December 25, 2019

నువ్వెవరైనా నేనెవరైనా



నువ్వెవరైనా నేనెవరైనా
అటు అమెరికా ఇటు ఇండియా (2002)
సిరివెన్నెల
బాలు
మాధవపెద్ది సురేష్

నువ్వెవరైనా నేనెవరైనా
నీ నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా పేరేదైనా
మన ఊపిరి గీతం ఒకటే

నువ్వెవరైనా నేనెవరైనా
నీ నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా పేరేదైనా
మన ఊపిరి గీతం ఒకటే

అలలన్నిటికీ కడలొకటే,
నదులన్నిటికీ నీరొకటే
మనసు తడిస్తే నీ నా
చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే

నువ్వెవరైనా నేనెవరైనా
నీ నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా పేరేదైనా
మన ఊపిరి గీతం ఒకటే

చరణం 1:

ఏ దేశం వారికి అయినా
ఇల ఒకటే, గగనం ఒకటే
ఏ భాషను పలికిస్తున్నా
గొంతులు, స్వరతంత్రులు ఒకటే

ఆహారం వేరే అయినా
అందరి ఆకలి ఒకటే
ఆకారం వేరేదయినా
ఆధారం బ్రతుకొకటే

నిన్నూ నన్నూ కన్నప్పుడు
మన తల్లుల నొప్పుల తీరొకటే

ఎన్నో రంగుల తెల్లకిరణమై
వెలుగుతున్న జీవితమొకటే

నువ్వెవరైనా నేనెవరైనా
నీ నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా పేరేదైనా
మన ఊపిరి గీతం ఒకటే

చరణం 2:

ఏ రూపం చూపెడుతున్నా
ఉలి కదలికలకు శిల ఒకటే
ఏ రాగం వినిపిస్తున్నా
పిల్లనగ్రోవికి గాలొకటే

నీ నాట్యం పేరేదైనా
పాదాలకు కదలికలొకటే
ఏ ప్రాంతంలో నువ్వున్నా
ప్రాణాలకి విలువొకటే

నీకూ నాకూ అందరికీ
పుట్టుకతో చుట్టరికం ఒకటే
నీకూ నాకూ అందరికీ
పుట్టుకతో చుట్టరికం ఒకటే

నువ్వూ నేనూ వీరూ వారూ
అంతా కలిసి మనమొకటే

నువ్వెవరైనా నేనెవరైనా
నీ నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా పేరేదైనా
మన ఊపిరి గీతం ఒకటే
అలలన్నిటికీ కడలొకటే,
నదులన్నిటికీ నీరొకటే
మనసు తడిస్తే నీ నా
చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే

నా గుండెలో నీ సంతకం
తడిదేరుతున్న కన్నుల్లో
ఆషాఢమేఘమై మెరిసింది
కన్నీళ్ళకు దవ్వు నేర్పింది