కార్యేషు దాసి
చిత్రం: పవిత్ర బంధం (1996)
రచన: సిరివెన్నెల
గానం : ఏసుదాస్
సంగీతం : కీరవాణి
కార్యేషు దాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై
బ్రతుకుతుంది పడతి పతే లోకమై
మగని మంచి కోసం పడే ఆర్తిలో
సతిని మించగలరా మరే ఆప్తులు
ఏ పూజ చేసినా ఏ నోము నోచినా
ఏ స్వార్థము లేని త్యాగం
భార్యగ రూపమే పొందగా...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
కలిమిలేములన్నీ ఒకే తీరుగా
కలిసి పంచుకోగా సదా తోడుగా
కలిసి రాని కాలం వెలి వేసినా
విడిచిపోని బంధం తనై ఉండగా
సహధర్మచారిణి సరిలేని వరమని
సత్యాన్ని కనలేని నాడు
మోడుగా మిగలడా పురుషుడు...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా...
కార్యేషు దాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ
ఈ పాటలోని భావయుక్తమయిన పదాల సారాంశం
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపే చ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ।
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మయుక్తా కులధర్మపత్నీ।।
కార్యము లందు *దాసి*, వర గౌరవ *మంత్రి* యు యోచనన్, మహై
శ్వర్యద *లక్ష్మి* రూపమున, భవ్య *ధరిత్రి* క్షమా గుణాన, తా
నార్యయు *మాత* భోజనము నందున, శయ్యల *రంభ* యైన యా
*భార్యకు సేవఁ జేయ, భువి భర్త తరించును జన్మజన్మకున్.*
పైన వివరించినట్లు నడచుకొనేటటువంటి భార్య మనసు తెలిసికొని, ఎన్నడూ ఆమెను నొప్పించకుండా, ఆమెకు అన్నివిధాలా అండగా ఉండే భర్త, ప్రతిజన్మలోనూ తరిస్తాడు అని చెప్పే సందర్భం.
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః
కార్యేషు యోగీ – పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.,
కరణేషు దక్షః – కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
రూపేచ కృష్ణః – రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.
క్షమయా తు రామః – ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
భోజ్యేషు తృప్తః – భార్య/తల్లి వండిన దాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
సుఖదుఃఖ మిత్రం – సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు – ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు.