November 21, 2021

తెలుగు సినిమా పాటల్లో ఛేకానుప్రాసాలంకార ప్రయోగం

ఛేకానుప్రాసాలంకారము:

అర్థ భేదము గల రెండు లేక అంతకన్నా ఎక్కువ హల్లులు వ్యవధానము లేకుండా వెనువెంటనే వచ్చుట. ఛేకులనగా నిపుణులని అర్థము. వారుపయోగించు అనుప్రాసము ఛేకానుప్రాసము.

ఉదాహరణ: 

మనమున ననుమానము నూ (ముద్దుపలుకుల చిలక-తిమ్మనార్యులు)
నను నీ నామ మను మను మననమును నేమ
మ్మున మాన నమ్న మన్నన 
మను మను నానామము నీన మానా నూనాః 

భీకర కర వికరముల్ (అనారోగ్యము)
హారతి హారతి కిచ్చిరి.
నందన నందన నీకు వంద వందనాలు.
సుందర దరహాసములు.
నీ శుభంకర కరములు 
రాజా! నీవు రమాగురుని గురుని జయించావు.
శివ శివభక్తుడు 
‘మనసా మన సామర్థ్యమేమి?’

తెలుగు చిత్రాల్లోని పాటల్లో కొన్ని ఉదాహరణలు 

క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన. 

ఆబాలగోపాల మా బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ తాండవమాడిన సరళి (సప్తపది)

ఇక్కడ "అచ్చెరువున" అనే పదం రెండుసార్లు మధ్యలో వేరే అక్షారాలు లేకుండా వచ్చింది. మొదటి అచ్చెరువున అన్న పదానికి "ఆ చెరువున" (త్రికసంధి) అని అర్థం. రెండోసారి అచ్చెరువున అన్నప్పుడు "ఆశ్చర్యంతో" (అచ్చెరువు అన్నది "ఆశ్చర్యం" యొక్క వికృతిశబ్దం) అని అర్థం. అంటే ఆ వాక్యం భావం "కాళిందు చెరువులో ఉన్న కృష్ణుణ్ణి ఆశ్చర్యంతో చూశారు" అని. ఇది ఛేకానుప్రాస.

ఇందులోనే "ఆబాలగోపాలమా బాలగోపాలుని" అన్నది ఛేకానుప్రాసలాగా కనిపిస్తున్నా… కాదు! ఎందుకంటే, "ఆబాలగోపాలము" "ఆ బాలగోపాలుని" మధ్యలో రెండు అక్షరాల భేదం ఉంది. ఇది వేరే (యమకం) అలంకారమవుతుంది. దాని సంగతి ఆ అలంకారాన్ని చర్చించుకునేటప్పుడు చూద్దాం.
మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనాగీతి పలికించి (సప్తపది)
"ఆ రాధ" అంటే "రాధమ్మ" అని, "ఆరాధనాగీతి" అంటే ప్రేమగీతం అని అర్థం. ఇక్కడ "ఆ రాధ" అన్న అక్షరాల కలయిక రెండుసార్లు పక్కపక్కనే వచ్చింది. ఇది ఛేకానుప్రాస. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే ఈ రెండు "ఆరాధ" అనేది అర్థవంతమైన పదం కాదు. మొదటి సారి అది రెండు పదాల కలయిక అయితే, రెండో సారి అది ఒక పదంలో భాగం మాత్రమే! అయినా ఫరవాలేదు. అందుకే సూత్రంలో "రెండు లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలసమూహం" కానీ "పదం" అని కాదు.

ఈ పట్టుకోకట్టుకోవాలమ్మో, ఆ కట్టు ఆకట్టుకోవాలమ్మో (కోకిల)
చుక్కలలో చక్కదనం దాచినదానా, ఎలాగైనా లాగెయ్-నా? ఏదో చెయ్-నా? దోచైనా?
ఇందురుడో చందురుడో మావా హోల్ ఆంధ్ర కే నచ్చాడమ్మా... (రాజకుమారుడు)
ఈ ఉదాహరణ బహుశా సరైనది కాకపోవచ్చును. ఎందుకంటే "లాగైనా" కి "లాగెయ్-నా" కి తేడా ఉంది. కాకపోతే శబ్దాలంకారము అంటే శబ్దాన్ని ఎలాగ వింటాము అన్నదాన్ని బట్టి కాబట్టి ఛేకానుప్రాసకు ఉండాల్సిన స్ఫూర్తి దీనికి ఉందని నమ్మకం.
అంతో ఇంతో సాయం చెయ్య చెయ్యందియ్యాలయ్యా (కొండవీటి దొంగ)