October 15, 2021

​మాతృభాష


ఇప్పుడు ప్రజలంతా పుస్తకాలను వాడుకభాషలో చదువుతున్నా, విద్యార్థులు మాట్లాడే భాషలోనే పరీక్షలు వ్రాస్తున్నా...అదంతా "వాడుక భాషోద్యమ పితామహుడు"గా ప్రసిద్ధికెక్కిన గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు గారి (ఆగష్టు 29, 1863 - జనవరి 22, 1940) చలవే. గ్రాంథికభాషలో ఉన్నతెలుగు వచనాన్ని వాడుకభాషలోకి తీసుకువచ్చి, నిత్య వ్యవహారిక భాషలో ఉన్న సౌందర్యాన్నీ, సుళువునూ తెలియజెప్పిన మహనీయుడు గిడుగు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషాశాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెనుగు చిచ్చర పిడుగు...గిడుగు. ఆయన  గారి ఉద్యమం వల్లనే... ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు, వ్యావహారికభాషలో సాగి, ఎక్కువ మందిని ఆకర్షించి మరింతగా అందుబాటులోకి వచ్చింది. అప్పటిదాకా పుస్తకాల్లో ఉన్న ఎక్కువమందికి అర్థం కాని భాష వ్యర్ధమనీ, కనీసం పిల్లలు చదివే పాఠ్యపుస్తకాలయినా వాడుకభాషలో ఉండాలని రామ్మూర్తిగారు ఉద్యమించారు. ఆయన మరణించేవరకూ వాడుకభాష అమలు కోసమే పోరాడారు. తెలుగు వ్యావహారిక భాషాభ్యున్నతికి గిడుగు రామ్మూర్తి పంతులు గారి సేవలను గుర్తిస్తూ ఆయన జయంతిని పురస్కరించుకుని 'తెలుగుభాషా దినోత్సవము'గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తుంది.

ఒకప్పుడు శాసనాల భాష పూర్తిగా శబ్దాడంబరమయిన పద్యభాషగా ఉండేది. మరోపక్క కావ్య భాష పూర్తి సంస్కృత వాసనలతో ఉండేది. ఇక సామాన్య ప్రజల భాష… మట్టివాసనలతో ఈ రెంటికీ దూరంగా వేరోలా ఉండేది. మూడూ ఒకే భాషలో చెప్పుకున్న భావాలే అయినా మూడూ ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉండేవి. పైపెచ్చు అప్పట్లో పుస్తకాలన్నీ గ్రాంథిక భాషలో ఉండేవి. అవి చాలా తక్కువమందికి మాత్రమే అర్ధమయ్యేవి. పుస్తకాల భాష, ప్రజల వ్యావహారిక భాషల మధ్య చెప్పలేనంత అంతరం ఉండటం వలన సామాన్య ప్రజానీకం సాహిత్యం అన్నది చాలా సంక్లిష్టమయిన అంశమనీ, అందులో ప్రవేశానికి బోలెడు కృషి చేయాలనీ అనుకునేవారు. కానీ సాహిత్య రచనకు మూలం గ్రహణశక్తి, చతురత మరియు కల్పనాచాతుర్యమే గానీ కష్టతరమయిన భాషా వినియోగం కాదనీ... సృజనాత్మకత ఉన్న ప్రతి ఒక్కరూ కావ్యరచనకు అర్హులే అని ఆయన వక్కాణించారు. ఆయన కృషి వలననే ఒకప్పుడు పండితులకి మాత్రమే పరిమితమైన సాహిత్య సృష్టి, అటు తరువాత సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ చేరువైంది. 

రామ్మూర్తి పంతులుగారి ఔన్నత్యాన్ని గురించి కొందరు ప్రసిద్ధులు ఇలా చెప్పారు:

"ఏమైనా అభిమానమంటూ ఉన్న ఏ పండితుడైనా, కవియైనా తనబిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని, మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే..."-
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి
 
"రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట"
"రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు"-
విశ్వనాథసత్యనారాయణ
 
"గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు,

వ్యవహారభాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు,

తేట తేనియలతెల్లని పాల మీగడ గిడుగు,

కూరి తెలుగుభాషకు గొడుగు గిడుగు"-పులిదిండి మహేశ్వర్

గిడుగు గారి గురించి కొంత చెప్పుకున్నాం సరే....అసలు "మాతృభాష" అంటే ఏమిటి? ప్రశ్న చిన్నదే అయినా... జవాబు పైకి కనిపించినంత సులువు గాదు. కొంచెం లోతయిన భావాలను ఇక్కడ చర్చించుకుందాం. మాతృభాష అని మనం చెప్పుకునే భాషనే రకరకాల పేర్లతో పిలుస్తారు. వాటి నిర్వచనాలను ఒకసారి పరికిద్దాం.

