అలంకారము తెలుగు వ్యాకరణంలో ఒక భాగము. అలంకారములు మూడు రకములు.
1. శబ్దాలంకారములు (అనుప్రాసాదులు),
2. అర్థాలంకారములు (ఉపమాదులు),
3. ఉభయాలంకారములు (సంసృష్టి మొ||)
శబ్దాలంకారములు:
అర్థము విచారింపక శబ్దము వినఁగనే చెవులకింపుగా వినఁబడునది. ఇందులో ననేక భేదములుఁ గలవు.
1) అనుప్రాసాలంకారము
• వృత్త్యనుప్రాసాలంకారము
• ఛేకానుప్రాసము
• లాటానుప్రాసాలంకారము
• అంత్యానుప్రాసాలంకారము (అంత్యనియమము)
• పునరుక్తవచాభాసము
వృత్త్యనుప్రాసాలంకారము
ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడినది. వృత్తం అంటే తిరగడం, ప్రాస అంటే మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదాహరణలు:
అడిగెదనని కడువడి జను (భాగవతం-గజేంద్రమోక్షం)
అడిగిన తను మగుడనుడువడని నడయుడుగున్
వెడ వెడ జడముడి తడబడ
అడుగిడు నడుగిడదు జడిమ అడుగిడు నెడలన్
భాగవతం లోనిదే వీరభద్రవిజయం సందర్భంలోని మరో పద్యం (సీసం)
అభ్రం లీహాదభ్ర విభ్రమ భ్రభ్రమ
కృన్నీల దీర్ఘ శరీర మమర
ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజాల
జాజ్వాల మానకేశములు మెరయ
షండ దిగ్వేదండ శుండాభ దోర్దండ
సాహస్రా ధృత హేతి సంఘమొప్ప
వీక్షణ త్రయలోక వీక్షణ ద్యతిలోక
వీక్షణ తతి దుర్మిరీక్షముగను
క్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపాలాస్థి వనమూలికలునుదనర
అఖిలలోక భయంకరుడగుచు వీర
భద్రుడుదయించె మారట రుద్రుడగుచు
• మకరంద బిందు స్యందన సుందరము (బిందు పూర్వక ద కారం)
• ఆనంద కందళ సందోహము (బిందు పూర్వక ద కారం)
• సమద విపక్ష శిక్షణ విచక్షణ (క్ష కారము)
• సువిలాస సంపద సరణి (స కారము)
• బాలా! ఏల బేల వయ్యెదవు? (ల కారము)
తెలుగు చిత్రాల్లోని పాటల్లో కొన్ని ఉదాహరణలు
క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన.
ఇందువదన కుందరదన (ఛాలెంజ్, బిందు పూర్వక ద కారం ఎక్కువసార్లు వస్తుంది)
మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే వగలా మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జోహారికా
నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి (ట్టి, జగదేకవీరుడు-అతిలోక సుందరి)
గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి
తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టీ
పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి
చీకటింట దీపమెట్టి చీకుచింత పక్కానెట్టి
నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి
పెట్టూపోతా వద్దే చిట్టెంకి చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి
పెట్టేది మూడే ముళ్ళమ్మి నువ్వు పుట్టింది నాకోసమమ్మి
ఇక నీ సొగసు నా వయసు పేనుకొనే ప్రేమలలో
యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగాదిగా తాపం
పట్టె మంచమేసిపెట్టి పాలు పెట్టి పండు పెట్టి
పక్క మీద పూలు కొట్టి పక్కా పక్కాలొళ్ళు పెట్టి
ఆకులో వక్క పెట్టి సున్నాలెట్టి చిలకా చుట్టి
ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్ని పండాపెట్టి
చీర గుట్టు సారే పెట్టి సిగ్గులన్ని ఆరాబెట్టి
కళ్ళలోన వత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి
ఒట్టే పెట్టి వచ్చేసాక మామా నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమా
చుట్టెయ్యి సందె సీకట్లోనా నను కట్టెయ్యి కౌగిలింతల్లోనా
ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో
