August 12, 2020

మొక్కజొన్న తోటలో


బంగారిమామ పాటలు
జానపదగీతం 
మొక్కజొన్న తోటలో
రచన: కొనకళ్ల వెంకటరత్నం
గానం: వింజమూరి అనసూయాదేవి

మొక్కజొన్నతోటలో
ముసిరిన చీకట్లలో,
మంచెకాడ కలుసుకో;
మరువకు మామయ్య.
సుక్కలన్ని కొండమీద
సోకు జేసుకునే వేళ,
పంటబోది వరిమడితో
పకపక నవ్వే వేళ,
సల్లగాలి తోటకంత
సక్కలగిలి పెట్టు వేళ,
పొద్దువాలు గంటనే
పుంతదారి వెంటనే,
సద్దుమణగనిచ్చి రా
ముద్దులమామయ్య!

గొడ్డుగోద మళ్ళేసే
కుర్రకుంకలకు గానీ,
కలుపుతీతలయి మళ్లే
కన్నెపడుచులకు గానీ,
బుగ్గమీస మొడివేసే
భూకామందుకు గానీ,
తోవకెదురు వస్తివా,
దొంగచూపు చూస్తివా,
తంటా మన యిద్దరికీ
తప్పదు మామయ్య!!

కంచెమీద గుమ్మడిపువు
పొంచి పొంచి చూస్తాది;
విరబారిన జొన్నపొట్ట
వెకిలినవ్వు నవుతాది;
తమలాకుతీగెలు కాళ్ళకు
తగిలి మొరాయిస్తాయి;
చెదిరిపోకు మామయా,
బెదిరిపోకు మామయా!
సదురుకొ నీ పదునుగుండె
సక్కని మామయ్య!

పనలుకట్టి యొత్తి నన్ను
పలకరించబోయినపుడు,
మోటబావి వెనక నాతొ
మోటసరస మాడినపుడు,
చెరుకుతోట మలుపుకాడ
చిటికవేసి నవ్వినపుడు,
కసిరితిట్టినాననీ,
విసిరికొట్టినాననీ,
చిన్నబోకు నలుగురిలో
సిగ్గది మామయ్య.