December 24, 2019

కోటికి ఒకరే పుడతారు

ప్రఖ్యాత హాస్యనటుడు
రాజబాబు
20-10-1935    14-2-1983

తెలుగు చలనచిత్ర రంగంలో
రెండు దశాబ్దాలు
ప్రముఖ హాస్యనటునిగా వెలిగిన రాజబాబు
'శతాబ్దపు హాస్య నటుడి'గా
ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి.

ఈయన అక్టోబరు 20, 1935 తేదీన
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో
పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు,
శ్రీమతి రవణమ్మ దంపతులకు జన్మించారు.

రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.  నిడదవోలు లోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం పనిచేశారు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాలలో పాలుపంచుకొనే వారు.

ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన
గరికపాటి రాజారావు (పుట్టిల్లు సినిమా దర్శకుడు) సినిమాలలో చేరమని ఉత్సాహపరిచారు.
దాంతో చెప్పాపెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నారు. పూట గడవడానికి హాస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు చెప్పేవాడు. కొన్నాళ్ళ తరువాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి 'సమాజం' సినిమాలో అవకాశం కల్పించారు. మొదటి సినిమా తరువాత 'తండ్రులు-కొడుకులు','కులగోత్రాలు'  'స్వర్ణగౌరి' 'మంచి మనిషి' మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి.
స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించారు.
మొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన
చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే 'కుక్కపిల్ల దొరికిందా', 'నాలుగిళ్ళ చావిడి', 'అల్లూరి సీతారామరాజు' మొదలగు నాటకాలు వేశారు.

జగపతి ఫిలింస్ వి.బి.రాజేంద్రప్రసాద్ చిత్రం'అంతస్తులు' చ్రిత్రంలో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా పెద్దమొత్తం 1300 రూపాయల్ని పారితోషికంగా పొందారు. తరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో ప్రముఖ చిత్రాలలో నటించారు.

ఆ సమయంలో ఆకాశరామన్న,
సతీ శబరి, ప్రచండ భైరవి, సత్యహరిశ్చంద్ర,
సంగీత లక్ష్మి, పరమానందయ్య శిష్యుల కథ,
ఉమ్మడి కుటుంబం, విచిత్ర కుటుంబం లాంటి చిత్రాలలో నటించారు. రాజబాబుకు జంటగా
లీలా రాణి, మీనా కుమారి, ప్రసన్న రాణి,
గీతాంజలి లాంటి వారు నటించినా,
ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం
రమాప్రభ అని చెప్పాలి.

ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్,
ఇల్లు- ఇల్లాలు, పల్లెటూరి బావ,
సెక్రెటరి, జీవన జ్యోతి, కార్తీక దీపం,
అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు
రాజబాబు-రమాప్రభ జోడీకి
మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి.

రాజబాబు  తాతా మనవడు, పిచ్చోడి పెళ్ళి,
తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే,
మనిషి రోడ్డున పడ్డాడు లాంటి
సినిమాలలో హీరోగా నటించారు.
ఈ సినిమాలలో ఎవరికి వారే యమునా తీరే,
మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను స్వయంగా
బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్ అన్న
నిర్మాణ సంస్థ  పేరుతో నిర్మించారు.

సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వింవిన రాజబాబు
నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవారు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని మరియు నటీమణుల్ని
సత్కరించే వారు.

ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్ఫూర్తినిచ్చిన  బాలకృష్ణను సత్కరించాడు.

రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డా౹౹శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి,
రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు.

ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో
విరాళాలిచ్చిన దాత రాజబాబు.
రాజమండ్రిలో చెత్తా చెదారం
శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో
దానవాయిపేటలో భూమి ఇచ్చారు.
అంతే కాక కోరుకొండలో జూనియర్ కాలేజీ
కట్టించారు. దాని పేరుకూడా ఆయన పేరు మీదే 'రాజబాబు జూనియర్ కళాశాల'గా ఉంది.

వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు.
ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులు,
మరియు ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందారు. 'చెన్నై ఆంధ్రా క్లబ్బు'వారు వరుసగా ఐదు సంవత్సరాలు 'రోలింగ్ షీల్డు'ని ప్రదానం చేసారు.
అంతే కాక 'శతాబ్దపు హాస్య నటుడిగా' అవార్డు పొందాడు.

అనుకరించడానికి అసాధ్యమైన
ప్రత్యేకమైన శైలి రాజబాబుది.

రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. మహా శివరాత్రి రోజు మరియు ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 రోజున మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదే రోజు రాత్రి
గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదు లోని థెరెసా ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రి లోనే
ఫిబ్రవరి 14, 1983 రోజున తెలుగు
సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తుడయినారు.

కోటికి ఒకరే పుడతారు
చిత్రం : మనిషి రోడ్డున పడ్డాడు (1974)
సంగీతం :  శంకర్‌-గణేష్
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు

పల్లవి:

కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు (#పుణ్యమూర్తుల అప్పలరాజు?#)
వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు
పుణ్యమూర్తులూ.. సూర్యచంద్రులూ
పుణ్యమూర్తులూ.. సూర్యచంద్రులూ

కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు
వారికొరకే వస్తారు సూర్యచంద్రులు

చరణం 1:

నా స్వార్ధం నాదే నని తలపోసేవాడూ..
నలుగురికి భారమై కాటికి పోతాడు
నా దేశం నా మనిషి అని పోరాడేవాడు..
పోయినా లోకాన మిగిలిపోతాడు
లోకాన మిగిలిపోతాడు.....

కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు
వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు

చరణం 2 :

అల్లా..ఓ అగ్బర్..అల్లా..ఓ అగ్బర్..అల్లా..
కులమత భేధాలెందుకు మనిషిలో..
కనిపించవు చివరకు ఏ పశువులో
బ్రతుకులోని తీయదనం మమతలో..
మనిషిలోని గొప్పదనం నడతలో

చరణం 3 :

తలరాతలు నమ్ముకునే దైన్యం పోవాలి...
తన చేతలపై మనిషికి ధైర్యం రావాలి...
చీకటినే నిందించే నైజం విడవాలి..
పదుగురికీ దీపమై తానే వెలగాలి..
దీపమై తానే వెలగాలి...