మాతృభాష :

మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష మాతృభాష... లేదా మాతృభూమిలో మాట్లాడే భాష.

ప్రథమ భాష :

ఏభాషలో నయితే చక్కగా మాట్లాడగలిగి, అర్థం చేసుకోగలిగి, భావాలను వ్యక్తపరచ గలుగుతారో ఆ భాషను ప్రథమభాషగా గుర్తించవచ్చు.

ప్రాంతీయ భాష :

ఒక ప్రాంతంలో నివసిస్తూ వుంటే,ఆ ప్రాంతపు వ్యావహారిక భాషను కూడా మాతృభాషగా పరిగణించవచ్చు. 

అమ్మ భాష అంటే ఇంతేనా...! ఇంకా ఏమీ లేదా?.. అంటే..ఉంది...అసలయింది....అదే మనిషి తన 'మనసు'తో మాట్లాడుకునే భాష. మనిషి తనకే స్వంతమయిన మనసుతో లావాదేవీలు నిర్వహించే మాధ్యమం...దాన్నే నికరంగా మనం మాతృభాష అనాలి. ఒక మనిషితో అందరికన్నా ఎక్కువగా సావాసం చేసేది, అతనితో అనుక్షణం చర్చించేది, అతన్నికష్టాల్లో పడకముందే హెచ్చరించేది, ఒకవేళ పొరపాటున పడ్డా... ఓదార్చేది..మనసే. ఊహల్లోనే కాదు ఆఖరికి కలల్లో కూడా వెన్నంటి ఉండేది, అతనితో ఎప్పుడూ అనుసంధానమై ఉండేది, అవసరమైనప్పుడల్లా గుసగుసలాడేది, బుజ్జగించేదీ, లాలించేదీ, కొండకచో తిట్టేదీ అయిన మనసు సదరు వ్యక్తితో సంభాషించే భాషే మాతృభాష. అదే మనిషి అసలు భాష. అదే అతని గుర్తింపు. 

కానీ తెలుగువాడి మాతృభాష ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఒక ప్రభుత్వం తర్వాత మరో ప్రభుత్వం..అంచెలంచెలుగా తెలుగుని కనీసం వాడుక భాషగా కూడాలేకుండా చేయాలని కంకణం కట్టుకుని మరీ శ్రమిస్తున్నట్లుగా అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే. విద్యార్థికి ఊహ తెలిసేవరకు బోధన పూర్తిగా మాతృభాష లోనే (అంటే కనీసం ఏడవతరగతి దాకా నయినా) జరగాలనీ...అప్పుడే అతడు తర్వాత్తర్వాత వచ్చే ఎన్ని భాషలనయినా, సైన్సు లాంటి సబ్జెక్టులను కూడా దీని ఊతంగా నేర్చుకుని చక్కగా ఆకళింపు చేసుకుని వృద్ధిలోకి రాగలడనీ ఎంతమంది భాషా శాస్త్రవేత్తలు చెప్పినా... మన ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. తెలుగుతో ఒక్క ప్రతిపక్షాలకి మాత్రమే నిమిత్తం ఉన్నట్లుగానూ తెలుగును పరిరక్షించడానికి అధికార పక్షానికి వీసమెత్తు బాధ్యత కూడా లేనట్టుగానూ కనిపిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వాల పోకడలు చూస్తుంటే. బానిస భాష అయిన ఆంగ్లానికి పట్టం కట్టి, తెలుగుని ఇంకా అడుక్కి గిరాటేయాలని అన్ని అధికారపక్షాలూ పరితపిస్తున్నాయి. పిల్లాడు కనీసం పన్నెండు సంవత్సరాలదాకా ఎక్కువగా ఏ భాషనయితే  ఉపయోగిస్తాడో అదే అతని మనోభాషగా మారుతుందని మానసిక శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇప్పుడున్న తరంలో చాలామంది విద్యార్ధులకు మనోభాషగా ఇప్పటికే తెలుగు లేదన్నది నిర్వివాదాంశం. దానికి కారణాలు బోలెడు..... మరీ ముఖ్యంగా, ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో పెద్దలు పిల్లలతో తెలుగు మాట్లాడించటంలేదు. పిల్లలు కూడా తోటి పిల్లలతో తెలుగులో చర్చించడం ఏనాడో మానేసారు. ఇప్పుడు వస్తున్న తెలుగు చలనచిత్రాల్లో కూడా చాలావరకు ఇంగ్లీషు లేదా హిందీలోనే ఎక్కువ మాటలుంటున్నాయి. బహుశా ఆ భాషల్లో ఎంత ఎక్కువ పరిజ్ఞానం ప్రదర్శిస్తే అంత గొప్ప అన్న భేషజం కావొచ్చు. ఇక చదువుకునే పాఠ్యపుస్తకాల్లో కూడా తెలుగు లేకుంటే ఇప్పుడు మనలా తెలుగులో మనసుల్తో చర్చించగలిగే తెలుగువారు భవిష్యత్తులో కరువవుతారు. ఇక ఇదే కొనసాగితే మనోభాషగా తెలుగు అదృశ్యమవ్వడం ఖాయం. అది ఎప్పటికీ మనభాషకు మంచిది కాదు. తెలుగు ఇంగ్లీషు భాషల మధ్య బేధాన్ని ఒక చిన్న ఉదాహరణలో చెప్పుకుందాం...చదువుల్తో మునిగి భోజనానికి ఆలస్యం చేస్తున్న కొడుకుని "అయ్యా...రాజూ....రాయ్యా! ఆనక చదువుకుందువుగానిలే... అన్నం పళ్ళెం ఎదురుచూడకూడదు....నాయనా ...నా బంగారుతండ్రివి కదూ...రాయ్యా!" అన్న అమ్మ పిలుపుల్లోని ఆప్యాయత "Raju...Come...join us for dinner!" అన్న అరువు మాటల్లో ఎప్పటికయినా వస్తుందా...? 

