అంజలిరంజలి
అన్నమయ్య స్వర లతార్చన (2010)
గానం: లతా మంగేష్కర్
సంగీతం: మయూరేశ్ పాయ్
పల్లవి:
అంజలిరంజలి రయం తే
కిం జనయసి మమ ఖేదం వచనైః
చరణం 1:
మాం కిం భజసే మయా కింతే
త్వం కోవా మే తవ కాహం
కిం కార్యమితో గేహే మమతే
శంకాం వినా కిం సమాగతోసి
చరణం 2:
నను వినయోక్తేర్న యోగ్యాహం
పునః పునస్త్వం పూజ్యోసి
దినదిన కలహ విధినా తే కిం
మనసిజ జనక రమా రమణ
చరణం 3:
దైవం బలవత్తరం భువనే
నైవ రోచతే నర్మమయి
ఏవమేవ భవదిష్టం కురు కురు
శ్రీ వేంకటాద్రి శ్రీనివాస
వేంకటేశ్వర స్వామికి భక్తులకు దర్శనమివ్వటంలో చాలా సమయం గడిచిపోయింది. అమ్మ అలమేలుమంగమ్మతో పొద్దు పుచ్చటానికి ఏకాంత ప్రదేశానికి చేరుకొన్నాడు. అమ్మ అయ్యని కాస్త ఎగ తాళి మాటలతో చురుకు పుట్టించాలనుకొంది. ఆయన పాపం ఇంకా మాట్లాడటం ఇంకా మొదలు పెట్టలేదు. అమ్మ అంజలి అంజలి అంటూ పల్లవి మొదలు పెట్టింది.
స్వామీ ! నీకొక నమస్కారం! ఎందుకయ్యా మాట్లాడాలని చెప్పి నాకు వేదన కలిగిస్తావు. నీకు నీ మాటలకు ఒక దండం బాబూ ! వేంకటేశ్వరుడు అమ్మవారి సేవ చేయాలని కొంచెం వంగాడు. అమ్మ రెచ్చిపోయింది
1. ఎందుకయ్యా ! నన్ను సేవిస్తావు. నువ్వెవరివి? నేనెవరిని? నీకు నేనేమవుతాను. నాకు నువ్వేమవుతావు? భక్తులకు దర్శనమిస్తూ కొండ మీదనే ఉండకపోయావా ! అలమేలుమంగా పురంలోని నా ఇంట్లొ నీకేం పని? ఔరా ! ఆలస్యమయితే ఏమన్నా అనుకొంటుంది అన్న భయం భక్తి లేకుండా వచ్చేసావు.
2.వినయపు మాటలు చెప్పే యోగ్యత నాకు ఎక్కడ ఉందిలే? అందుకు నేను తగను. నువ్వు పూజ్యుడివి. నేను కాదు. ఓ మన్మథ జనకా ! మనిద్దరి మధ్య ఈ తగువులేంటి? నువ్వు ఆలస్యం గా రావటం. నేనేదొ అనటం. ఎందుకొచ్చిన తగవులు. వీటివల్ల మనకి ఏమి ప్రయోజనము ఉంది?
3.అయినా నేను ఎంత చెప్పినా దైవమే బలవత్తరమైనది. నేను తొందరగా రావయ్యా మగడా ! అంటాను. నువ్వు ఆలస్యం చేస్తూ నే ఉంటావు. నా విషయంలో శృంగారం నీకు ఇష్టం కాదులే. నీ ఇష్టం స్వామీ ! ఇకనుంచి నేను ఏమీ చెప్పను. నీ ఇష్టం వచ్చినట్లు చేయి. నీకొక దండం.
విశేషాలు
1.దేని చేత భక్తి వ్యక్తం చేయబడుతుందో దానిని అంజలి అంటారు.
2.దోసిలి పట్టి నమస్కారం చేయటం అంజలి అని పారమార్థిక పద కోశం.
3. నీకో నమస్కారం అనే తెలుగు జాతీయానికి అందమైన సంస్కృత అనువాదం అంజలిరంజలిరయం తే.
4.నాయిక జీవాత్మ. నాయకుడు పరమాత్మ. ఇద్దరి మధ్య సయోధ్య కుదరదు. తగాదాలు వస్తూనే ఉంటాయి. దీనినే అన్నమయ్య ప్రతిరోజూ మనిద్దరి మధ్య ఈ తగాదాలేమిటి (దిన దిన కలహ విధినా ) అన్నాడు.
5.జీవుడు భగవంతుడు నిర్దేశించిన శరణాగతి మార్గంలోనే నడవాలని నీ ఇష్టం వచ్చినట్లు చేయి ( భవదిష్టం కురు ) అంటూ అన్నమయ్య భక్త మార్గాన్ని నిర్దేశించాడు. అసలు అంజలికి శరణు అని ఒక పర్యాయ పదముంది. అందుకే స్వామికి శరణు అంటూ స్వామితో నాయికా రూపంలో అన్నమయ్య ఈ గీతంలొ ఆత్మీయ సంభాషణ చేసాడు.