పాడిన 'కాజల్ కాజల్ కుమ్ కుమ్' అనే ప్రైవేట్ గీతం ట్యూన్ ఆధారం అని శ్రీ.వి.ఎ.కె. రంగారావు తన 'ఆలాపన' శీర్షికలో పేర్కొన్నారు.