అసలు మన మాతృభాష ఏదో నలుగురు కలిసి ఉబుసుపోక చర్చించుకుని తీర్మానించుకుంటే ఏర్పడిన మాటలకూటమి కాదు. డానికి బోలెడు చరిత్ర ఉంది. ప్రతి పదం వెనుకా ఒక చిన్న కథే ఉంటుంది... వెతికితే. ఎలాగూ అమ్మ భాష గురించి చెప్పుకున్నాం గనుక ఇప్పుడు మనం "అమ్మ" అన్న పదం గురించికూడా చర్చించుకుంటే సందర్భోచితంగా ఉంటుందని భావిస్తాను.          

ఒక బుజ్జిపాపడు, లేదా పాపాయి... బోసినవ్వులుచిందిస్తూ ఈ ప్రపంచంలోకి రావడానికి అమ్మ, నాన్న ఇద్దరూ కావలసిందే...వారి కలయికే మన సృష్టికి మూలం. ఇంకే రకంగానూ ప్రస్తుతం మనుష్యులు పిల్లల్ని కనలేరు. మరి ఇద్దరూ ముఖ్యులే అయితే ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలి? తల్లికా...తండ్రికా?! తప్పనిసరిగా తల్లికే...నవమాసాలుతన కడుపులో తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుని, పరిరక్షించుకుని, తన ప్రాణాలను పణంగా పెట్టి, తన పేగుబంధాన్ని ఈ లోకంలోకి తీసుకువచ్చిన అమ్మకే మొదటి గౌరవము ఇవ్వాలన్నదే అత్యంత సముచితమయిన నిర్ణయం. మరి దానికి ప్రతిగా తల్లిని ఏ పేరుతో పిలవనివ్వాలి? "అమ్మ" అనే!.... ఎందుకంటే "మ్మ" అన్న పదమే బుజ్జాయి తొలిపలుకు....అది ఏ దేశంలోనయినా, ఏ ప్రాంతంలోనయినా గానీ. అదే తొలి పదం. అదే తొలి వాక్యం. అదే తొలి వాక్ చైతన్యం. అందుకనే ప్రపంచంలో ఎన్నిభాషలున్నా.. దాదాపు అన్నింటిలోనూ తల్లిని "మ (M)" అనే అక్షరం ఉండేలా పిలుచుకుంటారు. (అమ్మ, మదర్, మా, మామ్, మమ్, మాయీ, మమ్మా, ఆమ్, మాదెర్, మజకా, మే, మమ్మీ, మేసిల్, మాతృ, మాత్రే, మాతా, మదాయి, ఇతరత్రా...) మానవుడి పరిశీలనా దృష్టి మూలంగానే అన్ని భాషల్లోని మొదటి భాషా శాస్త్రజ్ఞులు (వాళ్ళని అలా పిలుచుకోడంలో తప్పులేదనుకుంటాను. భాషలు తొట్ట తొలి పుట్టి వృద్ధిచెందే క్రమంలో వీళ్ళ పాత్రే చాలా కీలకం) కుతూహలంతో ఆలకించి, తల్లికి పేరుగా అంకితం చేసిన బుజ్జాయి తొలి పదం: "అమ్మ". అదే అతడు తన తొలి గురువుని సంబోధించే పదం. ఇది పూర్తిగా మానవుని కుతూహల శక్తికి పట్టం కడుతూ నిశ్చయింపబడిన తీర్మానం. "మ్మ" అన్నపిలుపు బుడుతడు తన పెదాలు తెరిచేప్పుడు అస్పష్టంగా ఉచ్చరించగలిగిన శబ్దం. అతనికి నాలుకతో సావాసమింకా ఏర్పడని తొలిరోజుల్లో చేసిన అస్పష్టమయిన శబ్దం. కొన్ని సందర్భాల్లో అది"వా" లాగానో లేదా "పా" లాగానో వినిపించవచ్చు గానీ “మా” అన్న నాదమే ఆ పిల్లాడు పలకబోయే మాటల తొలిమెట్టు. పరికించి చూసుకుంటే ఇలాంటి సాపత్యమే మన దగ్గర బంధాల పేర్లకూ  ఉంటాయి...."