November 25, 2020

బేట్రాయి సామి దేవుడా


బేట్రాయి సామి దేవుడా
రాయలసీమ జానపదం 
సంగీతం: రాజ్-కోటి 
గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ 
 
బేట్రాయి సామి దేవుడా-
నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా
బేట్రాయి సామి దేవుడా-
నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా

కాటేమి రాయుడా! 
కదిరి నరసింహుడా
నీటైన వేటుగాడ 
నిన్నే నమ్మితి సామీ
బేట్రాయి...

చేపకడుపున చేరి పుట్టగా-
రాకాసివోని కోపముతోన గొట్టగా
ఓపినన్ని నీళ్ళలోనె 
వచ్చి నీవు వెతికివెతికి 
బాపనోళ్ళ సతుకులన్ని 
బొమ్మదేవర కిచ్చినోడ            
బేట్రాయి...

తాబేలై తాను పుట్టగా-
ఆ నీళ్ళకాడ
దేవ రాక్షసులు జేరగా
తోవచేసి కొండకింద 
దూరగానె చిలికినపుడు
పావనంబైన వెన్న 
దేవర్ల కిచ్చినోడ                  
బేట్రాయి...

అయ్యా...
అందగాడు నీవు లేవయా-
గోవిందా గోపాల రక్షించరా
పందిలోన చేరి 
కోరపంటితోన ఎత్తి భూమి
సిందుసిందు సేసినట్టి 
సందమామ నీవె కదరా            
బేట్రాయి...

అయ్యా...
నారసింహ నిన్నె నమ్మితి-
నానాటికైన 
కోరిన నీ పాదమె గతీ...
సేరి కంబాన పుట్టి–  
ప్రహ్లాదు గాచి
కోరమీసమెత్తి శత్రుగుండె 
తల్లకిందు చేసినోడ                    
బేట్రాయి...

అయ్యా...
బుడుత బాపనోడి వైతివి
బలిచక్రవర్తి నడిగి 
భూమి నేలుకొంటివి
పొడుగు కాళ్ళవాడవై 
అడుగు వాని మీద బెట్టి
తడువులేక లోకములను-
మడమతోడ తొక్కినోడ          
బేట్రాయి...

అయ్యా...
రెండు ఏడులొక్కసారిగా-
ఈ భూమి పదుల
సెండాడితి ఓ పరిశుత
దండి నాగేళి కాళింది 
సిందుసిందు సేసినోడ
బండకులుకు లందరి 
బట్టించినట్టి దొరవు నీవె                  
బేట్రాయి...

అయ్యా...
దేవకీదేవి కొడుకువై 
ఈ భూమిలోన
దేవుడై పుట్టినావయా
ఆవూల కాచుకొనుచు
ఆడోళ్ళ గూడుకొనుచు
తావు బాగ చేసికోని 
తక్కుబిక్కు చేసినోడ                
బేట్రాయి...

అయ్యా...
వేదాలు నమ్మరాదుగా 
ఈ శాస్తుర్ల
బోధాలు బాగులేవుగా
వేదాలు చదువుకొనుచు 
బోధాలు చేసికొనుచు
నాదావినోదుడా 
నల్లనయ్య నీవె కదరా                         
బేట్రాయి...

అయ్యా...
కల్కి నా దొరవు నీవెరా 
నా తోటి బల్కరాదా బాలకృష్ణుడా 
చిల్లకట్టు పురమునందు 
చిన్నీ గోపాలుడవై 
పిల్లంగోడు చేతబట్టి 
పేట పేట తిరిగినోడ 
బేట్రాయి...

వడ్డె కులమునందు పుట్టితి 
నీ విచ్చినట్టి మట్టి తట్ట చేతబట్టితీ 
ఊరూరూ తిరుగుకొనుచు 
ఉండోణ్ణీ చూసుకొనుచు 
నీకు నేననేటి భ్రాంతి 
నిక్కముగా నొదిలినాడ 
బేట్రాయి...