December 22, 2019

పిచ్చి పిచ్చి పిచ్చి

పిచ్చి పిచ్చి పిచ్చి
సినిమా: పండంటి సంసారం (1975)
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: కె.వి.మహదేవన్
పాడినది: భానుమతి

చావే ఎరుగని ఇంటినుంచి ఆవాలు తెమ్మన్నాడుట బుద్ధుడు
అలాగే మచ్చుకు ఏ పిచ్చిలేని ఒక మనిషిని చూపండి ఈనాడు

పల్లవి :

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి

చరణం 1:

మనసుంటేనే పిచ్చి, మతి ఉంటేనే పిచ్చి
మంచితనం అన్నింటిని మించిన పిచ్చి

చరణం 2:

వెర్రిమొర్రిగా ప్రేమించడమూ కుర్రవాళ్ల పిచ్చి
కస్సుబుస్సుమని ఖండించటమూ కన్నవాళ్ళ పిచ్చి
భక్తి పిచ్చి, ముక్తి పిచ్చి, విరక్తి పిచ్చి,
పదవుల పిచ్చి, పెదవుల పిచ్చి, మధువుల పిచ్చి...

చరణం 3:

చీకటివెలుగులు కష్టసుఖాలు సృష్టించటమే దేవుడి పిచ్చి
ఆ దేవుడి కోసం దేవులాడటం మనుషుల పిచ్చి

చరణం 4:

ఉన్నవాడికి ఇంకా ఇంకా కావాలని పిచ్చి
వాడ్ని లేనివాడిగా చేయాలని లేనివాడికి పిచ్చి
ఉన్నది లేదు లేనిది ఉంది అన్నది పిచ్చి
నేనన్నది పిచ్చని అన్నవారికే ఉన్నది పిచ్చి