అందాల అపరంజి బొమ్మ
చిత్రం : ఘటోత్కచుడు (1995)
సంగీతం : ఎస్వీకృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు
అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటు బెంగపడకమ్మ
కడుపార నిను కన్న అమ్మ
చూడలేదమ్మ నీకంట చెమ్మ
తను మరుగునున్నా
నిను మరువదమ్మా
కన్నీరు తుడిచే కబురంపెనమ్మ
చెబుతాను వినవమ్మ.
అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటు బెంగపడకమ్మ
ఆకలందంటే ఆ చిన్ని బొజ్జ
అడగకుండానే తెలుసుకోమంది
ఆటాడుకోగా తోడెవ్వరంటే
అంబారిగట్టి ఆడించమంది
నీకేం కావాలన్నా
నాకు చెపుతూ ఉంటానంది
తానే లోకాన్నున్నా
నిన్ను చూస్తూ ఉంటానంది
కాపాడుకుంటా కనుపాపలాగా
నిను చూసుకుంటా మీ అమ్మలాగా
నమ్మమ్మ నా మాట..
అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటు బెంగపడకమ్మ
మావయ్యనంటూ నిను చేరమంది
మంచి మాటలతో మరిపించమంది
కథలెన్నొ చెప్పి నవ్వించమంది
ఒడిలోన చేర్చి ఓదార్చమంది
జో జో పాపా అంటూ
తాను రోజూ పాడే లాలి
ఇట్టా పాడాలంటూ
నాకు తానే నేర్పింది తల్లి
మా పాపనెప్పుడు కాపాడమంటూ
దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చే
పని మీద వెళ్ళింది..
అందాల అపరంజి బొమ్మ
అమ్మ లేదంటు బెంగ పడకమ్మ
కడుపార నిను కన్న అమ్మ
చూడలేదమ్మ నీకంట చెమ్మ
తను మరుగునున్నా
నిను మరువదమ్మా
కన్నీరు తుడిచే కబురంపెనమ్మ
చెబుతాను వినవమ్మ....
అందాల అపరంజి బొమ్మ
అమ్మ ఏదంటు బెంగ పడకమ్మ