ఒలియో ఒలీ పొలియో పొలీ

సంక్రాంతి జానపదగీతం
రోజులు మారాయి (1955)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత: కొసరాజు
గానం: ఘంటసాల బృందం

పల్లవి:

ఒలియ ఒలియో ఒలియా  
రావేలుగలవాడా రార పొలిగాడ
హేయ్ 
ఒలియో ఒలీ పొలియో పొలీ 
రావేలుగలవాడ రారా పొలీ
వెయివేలుగలవాడ రారా పొలీ

చరణాలు:

వేగుచుక్కా బొడిచి వినువీధికెక్కెరా
కొక్కొరోయనీ కోడిపుంజు కూతేసెరా
కల్లోలపడి జగము త్రుళ్ళిపడి లేచెరా 
కల్లోలపడి జగము త్రుళ్ళిపడి లేచెరా
బూటకపు బ్రతుకోళ్ళ ఆట కట్టిందిరా 

పైవాళ్ళ లంచాల బాధలేకుండాలి 
వడ్డి డబ్బులవాళ్ళ వాతబడకుండాలి 
చెమటదీసిన శ్రమా చేతిలో కందాలి 
మాచేను పండాలి మా ఇల్లు నిండాలి 

పైరు జేసేదొకడు పంట గోసేదొకడు
చెట్టు నాటేదొకడు పండ్లు మెక్కేదొకడు
పసుల మేపేదొకడు పాడి తాగేదొకడు
పాటంత ఒకడిది ఫలితమింకొకడిది

ఇంటి పెత్తనమొకడు వీధి పెత్తనమొకడు 
గ్రామ పెత్తనమొకడు సీమ పెత్తనమొకడు 
అందరూ అందలం ఎక్కి కూర్చుంటేను 
అసలు మోసేదెవరొ అంతు తేలకపోయె 

గోచిపాతని యొకడు ఘోష పెడుతున్నాడు 
కోటు లేదని యొకడు గొడవ చేస్తున్నాడు 
తిండిదొరుకక ఒకడు తిప్పలూ పడుతుంటే 
తిన్నదరుగక ఒకడు తికమకలు పడెనురా 

ఉన్న పన్నులకొకడు ఓపలేకున్నాడు 
కొత్తపన్నుల నొకడు గుంజబోతున్నాడు 
బంజరే లేకొకడు ప్రార్థిస్తు ఉంటేను 
చెరువుగట్టుక ఒకడు చేను జేస్తున్నాడు 

కరువుకాటాకాల బరువు మోయాలిరా 
పరుల నోటికి జడిసి బ్రతుకు దోయాలిరా 
అమ్మబోతే అడివి కొనబోతే కొరివిరా 
అమ్మబోతే అడివి కొనబోతే కొరివిరా
న్యాయమంటే వినే నాధుడే లేడురా 

ఓ బొజ్జగణపయ్య ఉండ్రాళ్ళు బోస్తాము 
ఉండ్రాళ్ళు బోస్తాము
గంగమ్మ తల్లిరో 
గంగమ్మ తల్లిరో
పొంగళ్లు పెడతాము 
పొంగళ్లు పెడతాము 
మానెడుకు పుట్టెడై మారాశి పెరిగితే 
పొలిపొలేలుగ నిన్ను పూల పూజిస్తాము 

బంతిమాలు బంతిమాలుయ్యాలో 
ఎల్లెడ్ల బంతిమాలుయ్యాలో
పుల్లెడ్ల బంతిమాలుయ్యాలో 
దున్నలూ దొక్కంగ తూగింది రాశి ఉయ్యాలో 
ఎద్దులూ దొక్కంగ ఎదిగింది రాశి ఉయ్యాలో
బంతిమాలు బంతిమాలుయ్యాలో 
ఎల్లెడ్ల బంతిమాలుయ్యాలో
పుల్లెడ్ల బంతిమాలుయ్యాలో 

రాశెక్కి పొలిగాడు రంపటిల్లాడే 
వామెక్కి పొలిగాడు వంతబాడాడే
కళ్ళంలొ పొలిగాడు గంతులేశాడే 
మాచేలొ పొలిగాడు మంచెవేశాడే
బంతిమాలు బంతిమాలుయ్యాలో 
ఎల్లెడ్ల బంతిమాలుయ్యాలో
పుల్లెడ్ల బంతిమాలుయ్యాలో    
 

No comments:

Post a Comment

Leave your comments