అమ్మ",  "నాన్న", "అత్త", "మామ", "అన్న", "తాత", "పాప", "అక్క", "అయ్య", "బావ", "చెల్లి" “బాబు” ఇతరత్రా. ఛందోబద్దంగా చూస్తే అన్నింటికీ మొదటిది గురువు. అవునుమరి మనం బడిలో చేరేదాకా వీళ్ళేగా గురువులు...! పిల్లాడిని మాటల పరంగా ఒక్కో మెట్టూ ఎక్కించే క్రమంలో వాడికి తెలిసిన...లేదా ప్రయత్నపూర్వకంగా పిల్లాడు ఉచ్చరిస్తున్న పదాలతోనే మొదలుపెట్టి క్రమక్రమంగా భాషలోని మిగిలిన పదాలని నేర్పే మార్గాలని మానవుడిలా తయారుచేసుకున్నాడు. ఈ ఒక్క పదం వెనుకే మన పూర్వీకుల కృషి ఇంత ఉంటే... మరి అత్యున్నతమయిన పదాలతో, సుసంపన్నంగా విరాజిల్లగలిగే అన్ని అర్హతలున్న మన తెలుగుభాషని తయారుచేయడం కోసం ఎన్ని కష్టాలు పడివుంటారో కదా...! 

మరి అలాంటి అద్భుతమయిన మన భాష మరుగునపడి పోవలసిందేనా? కాదు...మనం ఎప్పటికీ అలా కాకుండా చూద్దాం మనం మన భాషను కలకాలం బ్రతికించుకోవడమే మన పూర్వీకులకు మనం అర్పించే ఘనమైన నివాళి. మన భాష అంతరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది. ఆ గురుతర బాధ్యతని గుర్తించి, దానికి తగ్గట్టుగా మనందరం నడుచుకోవలసిందిగా ప్రార్ధన. దానికోసం ఈ క్రింది కొన్ని సూచనలు చేయదలచాను. 

1)ఇంట్లో పిల్లలతో తెలుగులోనే మాట్లాడుదాం.

2)తెలుగు వార్తాపత్రికలు చదువుదాం. 

3)పిల్లలకి తెలుగు చదవడం, వ్రాయడం నేర్పించుదాం. 

4)తెలుఁగు వాగ్గేయకారులను, వారి రచనలను పిల్లలకు పరిచయం చేద్దాం 

5)శతకములలో వ్రాసిన జీవితసత్యాలను పిల్లలకుతెలుపుదాం. 

6)ఏదయినా ఒక తెలుగు సాహిత్య బ్లాగును తరచూ దర్శిద్దాం.

7)తెలుగువారితో తెలుగులోనే మాట్లాడుదాం. 

8)తెలుగు గ్రూపుల్లో తెలుగులోనే టంకణం చేసి చర్చించుకుందాం.

9)తెలుగులో వచ్చిన మంచి మంచి సినిమాల, పుస్తకాల గురించి భావితరాలకు తెల్పుదాం. 

10)తెలుగుని పరిరక్షించవలసిన బాధ్యత మన ముందుతరాల వారిది కూడా అనితెలియజేద్దాం.  

11)పిల్లల్లో సాహిత్యాభిలాషను పెంపొద్దిద్దాం.    

(వికీపీడియా సౌజన్యంతో కొంత) 

L.వేంకట భవానీ ప్రసాదు, 

ముంబాయి, 29/08/02020