August 12, 2020

జంబైలే జోరు లంగరు


జంబయిలే జోరు లంగరు
జానపదగీతం
రచన, గానం: పి.వి.చలపతిరావు

జంబయిలే జోరు లంగరు
ఔరౌర మున్నోళ్ళబ్బాయి లంగరు
॥జం॥

రోసం లేదు... మీసం లేదు
చల్లనీళ్ళ అల్లిమొగ్గ
ఉడుకు నీళ్ళు ఉల్లి పువ్వు
ఖాఖీ దుస్తులు కట్టుకోని
కాకినాడకు పోతుంటే ...
కాకిపిల్ల నెత్తిమీద
కావుకావు తన్నింది
॥జం॥

కడవమీద కడవ పెట్టి
కాకినాడ రేవుకెళితే...
కాకినాడ కలకటేరు
కడవదించి కౌగిలించె

బిందె మీద బిందె పెట్టి
భీమడోలు రేవుకెళితే...
భీమడోలు మునుసబ్బు
బిందె దించి మాటలాడె
॥జం॥

ముంత మీద ముంత పెట్టి
ముంజవరం రేవుకెళితే...
ముంజవరం మొగోడూ
ముంత దింపి ముద్దులెట్టే  
॥జం॥

చిన్న చిన్న పనులలో పాటలోని స్వరప్రవాహమున్నూ, లయయున్నూ పనివాళ్ళ దృష్టిని మార్చి పని కష్టమును మరుగు పరచగలవు. పెద్ద పెద్ద బరువులను తోయునప్పుడు పాటకు లిబిడో తోడు కావాలె. కూడు తప్పితే... కామమే కదా పాటకజనానికి సుఖదాయకము? బోయిలర్లను దూలాల మీద నడిపేప్పుడు, హెచ్చయిన బరువులు లాగే కూలీల పాట ఇది. (ఆంధ్రభారతి)