December 22, 2019

ప్రపంచమా క్షమించుమా

ప్రపంచమా క్షమించుమా
చిత్రం: గిల్లికజ్జాలు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, సునీత

ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా
వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
కాంచన కాంతులభామ నీ కంచెలు తెంచుకు రామ్మా
కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా
ఈ ఏకాంతం మనదే స్నేహమా…
వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా

కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా
జత కుదరని ఎదలకు పెరుగగ ఏదో మంటా
ఎవరెవరికొ ఎద రగిలితే అది మనకేమంటా
కనులడిగిన కలలను తరుముతు పోదామంటా
మనకు మనకు గల ముచ్చట మననెవరు కనని చోటెచ్చట
ముడులు విడని బిగి కౌగిట తగు విడిది మనకు దొరికేనట
మరి ఆలస్యం ఇంకా ఏంటటా…
ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా

తెరమరుగున నిలువక చొరవగ రారమ్మంటా
అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా
కలవరపడు గుసగుస కబురును విన్నానంటా
మనసెరిగిన వరుసకు సరసనె ఉన్నానంటా
ఉరుము వెనుక జడివానలా ఈ విరహమంత కరిగేదెలా
దిగులు పడకు నువ్వంతలా తొలి వలపు తెగని విరిసంకెలా
మరి దూరంగా ఉంటే ఇంకెలా…

వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
కాంచనకాంతుల భామ నీ కంచెలు తెంచుకు రామ్మా
కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా
ఈ ఏకాంతం మనదే స్నేహమా…