Showing posts with label త్యాగరాజు. Show all posts
Showing posts with label త్యాగరాజు. Show all posts

ఎందరో మహానుభావులందరికి


ఎందరో మహానుభావులందరికి వందనము
త్యాగరాజు
శ్రీ - ఆది
గానం: బాలమురళి

పల్లవి:

ఎందరో మహానుభావు లందరికి వందనము ఎం..

అను పల్లవి:

చందురు వర్ణుని యంద చందమును హృదయార
విందమునఁ జూచి బ్రహ్మానంద మనుభవించు వా రెం..

చరణము(లు):

సామగానలోల మనసిజలావణ్య ధన్యమూర్ధన్యు లెం..
మానస వనచరవర సంచారము సలిపి
మూర్తి బాగుగఁ బొడగనెడు వా రెం..

సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము జేయు వా రెం..

పతితపావనుఁడగు పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజమా
ర్గముతోను బాడుచును సల్లాపముతో
స్వరలయాది రాగములఁ దెలియు వా రెం..

హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్తకోటు లిలలో
తెలివితోఁ జెలిమితోఁ గరుణ గల్గి
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా రెం..

హొయలుమీర నడలు గల్గు సరసుని
సదాకనులఁ జూచుచును పులక శ
రీరులై యానందపయోధి నిమగ్నులై
ముదంబునను యశము గల వా రెం..

పరమ భాగవత మౌనివర శశి
విభాకర సనక సనందన
దిగిశ సుర కింపురుష కనకకశిపు
సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్రధర శుక
సరోజభవ భూసురవరులు
పరమపావనులు ఘనులు శాశ్వతులు
కమలభవ సుఖము సదానుభవులు గాక ఎం..

నీ మేని నామ వైభవంబులను
నీ పరాక్రమ ధై
ర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమున రఘువర నీయెడ
సద్భక్తియు జనించకను దుర్మతములను
కల్ల జేసినట్టి నీమది
నెఱింగి సంతతంబునను గుణ భజనా
నంద కీర్తనము జేయు వా రెం..

భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మముల\న్‌ శివాది షణ్మతముల
గూఢముల\న్‌ ముప్పదిముక్కో
టి సురాంతరంగముల భావంబుల
నెఱిఁగి భావ రాగ లయాది సౌఖ్య
ముచే చిరాయువు గలిగి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వా రెం..

ప్రేమ ముప్పిరి గొను వేళ
నామము దలచువారు
రామభక్తుఁడైన త్యాగ
రాజనుతుని నిజదాసులైన వా రెం..

ద్వైతము సుఖమా


ద్వైతము సుఖమా
త్యాగరాజు కీర్తనలు
రీతిగౌళ - ఆది
ప్రియా సిస్టర్స్

పల్లవి:

ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా ద్వై..

అను పల్లవి:

చైతన్యమా విను సర్వసాక్షీ వి
స్తారముగాను దెల్పుము నాతో ద్వై..

చరణము(లు):

గగన పవన తపన భువనాద్యవనిలో
నగధరాజ శివేంద్రాది సురలలో
భగవద్భక్తవరాగ్రేసరులలో
బాగ రమించే త్యాగరాజార్చిత ద్వై..

తులసీ దళములచే


తులసీ దళములచే
త్యాగరాజు కృతులు
రాగం: మాయామాళవగౌళ రాగం
మంగళంపల్లి బాలమురళీకృష్ణ

పల్లవి:

తులసీ దళములచే సంతోషముగా పూజింతూ

అనుపల్లవి:

పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను

చరణం:

సరసీరుహ పున్నాగ చంపక పాటల కొలువగ
కరవీర మల్లికా సుగంధ రాజసుమముల్
ధరనివి యొక పర్యాయము ధర్మాత్ముని
సాకేత పురవాసుని శ్రీరాముని వరత్యాగరాజసుతుని

సమయానికిఁ దగు మాటలాడెనే


సాధించెనే ఓ మనసా స..
త్యాగరాజు కీర్తనలు
ఆరభి - ఆది
మంగళంపల్లి బాలమురళీకృష్ణ

పల్లవి:

సాధించెనే ఓ మనసా స..

అను పల్లవి:

బోధించిన సన్మార్గ వచనముల
బొంకు జేసి తాఁ బట్టినపట్టు సా..

చరణము(లు):

సమయానికిఁ దగు మాటలాడెనే సమ..
దేవకి వసుదేవుల నేగించినటు సమ..
రంగేశుఁడు సద్గంగా జనకుఁడు
సంగీత సాంప్రదాయకుఁడు సమ..
గోపీ జన మనోరథ మొసంగ లేకయే
గేలియుఁ జేసెడువాఁడు సమ..
వనితల సదా సొక్కఁ జేయుచును
మ్రొక్కఁ జేసె పరమాప్తుఁడదియుగాక
యశోద తనయుఁడంచు ముదంబునను
ముద్దుఁ బెట్ట నవ్వుచుండు హరి సమ..
పరమభక్తవత్సలుఁడు సుగుణ
పారావారుం డాజన్మ మనఘఁడీ కలి
బాధల దీర్చువాఁడనుచు నే హృదాం
బుజమున జూచుచుండగ హరి సమ..
హరే రామచంద్ర రఘుకులేశ
మృదు సుభాష శేష శయన
పరనారీ సోదరాజవిరాజ తురగ
రాజ రాజనుత నిరామయాపఘన
సరసీరుహ దళాక్ష యనుచు
వేడుకొన్న నన్ను తాఁ బ్రోవకను సమ..
శ్రీవేంకటేశ స్వప్రకాశ సర్వోన్నత సజ్జన
మానస నికేతన కనకాంబరధర లస న్మకుట
కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా
త్యాగరాజ గేయుఁడు మానవేంద్రుఁ
డైన రామచంద్రుఁడు సమ..
సద్భక్తులనడత లిట్లనెనే
యమరికగా నాపూజఁ గొనెనే
యలుగ వద్దనెనే
విముఖులతోఁ జేరఁ బోకు మనెనే
వెత గలిగిన తాళు కొమ్మనెనే
దమశమాది సుఖదాయకుఁడగు శ్రీ
త్యాగరాజ నుతుఁడు చెంతరాకయే సా..

తెరతీయగరాదా


తెరతీయగరాదా
త్యాగరాజు కృతులు
గౌళిపంతు - ఆది
ప్రియా సిస్టర్స్

పల్లవి:

తెరతీయగ రాదా (నా)లోని
తిరుపతి వెంకటరమణ మత్సరమను ॥తె॥

అను పల్లవి:

పరమపురుష ధర్మాదిమోక్షముల
పారదోలుచున్నది నాలోని ॥తె॥

చరణము(లు):

వాగురయని తెలియక మృగ గణములు
వచ్చి తగులురీతి యున్నది
వేగమే నీ మతము ననుసరించిన
త్యాగరాజనుత! మదమత్సరమను ॥తె॥

ఇరవొందగ భుజియించు సమయమున
ఈగ తగులురీతి యున్నది
హరిధ్యానము సేయువేళ చిత్తము
అంత్యజువాడకుఁ బోయినట్లున్నది ॥తె॥

మత్స్యము ఆకలిగొని గాలముచే
మగ్నమైనరీతి యున్నది
అచ్చమైన దీప సన్నిధిని మరు
గిడఁబడి చెఱిచినట్లున్నది ॥తె॥