భజగోవిందం అనే పాట ఊసుపోక ఏదో భగవంతుడిని గురించి మాత్రమే చెప్పుకునే మూఢ భక్తి గీతం కాదు. దానిలో ఉన్న అర్ధాన్ని, పరమార్ధాన్నీ ఒక్కసారి గమనించండి. పాట దాని తాత్పర్యం ఈ క్రింద వివరింపబడినది.
భజ గోవిందం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ శ్రీవత్స
సాహిత్యం: ఆది శంకరాచార్యుడు
గానం: మధు బాలకృష్ణన్
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే
భావం: భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని... ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ (డుకృణ్ కరణే లాంటి) వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు.
నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగామోహావేశం
ఏతన్మాన్వసాది వికారం
మనసి విచంతయ వారం వారం
భావం: స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు.
జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబరబహుకృతవేషః |
పశ్యన్నపి చన పశ్యతి మూఢః
హ్యుదరనిమిత్తం బహుకృతవేషః
భావం: జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకివేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటికోసమే గాని, వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు.
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసార బహుదుస్సారే
కృపయా పారే పాహి మురారే
భావం: మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం; మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం - ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు.
యోగరతో వా భోగరతో వా
సంగరతో వా సంగవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ
భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం.